ఈ రోజుల్లో నెటిజన్లు ఎంత ఫాస్టుగా ఉన్నారంటే.. సందు చూపిస్తే చాలు... చెలరేగిపోతున్నారు. ఓ సినిమా పోస్టర్ చూసి కథేంటో చెప్పేస్తున్నారు. థీమ్ ని బట్టి.. టైటిల్ ని పసిగట్టేస్తున్నారు. చిత్ర బృందం టైటిల్ చెప్పకపోతే...`ఈ సినిమా టైటిల్ ఇదే..` అంటూ కొత్తగా ప్రచారం మొదలెడుతున్నారు. అలా.. ఒక్కో సినిమాకి చాలా టైటిళ్లు బయటకు వస్తున్నాయి. దాంతో... చిత్ర నిర్మాతలు కంగారు పడి.. అసలైన టైటిల్ ఎనౌన్స్ చేసేస్తున్నారు. రామ్ చరణ్ - శంకర్ సినిమాకి అదే జరుగుతోంది.
చరణ్ - శంకర్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత. ఈ సినిమాకి ఇప్పటి వరకూ టైటిల్ ప్రకటించలేదు. అయితేనేం.. మార్కెట్‌లో చాలా రకాలైన టైటిళ్లు చలామణీలో సాగుతున్నాయి. ఇది వరకు `సర్కారోడు` అనే టైటిల్ పెట్టారని ప్రచారం జరిగింది. ఆ తరవాత `అధికారి` అనే పేరు బయటకు వచ్చింది.
ఈ రెండు టైటిళ్ల గురించీ చిత్రబృందం నోరు మెదపలేదు. అవును అని కానీ, కాదూ... అని కానీ చెప్పలేదు. దాంతో మూడో టైటిల్ వదిలారు. ఈసారి `సిటిజన్` అనే పేరు గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఇదైనా కరెక్టేనా, ఊహాగానాలేనా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. ఈ సినిమాకి టైటిల్ ఫిక్సయిపోయిందని, అయితే మంచి రోజు చూసి టైటిల్ ని ప్రకటించాలని చిత్రబృందం భావిస్తోందని సమాచారం అందుతోంది. మరి ఈ మూడు టైటిళ్లలో ఒకదాన్ని ఫిక్స్ చేస్తారా? లేదంటే కొత్త టైటిల్ వెలుగులోకి తీసుకొస్తారా? అనేది చూడాలి.