ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కొద్ది సేపటి క్రితం తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. కొన్నాళ్ళ క్రితమే ఆయన విదేశాలకు వెళ్ళి క్యాన్సర్ ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. అయితే, కొద్ది రోజుల క్రితం ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారనీ, ఇంటివద్దనే వైద్య చికిత్స తీసుకోవడం మొదలు పెట్టారనీ తెలుస్తోంది. కాగా, నిన్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ముంబైలోని కోకిలాబెన్ దీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌కి హుటాహుటిన తరలించారు. అయితే, వైద్యులు ఎంత శ్రమించినా ఇర్ఫాన్ ఖాన్ ఆరోగ్యం మెరుగుపడలేదనీ, కొద్ది సేపటి క్రితం ఆయన ప్రాణాలు కోల్పోయారనీ అధికారిక ప్రకటన వెల్లడయ్యింది.
న్యూరోఎండోక్రైన్ ట్యూమర్‌తో ఆయన బాధపడ్డారు. ఇది ఓ అరుదైన క్యాన్సర్ అనీ, కోలుకునేందుకు ఆయన చాలా శ్రమించారనీ ఇర్ఫాన్ ఖాన్ సన్నిహితులు చెబుతున్నారు. ఏదిఏమైనా, ఇర్ఫాన్ ఖాన్ మృతి భారతీయ సినీ పరిశ్రమకి లోటుగానే చెప్పుకోవచ్చు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు ఇర్ఫాన్ ఖాన్ . హాలీవుడ్ సినిమాల్లోనూ ఇర్ఫాన్ ఖాన్ నటించారంటే ఆయన ప్రతిభ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. క్యాన్సర్ సోకాక కూడా, ఇర్ఫాన్ ఖాన్ తాను క్యాన్సర్‌ని జయిస్తానని ధైర్యంగా చెప్పేవారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.