సినిమా వాళ్ల జీవితాలు చాలా చిత్రంగా ఉంటాయి. సినిమాల్లోనూ అలాంటి మలుపులు ఉండవేమో..? `కేజీఎఫ్`తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన యష్ జీవితం చూస్తే అదే అనిపిస్తుంది. ఓ బస్సు డ్రైవరు కొడుకు.. ఇప్పుడు ఇండియాలోనే గుర్తింపు తెచ్చుకున్న పెద్ద స్టార్. తనపై వందల కోట్లతో సినిమాలు తీస్తున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. కాకపోతే.. ఆ ప్రయాణంలో ఎదుర్కొన్న అవమానాలు, చేసిన సాహసాలు గుర్తొస్తే మాత్రం `ఔరా` అనిపిస్తుంది.
కేవలం జేబులో 300 రూపాయలతో సొంతూరు నుంచి బెంగళూరు పారిపోయి వచ్చాడు యష్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ``మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. నాన్న బస్సు డ్రైవరు. నాకు చిన్నప్పటి నుంచీ సినిమాలంటే చాలా ఇష్టం. హీరో అవ్వాలని కలలు కనేవాడ్ని. 17 ఏళ్ల వయసులో మా నాన్నగారి జేబులోంచి 300 రూపాయలు కాజేసిఇంట్లోచి పారిపోయా. బెంగళూరులో.. ఓ నాటకాల ట్రూపులో చేరా. ఆ తరవాత.. సీరియళ్లు చేశా. 2008లో తొలి సినిమా అవకాశం వచ్చింది. అక్కడి నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు.`` అని తన ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు యష్. అన్నట్టు యష్ అసలు పేరు.. నవీన్ కుమార్ గౌడ. `య`తో మొదలయ్యే పేరైతే కలిసొస్తుందని జ్యోతిష్యుడు చెప్పడంతో యష్ గా మార్చుకున్నాడు. నిజానికి యష్ గా మారాకే.. తనకు బాగా కలిసొచ్చింది.