తారాగణం: విశాల్, అర్జున్, సమంత, ఢిల్లీ గణేష్ తదితరులు
నిర్మాణ సంస్థ: విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ
సంగీతం: యువన్ శంకర్ రాజా
ఛాయాగ్రహణం: జార్జ్
ఎడిటర్: రూబెన్
నిర్మాత: విశాల్
రచన-దర్శకత్వం: PS మిత్రన్
రేటింగ్: 2.75/5
యుద్ధాలు నేల పై జరిగాయి. నీటిపై జరిగాయి. ఆకాశంలో జరిగాయి. ఇక మీదట.. కంప్యూటర్ల మధ్య యుద్ధాలు జరుగుతాయి. అవును.. ప్రపంచం ఓ సైబర్ కేఫ్‌లా మారిపోయింది. సమాచారమంతా స్మార్ట్ ఫోన్‌లోకి ఎక్కేసింది. ఇది వరకు మన ఇంటికి దొంగతనానికి రావాలంటే.. దొంగ ఎన్నో ఎత్తులు వేయాల్సివచ్చేది. చీకట్లో, తాళాలు బద్దలు కొట్టి, గోడలు బద్దలు కొట్టి లోపలకి రావాలి. ఇప్పుడు అలా కాదు. ఒక్క మీట నొక్కి.. మన బ్యాంక్ ఎకౌంట్లో చేతులు పెట్టేస్తున్నాడు. సర్వం దోచేస్తున్నాడు. దాన్నే సైబర్ క్రైమ్ అంటున్నాం. ఈ సైబర్ క్రైమ్ విశ్వరూపాన్ని మరోకోణంలో చూపించిన సినిమా 'అభిమన్యుడు'.
* కథ
కరుణాకరన్ (విశాల్) మిలటరీ ఆఫీసర్. తనకు కోపం ఎక్కువ. అన్యాయం జరిగితే ఎదిరిస్తాడు. అప్పు అంటే భయం. అప్పులు చేస్తున్నాడని నాన్నని కూడా దూరంగా ఉంచుతాడు. మానసిక వైద్యురాలు లతా దేవి (సమంత) సలహాతో.. చిన్నప్పుడే దూరమైన నాన్న, చెల్లాయి దగ్గరకు వెళ్తాడు. మళ్లీ బంధాల్ని కలుపుకుంటాడు. చెల్లెల్ని ప్రేమించిన వాడితో పెళ్లి చేయాలనుకుంటాడు. అయితే పది లక్షలు అవసరమవుతాయి. అందులో ఆరు లక్షల్ని ఎంతో కష్టపడి, అబద్దాలు ఆడి బ్యాంకు లోన్ ద్వారా సంపాదిస్తాడు.
అయితే.. సడన్‌గా బ్యాంకులోని డబ్బంతా మాయం అవుతుంది. ఎందుకు? అని ఆరా తీస్తే.. సైబర్ క్రైమ్‌కి సంబంధించిన ఓ నేర సామ్రాజ్యమే.. కరుణాకరన్ కళ్లముందుకు వస్తుంది. ఆ సామ్రాజ్యానికి నాయకుడు వైట్ డెవిల్ అనే సత్యమూర్తి (అర్జున్). ప్రజల సమాచారాన్ని తన చేతుల్లోకి తీసుకొని, వాళ్ల బ్యాంక్ ఎకౌంట్లని హ్యాక్ చేసి, అడ్డదారుల్లో కోటాను కోట్లు సంపాదిస్తాడు. ఆ సామ్రాజ్యాన్ని... కరుణాకరన్ ఎలా నేల మట్టం చేశాడు? అనేదే కథ.
* నటీనటులు
విశాల్ మరోసారి తనకు తగిన పాత్ర ఎంచుకున్నాడు. తన బలాల్ని సరిగా ఎలివేట్ చేసే పాత్ర ఇది. అనవసరంగా ఎక్కడా హీరోయిజం చూపించలేదు.
సమంత పాత్రనీ కథకు అనుగుణంగా వాడుకున్నారు. స్టార్ హీరోయిన్ ఉంది కదా అని అనవసరంగా పాటలు ఇరికించలేదు. హీరో హీరోయిన్ ల మధ్య ఒకే ఒక్క డ్యూయెట్ ఉంది. అది కూడా.. కథకు బ్రేక్ వేసింది.
అర్జున్ ఈ కథకు ప్రాణం పోసేశాడు. విశాల్ - అర్జున్ లమధ్య తీర్చిదిద్దిన సన్నివేశాలు నువ్వా నేనా అన్నట్టు సాగాయి. ఈ సినిమాకి మేజర్ ప్లస్ అర్జున్ అని చెప్పొచ్చు.
* విశ్లేషణ
కథలు ఎక్కడి నుంచో పుట్టవు. మన చుట్టూ ఉంటాయి. మన కళ్ల ముందు జరిగిన అన్యాయంలోంచి పుడతాయి. ఇది అలాంటి కథే. సైబర్ నేరాల గురించి తరచూ మనం టీవీల్లో చూస్తున్నాం, పేపర్లో చదువుతున్నాం. అంతెందుకు ఒక్కోసారి మనమే మోసపోతున్నాం. అకౌంట్లో ఉన్న డబ్బు ఉన్నట్టుండి మాయం అవుతుంది. దాంతో తెల్లమొహాలేస్తున్నాం. దీనంతటికీ కారణం ఓ ముఠా అని తెలిస్తే.. ఎలా స్పందిస్తాం? కరుణాకరన్ పాత్ర అదే.
సామాన్యుడు ఎదుర్కుంటున్న సమస్య నుంచే కథ రాసుకున్నాడు దర్శకుడు. ఈ సమస్యకీ, కథానాయకుడి కథకీ లింకు పెట్టాలి కదా? అందుకే చెల్లాయి పెళ్లి - అందుకోసం బ్యాంకు లోను, అది వచ్చే సమయానికి బ్యాంకు ఖాతాలోని డబ్బు మాయం అవ్వడం.. ఇలా కొన్ని సన్నివేశాలు రాసుకోవాల్సివచ్చింది. ఓవైపు సైబర్ క్రైమ్, మరోవైపు.. విశాల్ జీవితం.. ఇవి రెండూ సమాంతరంగా చెప్పుకుంటూ వెళ్లాడు. అయితే సైబర్ క్రైమ్‌కి సంబంధించిన అంశాలు ఇచ్చేంత కిక్.. విశాల్ వ్యక్తిగత జీవితం, అందులోని సమస్యలు ఇవ్వకపోవొచ్చు. ఆ సన్నివేశాల్ని కాస్త ఓపిగ్గా చూడాలి. అర్జున్ ప్రవేశించేటప్పటికి ఇంట్రవెల్ కార్డు పడిపోతుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది.
హీరో - విలన్ ల మధ్య ఎత్తులు పై ఎత్తులు, నువ్వా నేనా అనే పోటీ... కథని రసపట్టులో పడేస్తుంది. సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు దర్శకుడి ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. వైట్ డెవిల్ దారిలోనే వెళ్లి, అతని ఎకౌంట్లోని డబ్బులు మాయం చేయడం, కథానాయిక ద్వారా ప్రతినాయుల ముఠాని మట్టు పెట్టడం ఇవన్నీ థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి. అయితే అక్కడక్కడ సన్నివేశాలు అర్థం కావు. సాంకేతిక పరమైన భాషని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. అన్నింటికంటే ముఖ్యంగా ఈ కథలో కథానాయకుడు మిలటరీ ఆఫీసర్ అవ్వాల్సిన అవసరం లేదు. సగటు కుర్రాడిగా చూపిస్తే ఇంకా బాగుండేది.
* సాంకేతిక వర్గం
ఇది దర్శకుడి సినిమా. తన ఆలోచనల్ని పర్‌ఫెక్ట్‌గా తెరపైకి తీసుకొచ్చాడు. అక్కడక్కడ కాస్త గందరగోళం ఉంది. సినిమా అక్కడక్కడ స్లో అయ్యింది కూడా. ఇలాంటి కథల్లో సాధారణంగా కనిపించే లోపాలే అవి. కెమెరా, నేపథ్య సంగీతం, ఎడిటింగ్ అన్నీ పక్కాగా కుదిరాయి. యాక్షన్ సీన్లు కూడా అవసరానికి తగ్గట్టే ఉన్నాయి.
* ప్లస్ పాయింట్స్
+ కథానేపథ్యం
+ అర్జున్ నటన
+ కథనం
* మైనస్ పాయింట్స్
- రెగ్యులర్ సినిమా కాదు
- అక్కడక్కడ స్లో
* ఫైనల్ వర్డిక్ట్: సైబర్ మాయ
రివ్యూ రాసింది శ్రీ