తారాగణం: పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్, అను ఇమాన్యుల్, బోమన్ ఇరానీ, ఖుష్బు తదితరులు..
నిర్మాణ సంస్థ: హారిక & హాసినీ క్రియేషన్స్
సంగీతం: అనిరుద్
ఛాయాగ్రహణం: మణికందన్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాత: రాధాకృష్ణ (చినబాబు)
రచన-దర్శకత్వం: త్రివిక్రమ్
రేటింగ్: 3/5
పవన్ కల్యాణ్ అంటే ఓ పూనకం. ఓ అగ్నిగుండం. దానికి మాటల మాంత్రికుడు తోడైతే... ఆగ్నికి ఆక్సిజన్ అందించినట్టే. అందుకే... వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రెండు సినిమాలూ సూపర్ హిట్టయ్యాయి. అత్తారింటికి దారేదితో నయా ట్రెండ్ సెట్టయ్యింది. వీరిద్దరూ కలిస్తే.. సంచలనమే అనే సంగతి రెండు సార్లూ రూఢీ అయిపోయింది. ముచ్చటగా చేసిన మూడో ప్రయత్నం.. ఈ అజ్ఞాతవాసి. విడుదలకు ముందే.. ట్రేడ్ వర్గాల పరంగా ప్రకంపనాలు సృష్టించిన ఈ సినిమా అంచనాల్ని అందుకొందా? త్రివిక్రమ్‌తో పవన్ మ్యాజిక్ మళ్లీ వర్కవుట్ అయ్యిందా, లేదా?
* కథ
ఏబీ గ్రూప్ కంపెనీ యజమాని విందా (బొమన్ ఇరానీ) హత్యకు గురవుతాడు. అతని కొడుకుని కూడా చంపేస్తారు. ఆ కంపెనీ ఇబ్బందుల్లో పడుతుంది. సీఈవో సీటు కోసం కొన్ని ముఠాలు ప్రయత్నిస్తుంటాయి. కాకపోతే విందాకి మరో కొడుకు ఉన్నాడు. తను అజ్ఞాతవాసం అనుభవిస్తున్నాడు. తండ్రి చనిపోయాడన్న సంగతి తెలుసుకొని.. ఎవరు చంపారో తెలుసుకొనే ప్రయత్నంలో భాగంగా ఏపీ కంపెనీలో బాలు (పవన్ కల్యాణ్) అనే ఓ సాధారణ ఉద్యోగస్థుడుగా అడుగుపెడతాడు. ఈ క్రమంలో తనకు తెలిసిన నిజాలేమిటి? విందాని చంపిందెవరు? అసలు ఇన్నాళ్లుగా బాలు ఎందుకు అజ్ఞాతవాసంలో ఉన్నాడు? అనేదే కథ.
* నటీనటులు
ఇది పవన్ వన్ మ్యాన్ షో. ఏమీ లేని చోట కూడా తనదైన నటనతో నడిపించేయగలడు. ఈసారీ అదే చేశాడు. కాకపోతే పవన్ ఎనర్జీకి సరిపడ పాత్ర కాదిది. పవన్ నుంచి ఆశించిన వినోదం నూటికి నూరుపాళ్లూ రాలేదంటే కచ్చితంగా అది త్రివిక్రమ్ తప్పిదమే.
హీరోయిన్లు ఇద్దరున్నారు కానీ.. వాళ్లనీ సరిగా వాడుకోలేదు. వాళ్ల పాత్రలకు జస్టిఫికేషన్ చేయడానికి దర్శకుడు చాలా ఇబ్బంది పడ్డాడు.
ఆది పినిశెట్టి మరోసారి స్టైలీష్ విలన్ పాత్రలో కనిపిస్తాడు. కానీ ఆ పాత్రకి ఇచ్చిన పాత్ర కూడా తక్కువే.
త్రివిక్రమ్ సినిమాల్లో కనిపించే కమెడియన్లు.. అలీ, బ్రహ్మానందం ఈ సినిమాలో మిస్ అయ్యారు. ఆ లోటు స్పష్టంగా కనిపించింది. ఖుష్బు పాత్ర హుందాగా ఉంది. మురళీ శర్మ, రావు రమేష్‌లు అక్కడక్కడ నవ్విస్తారు, చాలా చోట్ల ఓవర్ యాక్షన్ చేస్తారు.
* విశ్లేషణ
సాధారణంగా త్రివిక్రమ్ ఓ రచయిత. కానీ క్లిష్టమైన కథల్ని ఎంచుకోడు. తెలిసిన కథనే తనదైన టెక్నిల్‌లో చెబుతాడు. ఇదీ అలాంటి కథే. తండ్రిని చంపిన వాడ్ని వెదికి పట్టుకుని ప్రతీకారం తీర్చుకోవడం అనే పాయింట్ చుట్టూ కథ నడుస్తుంది. కానీ ఇక్కడ కొడుకు మాత్రం అజ్ఞాతవాసం అనుభవించి వస్తాడు. తనెవరో చెప్పకుండా పని చెక్కబెడతాడు. దాన్ని త్రివిక్రమ్ తనదైన స్టైల్‌లో ఆవిష్కరించాడు. పవన్ తనదైన నటనతో నెట్టుకొచ్చాడు. సినిమా ప్రారంభమైన పది నిమిషాలకే కథ ఎటువైపు వెళ్తుందో అర్థమైపోతుంది. సన్నివేశాల్ని పేర్చుకుని వెళ్లడమే త్రివిక్రమ్ పని. ఈ విషయంలో ఆరి తేరిన వాడు కాబట్టి... చకచక నడిపించే ప్రయత్నం చేశాడు.
బాలుగా కంపెనీలో అడుగుపెట్టడం అక్కడ ఇద్దరు అమ్మాయిల్ని తన ముగ్గులోకి దించుకోవడం, ఆఫీసులో అమాయకుడిగా నటించడం ఇవన్నీ ఓకే అనిపిస్తాయి. అక్కడక్కడ ఓ స్టైలీష్ యాక్షన్ సీన్, మధ్యమధ్యలో త్రివిక్రమ్ శైలి డైలాగులతో హాయిగా నడిచిపోతుంది. ద్వితీయార్థంలో మాత్రం కథ, కథనం రెండూ నత్తనడక నడుస్తాయి. వర్మ - శర్మల కామెడీ అంతగా పండలేదు. ఆఫీసులో పవన్ చేసే అల్లరి ... రౌడీ అల్లుడు సినిమాని గుర్తుకు తెస్తుంది. క్లైమాక్స్ కూడా తేలిపోయింది. ఇద్దరు హీరోయిన్లు చంప దెబ్బలు కొట్టుకోవడం చూస్తే.. త్రివిక్రమ్ ఇలా క్కూడా ఆలోచిస్తాడా అనిపిస్తుంది. అయితే పవన్ తనదైన శైలిలో చెలరేగిపోవడం, లావిష్ విజువల్స్ ఇవన్నీ కట్టిపడేస్తాయి. పవన్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా తప్పకుండా చూడొచ్చు.
* సాంకేతిక వర్గం
ఇది త్రివిక్రమ్ సినిమా. కాబట్టి పంచ్ డైలాగులు బాగానే ఆశిస్తారు. కానీ వాళ్లందరికీ ఈసారి నిరాశ ఎదురవుతుంది. ప్రతీ సీన్‌లోనూ గుర్తిండిపోయేలా ఓ డైలాగ్ రాయడం త్రివిక్రమ్‌కి అలవాటు. ఈసారి ఆ మ్యాజిక్ జరగలేదు. అలాగని డైలాగులు లేవని కాదు, త్రివిక్రమ్ స్థాయిలో లేవు.
టెక్నికల్‌గా ఈసినిమా సూపర్బ్‌గా ఉంది. తెలుగు తెరపై ఇంత రిచ్ నెస్ కనిపించి చాలా కాలం అయ్యింది. ఫొటోగ్రఫీ, లొకేషన్లు అదిరిపోయాయి. పాటలు స్టైలీష్‌గా ఉన్నాయి. అన్నీ మెలోడీ ప్రధానంగా సాగేవే. నేపథ్య సంగీతం కూడా కొత్తగా అనిపిస్తుంది
* ప్లస్ పాయింట్స్
+ పవన్ కల్యాణ్
+ రిచ్ నెస్
+ పాటలు
* మైనస్ పాయింట్స్
- రొటీన్ కథనం
- సెకండాఫ్
* ఫైనల్ వర్డిక్ట్: పవన్ అభిమానులకు ప్రత్యేకం
రివ్యూ బై శ్రీ