చిత్రం: యాత్ర 2
నటీనటులు: మమ్ముట్టి, జీవా
దర్శకత్వం: మహి. వి. రాఘవ్
నిర్మాత: శివ మేక
సంగీతం: సంతోష్ నారాయణన్
ఛాయాగ్రహణం: మధీ
కూర్పు: శ్రవణ్ కటికనేని
బ్యానర్స్: త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్
విడుదల తేదీ: 8 ఫిబ్రవరి 2024
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2.5/5
ఎన్నికల మూడ్ కి తగ్గట్టుగా సినిమాలు రావడం ఎప్పటినుంచో వుంది. మరికొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నగార మోగుతుంది. ఈ క్రమంలో కొన్ని పొలిటికల్ సినిమాలు రెడీ అవుతుంది. యాత్ర 2 కూడా ఇలా వచ్చిన సినిమానే. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ ని తెరకెక్కించాడు దర్శకుడు మహి వి రాఘవ. సరిగ్గా గత ఎన్నికల సమయంలో ఈ సినిమాని విడుదల చేశారు. వైఎస్ మరణంతో ఆ సినిమాని ముగించారు. యాత్ర2లో వైఎస్ తనయుడు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినంతవరకూ జరిగిన పరిణామాలు చూపించారు. మరా ప్రయాణం ఎలా సాగింది ? జగన్ జర్నీ ప్రేక్షకులని మెప్పించిందా?
ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి( మమ్ముట్టీ) హెలిక్యాప్టర్ ప్రమాదంలో చనిపోతారు. ఆయన మరణ వార్త తట్టుకోలేక చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. అలా ప్రాణాలు కోల్పోయిన వారిని ఓదార్చడానికి యాత్ర చేపడతాడు జగన్ (జీవా). అయితే ఈ యాత్రని అనుమతించని కేంద్రంలోని ప్రోగ్రస్ పార్టీ.. వెంటనే యాత్రని నిలిపివేయాలని ఆదేశిస్తుంది. అధిష్టానాన్ని ఎదిరించి యాత్ర కొనసాగించిన జగన్.. తర్వాత ఎలాంటి పరిస్థితులని ఎదురుకున్నాడు? అనేది మిగతా కథ.
విశ్లేషణ: వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి కథ మొదలౌతుంది. వైఎస్ ప్రాణాలు కోల్పోయిన తీరు.. శత్రువుకైనా కంటతడి పెట్టిస్తుంది. ఆయన కథలో ఆ ఎమోషన్ వుంది. ఆ ఎమోషన్ మరోసారి తెరపై చూపించాడు దర్శకుడు. ఇక్కడి వరకూ యాత్ర కథ ఎంతోకొంత ఎమోషనల్ మూమెంట్ తో సాగుతుంది. తర్వాత జగన్ హైకమాండ్ ని ఎదురించిన తీరు ఏకపక్షంగా చూపించారు. ఇదే కాదు ఇందులో దాదాపు సన్నివేశాలు ఏకపక్షంగా జగన్ పాత్రకు అనుకూలంగా సాగిపోతుంటాయి. ఇంటర్వెల్ వరకూ కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ సన్నివేశాలని అల్లుకుంటూ వచ్చారు.
అయితే ఇంటర్వెల్ తర్వాత యాత్ర2లోని సన్నివేశాలు .. సీన్స్ లా కాకుండా న్యూస్ బులిటెన్స్ లా నడిపేశారు. ప్రతి సీన్ న్యూస్ రీడర్ చదివేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. మాంటేజ్ సాంగ్స్ లో యాత్ర విజువల్స్, న్యూస్ బులిటెన్.. ఇలా చప్పగా ఆల్రెడీ ప్రచారంలో వున్న వార్తలనే జగన్ కి అనుకూలంగా చూపించిన వైనం కనిపిస్తుంది. దీంతో ఇందులో సరైన సంఘర్షణ వుండదు. జగన్ జీవితంలో కొన్ని కీలక ఘట్టాలు వున్నాయి. తండ్రి పార్ధివదేహం రాకముందే సంతకాల సేకరణ చేశారని ఓ విమర్శ వుంది. అయితే ఆ సంతకాలతో జగన్ కి సంబంధం లేనట్లుగా ఇందులో చూపించారు. ఈ విషయంలో హైకమాండ్ ని మరీ విలన్ గా చూపించారు. అలాగే నేరుగా చంద్రబాబు పేరు పెట్టి ఓ విలన్ తరహా పాత్రని చూపించారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు సాక్షి ఛానల్ లో జగన్ ని పొగుడుతూ ఓ ఎపిసోడ్ ప్రచారం చేస్తున్నారా ? అనే అనుమానం చాలా చోట్ల కలుగుతుంది. దీనికి కారణం వుంది.. జగన్ గురించి చెప్పాలంటే చాలా సన్నివేశాలు వున్నాయి. కోడికత్తి కేసు, షర్మిల పాదయాత్ర, బాబాయ్ హత్య ఇలా అనేక ఉదంతాలు వున్నాయి. అయితే వీటి జోలికి పోకుండా కేవలం అనుకూలమైన అంశాలనే చూపించుకుంటూ వెళ్ళిపోయారు.
నటీనటులు: జగన్ గా జీవా బాగా కుదిరాడు. తన ఆహార్యం ఆ పాత్రకు సరిపోయింది. తన డైలాగ్ చెప్పే విధానం కూడా బావుంది. ఇందులో కడప ప్రాంత వాసులని అలరించే కొన్ని సన్నివేశాలకు కూడా పెట్టారు. కడపోడు అని చెప్పే డైలాగులు అక్కడి జనాలకు కనెక్ట్ అవుతాయి. కొన్ని సీన్లు అయినప్పటికీ వైఎస్ పాత్రలో మరోసారి హుందాగా కనిపించారు మమ్ముటీ. ఈ సినిమాకి ఆయన ప్రజన్స్ ఒక ప్రత్యేక ఆకర్షణ. చంద్రబాబు పాత్రలో కనిపించిన మహేష్ మంజ్రేకర్ ని కుట్రపూరిత మనిషిగా చూపించాడు దర్శకుడు. సోనియా పాత్రలో కనిపించిన నటి బాగా కుదిరింది. అలాగే శుభలేఖ సుధాకర్ , సచిన్ ఖేడ్కర్ పాత్రలు ఓకే అనిపిస్తాయి. మిగతా నటీనటులు పరిదిమెర కనిపించారు
టెక్నికల్: మేకింగ్ పరంగా డీసెంట్ గా వుంది. సజహమైన కెమరాపని తీరు కనిపించింది. నేపధ్య సంగీతం పరవాలేదనిపిస్తుంది. అయితే మాంటేజ్ పాటలు ఎక్కువైపోయాయి. ఆ పాటలు క్యాచిగా లేకపోవడం వలన యాత్ర చాలా చోట్ల బోరింగ్ గా అనిపిస్తుంది. పొలిటికల్ డైలాగులు బాగానే రాసుకున్నారు.
ప్లస్ పాయింట్స్
మమ్ముటీ, జీవా నటన
కొన్ని ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్
ఏక పక్షంగా సాగిన కథ
న్యూస్ బులిటెన్ ని తలపించే కథనం
ఫైనల్ వర్దిక్ట్ : యాత్ర 2.. సాక్షి టీవీ కథనం..