తారాగణం: ఆది పినిశెట్టి, తాప్సీ, రితిక సింగ్, వెన్నెల కిషోర్ తదితరులు
సమర్పణ: కోన వెంకట్
నిర్మాణ సంస్థ: MVV సినిమా
ఎడిటర్: ప్రదీప్
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్
సంగీతం: అచ్చు రాజమణి
నిర్మాత: MVV సత్యనారాయణ
దర్శకత్వం: హరినాథ్
రేటింగ్: 2/5
థ్రిల్లర్ కథల లక్షణం, లక్ష్యం ఒక్కటే. ప్రేక్షకుల్ని అనుక్షణం ఉత్కంఠతకు లోనయ్యేలా చేయడం. ఈ విషయంలో దర్శకుడు విజయవంతమైతే.. సినిమా నిలబడిపోయినట్టే. అయితే కథ చెప్పేటప్పుడో, రాసుకునేటప్పుడో ఉన్నంత బిగి.. దాన్ని వెండి తెరపై తీసుకొచ్చినప్పుడూ ఉండాలి. లేదంటే ఆ ప్రయత్నం వృథా అయిపోతుంది. కొన్ని సినిమాలు కథగా వింటున్నప్పుడు భలే ఉంటాయి. కానీ.. తెరపై మాత్రం ఆ స్థాయి కనిపించదు. అలాంటి మరో సినిమా `నీవెవరో`.
* కథ
కల్యాణ్ (ఆది పినిశెట్టి) పుట్టుకతోనే చూపు కోల్పోతాడు. హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌లో చెఫ్‌గా పనిచేస్తుంటాడు. అతనికి వెన్నెల (తాప్సీ)తో పరిచయమవుతుంది. వెన్నెల మంచి మనసు నచ్చి.. ఆమెతో ప్రేమలో పడతాడు కల్యాణ్. తన తండ్రి కోసం చేసిన అప్పు తీర్చడానికి కొంత డబ్బు కావాలని కల్యాణ్‌ను కోరుతుంది వెన్నెల. ఈలోగా కల్యాణ్‌కు అనుకోకుండా యాక్సిడెంట్ అవుతుంది. అనూహ్యంగా కంటిచూపు వస్తుంది.
అయితే ఈలోగా వెన్నెల మిస్ అవుతుంది. ఆమె కోసం కల్యాణ్ ఎంత వెదికినా ఫలితం ఉండదు. వెన్నెలకు ఓ గ్యాంగ్ వల్ల ముప్పు ఉందని, 25లక్షలు ఇస్తే తప్ప వెన్నెల ప్రమాదం నుంచి బయటపడదని తెలుసుకుంటాడు. అయితే ఆ తరవాత వెన్నెల గురించి కొన్ని నిజాలు బయటకు వస్తాయి. ఇంతకీ వెన్నెలకు ఏమైంది? వెన్నెలను తరుముతున్న ముఠా సంగతేంటి? వెన్నెలను కల్యాణ్ కాపాడాడా? లేదా? అనేదే కథ.
* నటీనటులు పనితీరు
ఆది తన పాత్ర వరకూ న్యాయం చేశాడు. మరీ ముఖ్యంగా అంధుడిగా నటించిన సన్నివేశాల్లో అతని ప్రొఫెషనలిజం కనిపిస్తుంది.
తాప్సి పాత్ర గురించి ముందు నుంచీ గొప్పగా చెబుతూనే ఉన్నారు. కానీ ఆమె పాత్ర ఆ స్థాయిలో లేదు. ఈ కథకి బలం తాప్సినే. కానీ... ఆ పాత్రని కూడా సరిగా మలచలేకపోయారు. రితికా సింగ్ ఓకే అనిపిస్తుంది.
ద్వితీయార్థంలో వెన్నెల కిషోర్ కాస్త ఉపశమనం కలిగిస్తాడు. మిగిలిన పాత్రల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.
* విశ్లేషణ
కథగా చెప్పుకోవడానికి `నీవెవరో` బాగానే ఉంటుంది. కథలో మలుపులున్నాయి. బహుశా అవి నచ్చే `అదే కంగల్` అనే తమిళ చిత్రాన్ని రీమేక్ చేశారు. అయితే... కథ చెప్పుకునేటప్పుడు ఉండే బిగి.. కథనంలో కనిపించదు. ఇది కచ్చితంగా దర్శకులు, కథకుల లోపమే. ఈ కథని ముక్కోణపు ప్రేమకథ యాంగిల్‌లో మొదలెట్టారు. అక్కడే దర్శకుడు తడబడ్డాడు. ఆయా సన్నివేశాల్లో ఏమాత్రం కొత్తదనం లేకపోవడంతో అవన్నీ తేలిపోయాయి. నాలుగు సన్నివేశాలు గడిచాయో లేదో.. విసుగు మొదలవుతుంది.
వెన్నెల పాత్ర మాయం అవ్వడం కథలో తొలి మలుపు. అయితే దాన్ని కూడా సరిగా వాడుకోలేదు. ద్వితీయార్థంలో కథనాన్ని పరుగులు పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు కూడా నత్తనడకన సన్నివేశాల్ని తీర్చిదిద్దారు. థ్రిల్లర్ కథలకు వేగం చాలా అవసరం. ఇన్వెస్టిగేషన్ చాలా ఆసక్తిగా ఉండాలి. తరవాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠత రేగాలి. ఈ విషయాల్లో `నీవెవరో` మూకుమ్ముడిగా విఫలమైంది. దానికి తోడు చాలా వరకూ లాజిక్కులు మిస్సయిపోయాయి. అనవసరమైన సన్నివేశాలు జోడించి మరో పెద్ద తప్పు చేశాడు దర్శకుడు. ఎలాంటి ఆధారాలూ లేకుండా వెన్నెలను కల్యాణ్ ఎలా కనుక్కుంటాడో... అనే ఉత్కంఠత ప్రేక్షకుల్లో రేగినా.. దాన్ని చివరి వరకూ కొనసాగించలేకపోయాడు.
కేవలం డ్రామా కోసమే కొన్ని సీన్లు తనకు నచ్చినట్టు రాసుకోవడంతో... సస్పెన్స్ చప్పబడిపోయి, అవన్నీ ఫన్నీగా కనిపిస్తుంటాయి. హీరో, విలన్ మధ్య సాగే మైండ్ గేమ్ మరో మైనస్. అవి కూడా పాత సినిమాల్లోని సన్నివేశాల్ని గుర్తు తెచ్చేలా సాగాయి. మొత్తానికి ఉత్కంఠత లోపించిన ఓ థ్రిల్లర్‌గా మిగిలిపోయింది.
* సాంకేతికత
సాంకేతికంగా ఎంత బాగున్నా.. కథ, కథనాల్లో బలం లేకపోతే.. అవన్నీ నిరుపయోగమే. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది. టేకింగ్‌పరంగా వంక పెట్టడానికి ఏమీ లేదు. కానీ.. సన్నివేశాలు సీరియల్ తరహాలో సాగడంతో ప్రేక్షకుడు ఎక్కడా కనెక్ట్ అవ్వడు. కోన వెంకట్ లాంటి రచయిత ఈ సినిమాకి అండ దండగా ఉన్నా... ప్రయోజనం లేకపోయింది. సంగీతం, కెమెరా వర్క్ ఆకట్టుకుంటాయి.
* ప్లస్‌పాయింట్స్
+ టేకింగ్
+ వెన్నెల కిషోర్
* మైనస్ పాయింట్స్
- కథ, కథనం
- ఉత్కంఠత లేకపోవడం
ఫైనల్ వర్డిక్ట్: థ్రిల్ తగ్గింది.
రివ్యూ రాసింది శ్రీ