ఆడవాళ్ళు మీకు జోహార్లు మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

నటీనటులు: శర్వానంద్, రష్మిక మందన్న, రాధిక శరత్‌కుమార్, ఖుష్బు, ఊర్వశి తదితరులు
దర్శకత్వం : కిషోర్ తిరుమల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
ఎడిటర్ : ఎ. శ్రీకర్ ప్రసాద్


రేటింగ్ : 2.75/5


ఫ్యామిలీ డ్రామా వెండితెరపై ఎవర్ గ్రీన్ జోనర్. కథని ఆకట్టుకునేలా చెబితే అన్ని జోనర్ల ప్రేక్షకులు చూసే జోనర్ అది. అందుకే ఎప్పటికప్పుడు ఫ్యామిలీ డ్రామాలు వస్తూనే వుంటాయి. ఇప్పుడు హీరో శర్వానంద్ నుంచి ఓ ఫ్యామిలీ డ్రామా వచ్చింది. అదే.. ఆడాళ్ళు మీకు జోహార్లు. 'శతమానం భవతి' లాంటి ఫ్యామిలీ హిట్ వున్న శర్వానంద్ తో పాటు, కిషోర్ తిరుమల లాంటి క్లాస్ దర్శకుడు నుంచి వచ్చిన సినిమా కావడంతో సహజంగానే ఈ ఫ్యామిలీ డ్రామా పై ఆసక్తి పెరిగింది. మరి ఇంతలా ఆసక్తి పెంచిన ఈ సినిమాలో ఏముందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్ళాల్సిందే.


కథ :


చిరంజీవి (శ‌ర్వానంద్‌)ది ఉమ్మడి కుటుంబం. అమ్మ (రాధిక‌), పిన్నమ్మలు, బాబాయ్‌లూ.. వాళ్ళ అనురాగాల మధ్య పెరుగుతాడు. రాజ‌మండ్రిలో ఓ క‌ల్యాణ‌మండ‌పం న‌డుపుతుంటాడు. చిరుకి పెళ్లి చేయాల‌ని నిర్ణయిస్తారు కుటుంబ స‌భ్యులు. ఇక్కడ సమస్య ఏమిటంటే పెళ్లి కూతురు అతడికి న‌చ్చినా.. ఇంట్లో ఆడ‌వాళ్లకి మాత్రం ఓ ప‌ట్టాన న‌చ్చరు. అలా బోలెడ‌న్ని సంబంధాలు తప్పుతాయి. పెళ్లి ప్రయ‌త్నాల్లోనే ఉన్న చిరు, ఆద్య (ర‌ష్మిక‌)ని చూస్తాడు. ఇద్దరు దగ్గరౌతారు.


ఆద్య, చిరు కుటుంబ స‌భ్యుల‌కీ నచ్చుతుంది. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే.. ఆద్యకి పెళ్లి చేయ‌డం వాళ్లమ్మ వ‌కుళ (ఖుష్బూ)కి ఇష్టం ఉండ‌దు. ఆద్యనేమో త‌ల్లి మాట కాదనకుండా ఏమీ చేయలేదు. ఇలాంటి పరిస్థితిలో అద్యని పెళ్లి చూసుకోవడానికి చిరు ఏం చేశాడు ? అసలు వకుళ తన కూతురిని పెళ్లి చేయాలని ఎందుకు అనుకోదు ? చివరికి వీరి కథ ఏమైయింది ? అనేది వెండితెర పై చూడాలి. 


విశ్లేషణ:


దర్శకుడు కొత్తగా ఆలోచిస్తున్నారు. చాలా చిన్న పాయింట్లుని కథలు రాసి సినిమాలుగా మలుస్తున్నారు. ఇందులో కొందరు విజయం సాదిస్తున్నారు. దర్శకుడు కిషోర్ కూడా చాలా చిన్న పాయింట్ తీసుకున్నాడు. దాని చుట్టే కథని నడిపాడు. ఈ ప్రయత్నంలో కొన్ని చోట్ల మెప్పించాడు, మరికొన్ని చోట్ల తడబడ్డాడు. తొలి భాగం దాదాపు హీరో పెళ్లి చూపులు, అందులో నుంచి వచ్చే ఫన్ ఫస్ట్రేషన్ చూట్టు తిరుగుతుంది. ఆధ్య పాత్ర పరిచయం బావుంది కానీ ఆ ట్రాక్ కొంచెం రొటీన్ అనిపిస్తుంది. అయితే ఇంటర్వెల్ కు ముందే వచ్చే ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. బేసిగ్గా ఏ తల్లైయినా కూతురు పెళ్లి చేయాలనే లక్ష్యంతో వుంటుంది కానీ ఇందులో వెరైటీగా కూతురుకి పెళ్లి చేయకూడదనే లక్ష్యం వుంటుంది తల్లి. ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అయితే దాని చుట్టూ అల్లుకున్న కథ మాత్రం మళ్ళీ రొటీన్ గా వుంటుంది. 


వకుళ మ‌న‌సులో చోటు సంపాదించ‌డానికి హీరో చేసే ప్రయ‌త్నాలు పరమ రొటీన్ గా అనిపిస్తాయి ముందే చెప్పుకునట్లు చాలా చిన్న లైన్ ఇది. దీనికి సబ్ ప్లాట్ గా.. ఓ ప్రేమ‌క‌థ‌ని హీరో సుఖాంతం చేయ‌డానికి ప్రయ‌త్నించే ట్రాక్ మరీ రొటీన్ గా వుంటుంది. ఎంత ఫ్యామిలీ సినిమా చేసినా థియేటర్ లో విడుదల చేస్తున్నారంటే ఎమోషన్స్, సన్నివేష బలాలు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇందులో మాత్రం ఫ్యామిలీ పేరుతో టైటిల్ జస్టిఫికేషన్ చేసినట్లు ఆడవాళ్ళు అంతా ఓ చోట చేరి కబుర్లు చెప్పుకోవడం కొన్ని సార్లు సీరియల్ చూస్తున్న అనుభూతి కలిగిస్తుంది. ఎంత ఫ్యామిలీ సినిమా అయినా ఇలాంటి సీరియల్ సీన్లు అనవసరమనే సంగతి దర్శకుడు గ్రహించి వుంటే బావుండేది. ఇలాంటి ఫ్యామిలీ డ్రామాలు క్లైమాక్స్ లో బలమైన సంఘర్షణ కావాలి. కానీ దర్శకుడు అలాంటి ఎమోషన్స్ కి చోటివ్వకుండా  రొటీన్ గా కథని ముగించే విధానం ఆకట్టుకోదు. అయితే దర్శకుడు కిషోర్ తిరుమల మంచి మాటల రచయిత కూడా. సీన్స్ లో బలం లేకపోయినా ఆయన రాసిన కొన్ని మాటల్లో ఎమోషన్, ఫన్ ఎలివేట్ అవ్వడం  ప్రేక్షకుడికి కొంత ఉపసమనం. 


నటీనటులు :


ఫ్యామిలీ డ్రామా పండించడంలో శర్వానంద్ దిట్ట. ఇందులో చిరు పాత్ర కూడా శర్వాకు బాగా అలవాటైన పాత్రే. చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ర‌ష్మిక చాలా అందంగా  పద్దతిగా కనిపించింది.  రాధిక‌, ఖుష్బూ,ఊర్వశి,  ఝాన్సీ .. మంచి పాత్రలు పడ్డాయి. వాళ్ళ అనుభవం బాగా కలిసొచ్చింది.  వెన్నెల కిషోర్,  స‌త్య నవ్వించే కొన్ని చోట్ల నవ్వులు పంచారు. మిగతా నటులంతా పరిధి మేర చేశారు


టెక్నికల్ గా :


దేవిశ్రీ ప్రసాద్ పాటల్లో మెరుపులేవ్ గానీ బావున్నాయి. నేపధ్య సంగీతం ఓకే. ఎడిటింగ్ ఇంకా శార్ఫ్ గా ఉండాల్సింది. కెమెరా పనితనం నీట్ గా వుంది. నిర్మాణ విలువ‌లు ఉన్నతంగా ఉన్నాయి. ద‌ర్శకుడు తిరుమ‌ల కిషోర్  చిన్న పాయింట్ రాసుకున్నాడు. ఇంటర్వెల్ వరకూ ఓకే కానీ సెకండ్ హాఫ్ లో ఇంటర్వెల్ లాంటి మ్యాజిక్ వర్క్ అవుట్అయ్యింటే .. సినిమా ఫలితం మరోలా వుండేది. 


ప్లస్ పాయింట్స్


శర్వానంద్ 
ఫ్యామిలీ ఎమోషన్స్ 
కొన్ని చోట్ల వినోదం 


మైనస్ పాయింట్స్


రొటీన్ కధనం 
సెకండ్ హాఫ్ లాగ్ 
కొన్ని చోట్ల పండని ఎమోషన్స్ 

 
ఫైనల్ వర్దిక్ట్ : 'జోహార్లు' కాదుకానీ జస్ట్ ఓకే


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS