విజేత మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

తారాగణం: కళ్యాణ్ దేవ, మాళవిక నాయర్, మురళీ శర్మ తదితరులు
నిర్మాణ సంస్థ: వారాహి చలన చిత్రం
ఎడిటర్: కార్తిక శ్రీనివాస్
ఛాయాగ్రహణం: సెంథిల్ కుమార్
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
నిర్మాతలు: రజిని కొర్రపాటి & సాయి కొర్రపాటి
రచన-దర్శకత్వం: రాకేశ్ శశి

రేటింగ్: 2.5/5

మెగా ఇంటి నుంచి మ‌రో హీరో వ‌స్తున్నాడంటే... అటెన్ష‌న్ పెరిగిపోతుంది.  వాళ్లేం చేస్తారో, ఎలా ఉంటారో, మాస్‌ని ఎలా అల‌రిస్తారో.. అంటూ ఎదురుచూస్తుంటారు. మెగా అల్లుడు  క‌ల్యాణ్ దేవ్ పైనా అలాంటి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. `విజేత‌` అనే టైటిల్‌, సాయి కొర్ర‌పాటి బ్యాన‌ర్‌, ట్రైల‌ర్లు.... ఇవ‌న్నీ చూస్తే `ఫీల్ గుడ్ సినిమా` ఏదో వ‌స్తోంద‌న్న ఫీలింగ్ క‌లిగింది. 

ఓ విధంగా మాస్ అభిమాన గ‌ణం ఎక్కువ‌గా ఉన్న మెగా ఫ్యామిలీకి... ఇలాంటి క‌థ‌లు కొత్త‌. కానీ కళ్యాణ్ దేవ్ ఆ త‌ర‌హా క‌థ‌ని ఎంచుకునే బోణీ కొట్టాడు. మ‌రి త‌న నిర్ణ‌యం స‌రైన‌దేనా?  కళ్యాణ్ దేవ్‌ని ఈ చిత్రం బాక్సాఫీసు `విజేత‌`గా నిల‌బెడుతుందా?

* క‌థ‌

శ్రీ‌నివాస‌రావు (ముర‌ళీ శ‌ర్మ‌) ఓ మ‌ధ్య‌త‌ర‌గ‌తి మ‌నిషి. కుటుంబం అంటే ప్రాణం. అందులోనూ కొడుకు రామ్ (కళ్యాణ్ దేవ్‌) అంటే ఇంకా ఇష్టం. త‌న‌కేం కావాలో అది ఇస్తాడు, తాను కోరుక‌న్న‌ది చ‌దివిస్తాడు. కానీ.. రామ్‌కి బాధ్య‌త‌లు ప‌ట్ట‌వు. తాను తెచ్చుకున్న అత్తెస‌రు మార్కుల‌కు ఉద్యోగాలు దొర‌క‌వు. కొడుకు ప్రయోజ‌కుడిగా మారితే చూడాల‌న్న‌ది తండ్రిగా శ్రీ‌నివాస‌రావు ఆశ‌. ఈ ఆందోళ‌న‌లో త‌న ఆరోగ్యం కూడా దెబ్బ‌తింటుంది. 

ఆవారాగా తిరిగే రామ్‌.. త‌న  బాధ్య‌త‌ని ఎప్పుడు తెలుసుకున్నాడు, ఎలా తెలుసుకున్నాడు?  రామ్ జీవితాన్ని మార్చిన ఘ‌ట‌న ఏం జ‌రిగింది?  దాని నుంచి త‌ప్పుల్ని ఎలా తెలుసుకున్నాడు? అనేదే `విజేత‌`  క‌థ‌.

* న‌టీన‌టులు

ఇదే తొలి సినిమా కాబ‌ట్టి కళ్యాణ్ దేవ్‌ లో చిన్న చిన్న లోపాలున్నా స‌ర్దుకోవొచ్చు. తొలి సినిమాకి ఈ మాత్రం చేశాడంటే ఓకే.  ఓ పాట‌లో డాన్స్ మూమెంట్స్ కూడా సింపుల్‌గా అనిపించాయి. ఎమోష‌న్ సీన్ల వ‌ర‌కూ ఇంకాస్త హోం వ‌ర్క్ చేయాలి. బాడీ లాంగ్వేజ్ అవీ.. కాస్త చూసుకోవాలి. 

మాళ‌విక అందంగా ఉంది. అయితే హీరోయిన్‌గా కాకుండా క‌థ‌లో ఓ భాగంగా చూడాలంతే. 

ముర‌ళీ శ‌ర్మ‌కే ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. మ‌ధ్య‌త‌ర‌గ‌తి నాన్న‌గా ఆయ‌న న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. ప‌తాక స‌న్నివేశాల్లో మ‌రింత మెప్పిస్తుంది. 

నాజ‌ర్ ది చిన్న పాత్రే. కానీ ఆయ‌నా త‌న అనుభ‌వాన్ని  రంగ‌రించారు. స్నేహితుల గ్యాంగ్‌లో ఉన్న న‌టులు, స‌త్యం రాజేష్‌.. న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు.

* విశ్లేష‌ణ‌

కళ్యాణ్ దేవ్ తొలి సినిమా ఇది. మెగా ఇంటి నుంచి వ‌చ్చాడు కాబ‌ట్టి, మాస్ హీరోగా ఎలివేట్ చేద్దామ‌న్న ఆశ‌లు, ఆలోచ‌న‌లు ఉంటాయి. అయితే వాట‌న్నింటినీ ప‌క్క‌న పెట్టి క‌థ‌కి పెద్ద పీట వేసిన‌ట్టు అనిపిస్తోంది. ఇదేం కొత్త క‌థ కాదు. మ‌నం ఊహించ‌ని క‌థ అంత‌కంటే కాదు. ఓ ఆవారా ప్ర‌యోజ‌కుడిగా  ఎలా మారాడు? అనేదే పాయింట్‌. దాన్ని చాలా సినిమాల్లో చూశాం. ఇందులోనూ అదే క‌థ‌. కాక‌పోతే ట్రీట్‌మెంట్ వేరు, పాత్ర‌లు వేరు, లొకేష‌న్లు వేరు. అంతే తేడా. 

తొలి స‌గం అంతా... రామ్ అల్ల‌రి చేష్ట‌లు, ఆక‌తాయి త‌నం, ప్రేమ‌క‌థ‌తో సాగాయి. అయితే ఇవేం కొత్త‌గా అనిపించ‌వు. ఇంటికి లేట్‌గా వెళ్ల‌డం, ఫ్రెండ్స్ పిచ్చాపాటి క‌బుర్లు చెప్పుకోవ‌డం, ఎదురింటి అమ్మాయికి బీటు కొట్టడం... ఇదే క‌థ‌. ద్వితీయార్థ‌లో కాస్త ఎమోష‌న్ ట‌చ్ ఇచ్చాడు. ఈసినిమాకి అదే బ‌లం అనుకోవొచ్చు. తండ్రి ఆశ‌యం నెర‌వేర్చ‌డానికి త‌న‌యుడు చేసే ప్ర‌య‌త్నం..  వాటి చుట్టూ న‌డిచే భావోద్వేగాలు ఆక‌ట్టుకుంటాయి. `మీ కోసం తల్లిదండ్రులుచాలా త్యాగాలు చేశారు.. చివ‌రి రోజుల్లో వాళ్ల ఆశ‌ల్ని, కోరిక‌ల్ని తీర్చ‌డానికి ప్ర‌య‌త్నించండి` అనే సందేశం  ఈసినిమాతో ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. అది కూడా హృద‌యాన్ని హ‌త్తుకుంటుంది.

హీరో త‌న స్నేహితుల‌తో క‌ల‌సి ఓ కంపెనీ పెట్ట‌డం, అందులో ఓ భాగంగా ఓ కుటుంబాన్ని నిల‌బెట్టడం.. ఇవ‌న్నీ కాస్త డ్ర‌మెటిక్‌గా అనిపించినా, క‌థ‌లో భాగంగా వాటినీ వాడుకున్నాడు. ప్రేమ‌క‌థంటూ సెప‌రేట్‌గా ఉండ‌దు. క‌థానాయిక క‌థలో ఓ పాత్ర‌లా క‌నిపిస్తుందంతే. ఫైట్ల జోలికి పోకుండా.. క‌థ‌కు ఏం కావాలో.. దాన్ని బ‌ట్టి స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు. మొత్తానికి ఓ ఫ్యామిలీ డ్రామాని.. కుటుంబ ప్రేక్ష‌కులంతా క‌ల‌సి చూసేలా ద‌ర్శ‌కుడు మ‌లిచాడు. కాక‌పోతే.. కాస్త ఓపిక కావాలంతే.

* సాంకేతికంగా

టెక్నిక‌ల్‌గా ఈ సినిమా ఉన్న‌త స్థానంలో ఉంది. ఎక్కువ మార్కులు కెమెరామెన్ సెంథిల్‌కి ప‌డ‌తాయి. చికెన్ పాట థియేట‌ర్లోనూ ఆక‌ట్టుకుంటుంది. అయితే సంద‌ర్భోచితంగా మాత్రం అనిపించ‌దు.  డైలాగులు అక్క‌డ‌క్క‌డ హృద‌యానికి హ‌త్తుకున్నాయి. ద‌ర్శ‌కుడు రాసుకున్న‌ది చాలా సింపుల్ పాయింట్‌. దాన్ని అంతే సింపుల్‌గా తీశాడు. మ‌రీ ఎక్కువ‌గా ఊహించుకోకుండా థియేట‌ర్‌కి వెళ్తే టైమ్ పాస్ అయిపోతుంది.

* ప్ల‌స్‌పాయింట్స్‌

+ తండ్రీ కొడుకుల అనుబంధం
+ క్లైమాక్స్‌
+ నిర్మాణ విలువ‌లు

* మైన‌స్ పాయింట్స్‌

- రొటీన్ క‌థ‌
- స్లో నేరేష‌న్‌

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌: `విజేత‌`.. కుటుంబ ప్రేక్ష‌కుల కోసం.

రివ్యూ రాసింది శ్రీ

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS