తారాగణం: నాని, అనుపమ,రుక్సార్, బ్రహ్మాజీ
నిర్మాణ సంస్థ: షైన్ స్క్రీన్స్
సంగీతం: హిప్ హప్ తమిళ
ఎడిటర్: సత్య
ఛాయాగ్రహణం: కార్తీక్
నిర్మాతలు: సాహు & హరీష్
రచన-దర్శకత్వం: మెర్లపాక గాంధీ
రేటింగ్: 2.75/5
నాని సినిమా అనేసరికి ఓ ఫీవర్ వచ్చేస్తోంది. టికెట్టు ధరకు గిట్టిబాటు అయ్యేంతగా వినోదం పంచిపెట్టడంలో నాని సక్సెస్ అయ్యాడు. అందుకే వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈమధ్య కాలంలో వరుసగా ఇన్ని హిట్లు కొట్టిన హీరో ఎవరైనా ఉన్నారంటే.. అది నానినే. అందుకే అతన్నుంచి మరో సినిమా వస్తోందంటే అటెన్షన్ పెరిగిపోతుంటుంది. కృష్ణార్జున యుద్ధం పై కూడా ఇలాంటి అంచనాలే ఉన్నాయి. పైగా ఈసారి నాని సింగిల్‌గా రావడం లేదు.. డబుల్ అయ్యాడు. మరి ఈ కృష్ణుడు, అర్జునుడు కలసి ఏం చేశారు? ఈ సినిమా ఎలా ఉంది?
* కథ
కృష్ణ, అర్జున్ (నాని) ఇద్దరూ ఒకేలా ఉంటారు. కృష్ణది చిత్తూరు. ఊర్లో ప్రతి అమ్మాయికీ లైన్ వేస్తాడు. కానీ ఒక్కరూ పట్టించుకోరు. హైదరాబాద్ నుంచి వచ్చిన రియా మాత్రం కృష్ణని ప్రేమిస్తుంది. అర్జున్ ఓ రాక్ స్టార్. యూరప్‌లో ఉంటాడు. కనిపించిన ఏ అమ్మాయినీ వదలడు. సుబ్బలక్ష్మి (అనుపమ పరమేశ్వరన్) మాత్రం పట్టించుకోదు. సుబ్బుకి ఎంత దగ్గరవ్వాలనుకున్నా... దూరం పెడుతూనే ఉంటుంది. అర్జున్‌పై కోపంతో హైదరాబాద్ వచ్చేస్తుంది. కృష్ణని రియా ప్రేమిస్తున్న విషయం తాతయ్య (నాగినీడు)కి తెలిసి.. రియాని బలవంతంగా హైదరాబాద్ పంపించేస్తాడు. రియాకి వెదుక్కంటూ కృష్ణ, సుబ్బలక్ష్మిని వెదుక్కుంటూ అర్జున్ హైదరాబాద్ వస్తారు. అయితే... హైదరాబాద్ వచ్చిన రియా, సుబ్బలక్ష్మి ఇద్దరూ కిడ్నాప్‌కి గురి అవుతారు. వీరిద్దరినీ ఎవరు కిడ్నాప్ చేశారు? ఆ సంగతి తెలుసుకున్న కృష్ణ, అర్జున్ ఏం చేశారు? అనేదే కథ.
* నటీనటుల ప్రతిభ
నాని నటన గురించి కొత్తగా ప్రశంసించేది ఏముంది? కృష్ణగా అదరగొట్టేశాడు. చిత్తూరు యాసలో విజృంభించాడు. ఆ పాత్ర ఒక్కటే ఎంటర్‌టైన్‌మెంట్ పంచుతుంది. రాక్‌స్టార్‌గా మాత్రం నాని సెట్ కాలేదనిపిస్తుంది. రాక్ స్టార్ స్టైల్ నానికి ఇంకా అబ్బలేదు. కామెడీ, ఎమోషన్.. ఇలా ప్రతీచోట రాణించాడు. కాకపోతే నాని భారీ పోరాటాలు చేస్తుంటే చూడలేం.
అనుపమ సినిమా మొత్తం సీరియెస్‌గానే కనిపించింది. తన కెరీర్‌లో ది బెస్ట్‌తో పోలిస్తే... సుబ్బలక్ష్మి పాత్ర చాలా దూరంలో ఉంటుంది. రుక్సార్ బాగానే ఉన్నా.. పెద్దగా ప్రాధాన్యం లేని పాత్ర. విలన్ గ్యాంగ్‌లో గుర్తు పెట్టుకునేవాడు ఒక్కడూ లేడు. బ్రహ్మాజీ, ప్రభాస్ శీను ఓకే అనిపిస్తారు. కృష్ణ బ్యాచ్ నవ్విస్తుంది.
* విశ్లేషణ
ఆపదలో ఉన్న ప్రియురాల్ని హీరో ఎలా పాడుకున్నాడు? అనే పాయింట్ చుట్టూ తిరిగే కథ ఇది. అయితే ఇక్కడ హీరోలు ఒకరు కాదు.. ఇద్దరు. హీరోయిన్ ఒకరు కాదు.. ఇద్దరు. ఈ పాయింట్‌కి డ్యూయెల్ రోల్ అనే ఎట్రాక్షన్ జోడించి కొత్తదనం తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఓ కథ చిత్తూరులో, మరో కథ యూరప్‌లో సమాంతరంగా సాగుతుంటుంది. చిత్తూరు నాని గాడు.. ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తుంటాడు. మరోవైపు యూరప్‌లో అర్జున్ రొమాంటిక్ స్టోరీ నడుస్తుంటుంది. ఈ రెండింట్లో చిత్తూరు ఎపిసోడ్ మాత్రమే ఆకట్టుకుంటుంది. అర్జున్ కథ రొటీన్‌గా సాగుతూ.. అక్కడక్కడ నవ్విస్తూ. చాలా చోట్ల విసిగిస్తుంటుంది. రెండు కథల్నీ ఇంట్రవెల్ పాయింట్ దగ్గర తీసుకొచ్చి.. ఒకే తాడుకి ముడి పెట్టడం బాగుంది.
అక్కడ్నుంచి కథంతా తెలిసినదే. హీరోయిన్లను కాపాడుకోవడానికి హీరోలు చేసే యుద్ధమే సినిమా. సెకండాఫ్ అంతా క్రైమ్ నేపథ్యంలో సాగుతుంది. అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి విదేశాలకు ఎగుమతి చేసే ముఠాతో ఇద్దరు హీరోలు చేసే యుద్ధమన్నమాట. యుద్ధం కాబట్టి.. సీరియెస్‌గానే ఉండాలి. అందుకే కామెడీకి చోటు దక్కలేదు.నాని అంటే వినోదం ఆశిస్తారు. ఫస్టాఫ్‌లో చిత్తూరు యాసలో కృష్ణ అదరగొట్టేశాక సెకండాఫ్‌లో అంతకు మించి ఆశిస్తారు. కానీ దాన్ని అందివ్వడంలో ఇద్దరు నానిలు విఫలమయ్యారు.
కథలో ట్విస్టులేం ఉండదు. స్క్రీన్ ప్లే మ్యాజిక్ కనిపించదు. చాలా రొటీన్‌గా.. ఫ్లాట్ గా సాగిపోతోంది. ఈ కథ ఎప్పుడు అయిపోతుందిరా బాబూ... అనిపించేలా ఉంది. పాటలు మధ్యలో అడ్డుపడతాయి. వాటి ప్లేస్ మెంట్‌తో పాటు.. ఆ పాటలూ సరిగా లేవు. యాక్షన్ ఎపిసోడ్ల డోసు పెరిగింది. యాక్షన్ ఇమేజ్ ఉన్న మరో హీరో ఇలాంటి ఫైట్లు చేస్తే ఓకే. నాని కూడా ఆ రేంజులో పోరాటాలకు దిగిపోయే సరికి.... రుచించలేదు.
* సాంకేతిక వర్గం
హిప్ ఆప్ తమిళ అందించిన పాటల్లో చిత్తూరు జానపదం బాగుంది. ఆ పాటని చిత్రీకరించిన విధానం కూడా నచ్చుతుంది. అయితే మిగిలిన పాటలేవీ ఆకట్టుకోవు. పాటలు ఈ సినిమాకి పెద్ద మైనస్. దర్శకుడు రాసుకున్న కథలో కొత్తదనం లేదు. డ్యూయెల్ రోల్ తప్ప.. ట్రీట్‌మెంట్‌లో వైవిధ్యం లేదు. ఫస్టాఫ్ లో కామెడీ పండింది. సెకండాఫ్‌లో అది లేకపోవడం పెద్ద లోటు. సెకండాఫ్ ట్రీట్‌మెంట్లో దర్శకుడు తెలివితేటల్ని చూపించాల్సింది. కెమెరా, ఇతర టెక్నికల్ టీమ్ బాగానే వర్క్ చేసింది.
* ప్లస్ పాయింట్స్
+ కృష్ణ కామెడీ
+ ఫస్టాఫ్
* మైనస్ పాయింట్స్
- పాటలు
- సెకండాఫ్
* ఫైనల్ వర్డిక్ట్: కృష్ఱుడు ఓకే... అర్జునుడు డౌటే
రివ్యూ రాసింది శ్రీ