స్టార్ హీరోతో సినిమా అంటే.. మాటలు కాదు. టెక్నీషియన్ల నుంచీ, నటీనటుల వరకూ పెద్ద పెద్ద పేర్లు కనిపించాల్సిందే. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో రాజీపడేది ఉండదు.
టాప్ 5 హీరోయిన్లలొ ఒకరిని సెలెక్ట్ చేసుకోవడం తప్పనిసరి. తెలుగులో హీరోయిన్లు అందుబాటులో లేకపోతే... బాలీవుడ్ నుంచైనా దిగుమతి చేయాల్సిందే. ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. హీరోయిన్ల కోసం ఎప్పటి నుంచో అన్వేషిస్తున్నారు. కైరా అద్వాణీ, అలియాభట్, సాయి పల్లవి.. ఇలా చాలా పేర్లు వినిపించాయి. వాళ్లెవరూ... ఈ సినిమాలో నటించడం లేదని తేలిపోయింది. వాళ్ల కాల్షీట్లు అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. అందుకే ఎన్టీఆర్ కొరటాలకు ఓ సలహా ఇచ్చాడట. `పెద్ద హీరోయిన్లు వద్దు... యంగ్ హీరోయిన్లతో సర్దుకుపోదాం..` అన్నాడట. ఎన్టీఆర్ దృష్టి శ్రీలీల, కృతి శెట్టిలపై పడిందని, వాళ్లలో ఒకరిని హీరోయిన్ గా ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పెళ్లి సందడితో శ్రీలీల ఎంత పేరు తెచ్చుకుందో తెలిసిన విషయమే.
ఉప్పెనతో కృతి శెట్టి విజృంభించింది. వీరిద్దరిలో ఎవరైనా సరే, ఎన్టీఆర్ పక్కన బాగానే ఉంటారు. కాంబినేషన్ కూడా కొత్తగా అనిపిస్తుంది. ఇక్కడ ట్విస్టు ఏమిటంటే... వీరిద్దరి కాల్షీట్లు కూడా ప్రస్తుతానికి ఖాళీగా లేవు. వాళ్లు ఓకే అనాలన్నా... డేట్లు సర్దుబాటు చేసుకోవాల్సిందే. ఎన్టీఆర్ సినిమా.. పైగా కొరటాల దర్శకుడు కాబట్టి.. డేట్లు ఎలాగోలా ఎడ్జిస్ట్ అవుతాయని అందరి నమ్మకం. మరి ఏం జరుగుతుందో చూడాలి.