దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ మహి. వి. రాఘవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 'ఆనందోబ్రహ్మ' సినిమాతో ఆల్రెడీ డైరెక్టర్‌గా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు మహి.వి.రాఘవ. అయితే లో బడ్జెట్‌తో చిన్న సినిమాగా ఆ సినిమాని తెరకెక్కించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఆ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు రాఘవ.అయితే ఈ సారి వైఎస్ జీవిత చరిత్రను భారీ బడ్జెట్‌తోనే తెరకెక్కిస్తున్నాడట.
బయోపిక్స్ తెరకెక్కించడమంటే అంత ఆషామాషీ కాదు. కానీ అలాంటి కాన్సెప్ట్‌ని టేకప్ చేశాడంటే బాగా రీసెర్చ్ చేసి ఉండాలి. ఇకపోతే ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రలో ప్రముఖ మలయాళ నటుడు ముమ్ముట్టి నటిస్తున్నాడు. వైఎస్సార్ పాత్రకు అచ్చుగుద్దినట్లు సరిపోయాడు ముమ్ముట్టి. 'యాత్ర' అనే టైటిల్‌ని ఈ సినిమాకు ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కావడానికి ముందు ఆయన చేసిన పాదయాత్ర ఘట్టం వైఎస్సార్ జీవితంలో అత్యంత కీలకమైనది.
ఆ ఘట్టాన్ని కీలకంగా తీసుకునే ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు టైటిల్‌ని బట్టి అర్ధం చేసుకోవాలి. అలాగే ఆయన రాజకీయాల్లోకి రాకముందు ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలతో పాటు, సీఎం అయ్యాక ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, పేదల సంక్షేమం నిమిత్తం చేపట్టిన కార్యక్రమాలు, ఆయన మరణం తదితర అంశాలను తెరపై ఆవిష్కరించనున్నారట. ఈ నెల 8న 'యాత్ర' టీజర్‌ని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది.