షాడో తరవాత.. మళ్లీ మెగా ఫోన్ పట్టలేదు మెహర్ రమేష్. అప్పటి నుంచీ.. ఆయన సినిమాలకు దూరంగానే ఉన్నారు. మెహర్ ని జనాలంతా మర్చిపోతున్న వేళ, అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. మెగా ఛాన్స్ కొట్టేశారు. చిరంజీవితో సినిమా చేసే అరుదైన అవకాశం దక్కించుకున్నారు. ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉన్నారు మెహర్. ఈ ప్రాజెక్టు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు మెహర్. ``నేను సినిమా చేసి చాలా కాలం అయ్యుండొచ్చు. కానీ సినిమాలకు మాత్రం దూరం కాలేదు.
ఈమధ్య కొన్ని హిట్ సినిమాల స్క్రిప్టు విషయంలో భాగం పంచుకున్నా. కొన్ని కథలు కూడా సిద్ధం చేసుకున్నా`` అని చెబుతున్నారు మెహర్. చిరు సినిమా గురించి మాట్లాడుతూ...``చిరంజీవిగారితో సినిమా చేయాలన్నది నా జీవిత కాల కల. నిజానికి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకునే సినిమాల్లోకి అడుగుపెట్టా. ఆయనతో సినిమా చేస్తే.. నా కల నెరవేరినట్టే. గత మూడేళ్లుగా ఆయన కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నా. ఆ స్క్రిప్టు తప్ప మరే పనీ పెట్టుకోలేదు. త్వరలోనే నాకల నెరవేరబోతోంది.
ఈ అవకాశాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వృధా కానివ్వను`` అని చెప్పుకొచ్చాడు మెహర్. ఓ అభిమాని, తనకు ఇష్టమైన హీరోతో సినిమా చేస్తే.. అది ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి మెహర్ ఏం మ్యాజిక్ చేస్తాడో?