సంక్రాంతి సీజన్‌లో తెలుగు సినిమాలతో పాటు, డబ్బింగ్ సినిమా అయిన 'గ్యాంగ్' చిత్రం కూడా విడుదలైంది. తెలుగు సినిమాలతో పాటు, భారీ అంచనాలతో ఈ సినిమా విడుదలైంది. సూర్య హీరోగా తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా భారీగానే నిర్వహించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో సూర్య తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు.
అందులో భాగంగా రాజకీయ ప్రముఖుల్ని పొగడ్తలతో ముంచెత్తేస్తున్నారు సూర్య. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పరిపాలన చాలా బాగుందంటూ సూర్య చంద్రబాబుని ఆకాశానికెత్తేశారు. మరో పక్క జగన్ పాదయాత్ర విషయంలోనూ సూర్య అత్యుత్సాహం ప్రదర్శించారు. అప్పట్లో జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేశారు. సీఎం అయ్యారు. అలాగే జగన్‌కి కూడా పాదయాత్ర కలిసి రావాలంటూ ఆయన కోరుకున్నారు. అందరి వాడు అనిపించుకోవడం కోసం సూర్య తాపత్రయం చూస్తుంటే కొందరు ముచ్చట పడుతున్నా, ఇప్పుడది రివర్స్ కొట్టేసేలా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో సూర్య తీరును కొందరు ప్రశంసిస్తున్నా, మరికొందరు నెగిటివ్‌గా కామెంట్స్ చేస్తున్నారు. ఇరిటేటింగ్‌గా ఫీలవుతున్నారు. అసలెందుకు సూర్యకి ఈ పొలిటికల్ తంటా.. అంటున్నారు.
రాజకీయాల విషయానికి వస్తే, తమిళనాడు రాజకీయాలే ఇప్పుడు అత్యంత ఆశక్తికరంగా ఉన్నాయి. కమల్ హాసన్ తదితర నటులు రాజకీయ ఎంట్రీకి రంగం సిద్ధం చేస్తున్నారక్కడ. అలాంటిది అక్కడి రాజకీయాల విషయంలో ఎప్పుడూ స్పందించని సూర్య, మన తెలుగు రాజకీయాల విషయంలో స్పందించడం ఒకింత ఆశ్చర్యకరకంగా ఉందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరో పక్క ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడలో అభిమానుల తాకిడి తట్టుకోలేక సూర్య రియల్ హీరోలా గేటు దూకి బయటికి రావడం.. ఇవన్నీ పబ్లిసిటీ స్టంట్స్‌లో స్పెషల్ హైలైట్స్‌గా నిలిచాయి.