సప్తభూమి, కొండ పొలెం, మైదానం... ఈమధ్య సినిమాలుగా తెరకెక్కుతున్న నవలల పేర్లివి. ఇప్పుడంటే నవలా చిత్రాలు వస్తుంటే ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి గానీ, ఇది వరకు నవలలు సినిమాలుగా రావడం చాలా సహజం. మరీ ముఖ్యంగా యండమూరి, యద్దలపూడి సులోచనారాణి నవలలైతే.. కోకొల్లలుగా వచ్చాయి. యండమూరి నవలలు చాలా వరకూ చిరంజీవి సినిమా కథలుగా మారిపోయాయి. ఇప్పుడు మరో యండమూరి నవల సినిమాగా మారుతోంది. అదే `ఆనందో బ్రహ్మ`.
ఈ నవల హక్కుల్ని ఓ ఎన్ఆఐ కొనుగోలు చేశారు. త్వరలోనే ఈనవలని సినిమాగా తీయబోతున్నారు. నిజానికి `ఆనందో బ్రహ్మ`ని సినిమాగా తీయాలని చాలామంది అనుకున్నారు. కానీ ఎందుకో.. ఆ ప్రయత్నం ముందుకు సాగలేదు. ఇన్నాళ్లకు ఈ నవలపై మరో నిర్మాతకు ఆసక్తి కలిగింది. హక్కులు తీసుకోవడం, అగ్రిమెంట్లు చేసుకోవడం కూడా అయిపోయాయి. ప్రస్తుతం సినిమాకి తగ్గ మార్పులు, చేర్పులతో స్క్రిప్టు రూపంలో మారబోతోంది. త్వరలోనే ఈ ఈ సినిమాకి సంబంధించిన ఓ అధికారిక ప్రకటన రాబోతోంది.