తారాగణం: జగపతిబాబు, నారా రోహిత్, దర్శన బాణిక్, సుబ్బరాజు & తదితరులు
నిర్మాణ సంస్థ: ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్
సంగీతం: సాయి కార్తిక్
ఛాయాగ్రహణం: విజయ్ సి కుమార్
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
నిర్మాతలు: రవీంద్రనాథ్, శివాజీ ప్రసాద్, రాము, జితేంద్ర
దర్శకత్వం: పరుచూరి మురళి
రేటింగ్: 1.5/5
మర్డర్ మిస్టరీల జోనర్ తెలుగులోనూ ఈమధ్య ఎక్కువ అవుతోంది. హాలీవుడ్‌లో ఈ తరహా చిత్రాలకు ఆదరణ బాగుంటుంది. కారణం... అక్కడి సినిమాలన్నీ గంట, గంటన్నరలో ముగుస్తాయి. ఇలాంటి కథలకు `నిడివి` చాలా ముఖ్యం. తెలుగు సినిమా అనేసరికి మినిమం రెండు గంటలు కావాల్సిందే. దాని కోసం.. సన్నివేశాల్ని సాగదీయడం మొదలవుతుంది. దాంతో కథనం నత్తనడకలో సాగుతుంది. ఈమధ్య వచ్చిన మర్డర్ మిస్టరీలలో కనిపించిన ప్రధాన లోపం అదే. `ఆటగాళ్లు` కూడా మర్డర్ మిస్టరీ స్టోరీనే. మరి ఇదెలా సాగింది? ఈసారైనా దర్శకుడి గురి కుదిరిందా? ప్రేక్షకులకు థ్రిల్ అందించగలిగారా?
* కథ
సిద్ధార్థ్ (నారా రోహిత్) ఓ పాపులర్ దర్శకుడు. అంజలి (దర్శన బానిక్)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. హఠాత్తుగా అంజలి హత్యకి గురవుతుంది. ఆ నేరంపై సిద్ధార్థ్ పై పడుతుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీరేంద్ర (జగపతిబాబు) ఈ కేసు నిమిత్తం రంగంలోకి దిగుతాడు. సిద్దార్థ్‌ని తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. మరి సిద్దార్థ్ ఏం చెప్పాడు? తను నేరస్థుడా? నిరపరాథా? ఇంతకీ అంజలిని హత్య చేసిందెవరు? అనేది `ఆటగాళ్లు` చూసి తెలుసుకోవాల్సిందే.
* నటీనటులు
జగపతిబాబు ఈమధ్య విలన్ పాత్రలెక్కువగా చేస్తున్నారు. ఆయనకు లాయర్ పాత్ర ఉపశమనం కలిగిస్తుంది. ఇంటెన్సిటీని ఆయన బాగా చూపించారు.
రోహిత్ నటన పరంగా లోపమేం చేయలేదు. కానీ ఆ పాత్రని తీర్చిదిద్దిన విధానంలోనే లోపాలుంటాయి. అంటే ఆ తప్పు దర్శకుడితే అన్నమాట.
బ్రహ్మనందం మరోసారి నవ్వించడానికి ఆపసోపాలు పడ్డాడు. ఆయన ట్రాక్ ఈ సినిమాని పూర్తిగా లయ తప్పించేలా చేసింది.
* విశ్లేషణ
ఓ హత్యకు సంబంధించిన పరిశోధన, దాన్నుంచి తప్పించుకోవడానికి ఓ వ్యక్తి చేసే ప్రయత్నం, అందులో భాగంగా వచ్చే మలుపులు... `ఆటగాళ్లు` నేపథ్యం ఇది. తెలివైన లాయర్, అంతే తెలివైన క్రిమినల్.. వీళ్ల మధ్య సాగే మైండ్ గేమ్ ఇది. థ్రిల్లింగ్ ఇచ్చే సన్నివేశాలకు చాలా ఆస్కారం ఉంది. `ఆటగాళ్లు`లో అలాంటి సన్నివేశాలు ఒకట్రెండు కనిపిస్తాయి కూడా. అయితే ఆ వేగం ఈసినిమాకి సరిపోలేదు. అక్కడక్కడ ఒక్కో సన్నివేశం మెరుస్తుంటుంది.
మొత్తంగా చూస్తే... అంత కిక్ అనిపించదు. పైగా లాజిక్ కి అందని ఎన్నో సన్నివేశాలు ఈ సినిమా కథ, కథనాల్ని అభాసుపాలు చేస్తుంటాయి. టాబ్లెట్ వేసుకోగానే కోమాలోంచి బయటకు రావడం, అదే టాబ్లెట్‌తో మళ్లీ కోమాలోకి పంపడం.. ఇలాంటి సిల్లీ సన్నివేశాలు చూస్తుంటే.. అసలు ఇలాంటి సన్నివేశాలు బుర్ర పెట్టేరాశారా, లేదంటే నిద్రమత్తులో రాశారా అనే అనుమానాలు వస్తుంటాయి. కరెక్టుగా తీస్తే... గంటలో ముగియాల్సిన సినిమా ఇది. కానీ తెలుగు సినిమా సూత్రాలు అందుకు ఒప్పుకోవు.
అందుకే.. కామెడీ ట్రాకులు ప్రవేశ పెట్టాడు. అవి కూడా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేలా సాగాయి. సిద్దార్థ్ పాత్ర తీరుతెన్నుల్లో కూడా లోపాలు కనిపిస్తాయి. ఆ పాత్ర ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తుంటుంది. క్యారెక్టర్‌కి ఓ గ్రాఫ్ అంటూ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. ఇంట్రవెల్ ముందొచ్చే సన్నివేశాలు ఉత్కంఠత కలిగిస్తాయి. అయితే... ఆ టెంపో కాసేపే ఉంటుంది. జగపతి బాబు - నారా రోహిత్ మధ్య సాగే సన్నివేశాలు కొన్ని బాగున్నాయి.
సినిమా మొత్తం అదే తరహాలో సాగితే `ఆటగాళ్లు` అనుకున్న గమ్యంవైపు దూసుకెళ్లేవారు. స్క్రీన్ ప్లే పరంగా కనిపించే దోషాలు.. మంచి కథని సైతం పక్కదోవ పట్టించాయి.
* సాంకేతికత
కథ బాగున్నా, కథన పరంగా ఉన్నలోపాలు ఈ సినిమాని పేలవంగా మార్చేశాయి. లాజిక్‌ల గురించి ఏమాత్రం ఆలోచించకుండా తీసిన కథ ఇది. టేకింగ్, నిర్మాణ విలువలు కూడా అంతంత మాత్రమే. కెమెరా, నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తాయి. ఒక్క డైలాగ్ కూడా గుర్తు పెట్టుకునేలా లేదు.
* ప్లస్ పాయింట్స్
+ జగపతిబాబు నటన
* మైనస్ పాయింట్స్
- కథనం
- లాజిక్ లేని సన్నివేశాలు
* ఫైనల్ వర్డిక్ట్: ఆటలు సాగలేదు.
రివ్యూ రాసింది శ్రీ