నటీనటులు : పాయల్ రాజ్‌పుత్, చైతన్య కృష్ణ తదితరులు
దర్శకత్వం : దయాల్ పద్మనాభన్
నిర్మాతలు : రాజా రామమూర్తి, చిదంబరం నటేశన్.
సంగీతం : అరోల్ కొరెల్లి
సినిమాటోగ్రఫర్ : రాకేష్ బి.
ఎడిటర్: ప్రీతి, బాబు శ్రీవాత్సవ.
రేటింగ్: 2.75/5
ఓటీటీ వల్ల సృజనకు చాలా పని పడింది. థియేటర్లో సినిమాలుగా మలచడానికి సరితూగని కథల్ని సైతం.. ఓటీటీలో చూపించడానికి ఆస్కారం ఉంటుంది. పైగా ఇక్కడ నిడివి సమస్యా లేదు. అందుకే చిన్ని చిన్ని కథల్ని సైతం.. దృశ్య రూపంలో ఆవిష్కరించవచ్చు. `అనగనగా ఓ అతిథి` కూడా ఓ చిన్న కథే. `దురాశ దుఖానికి చేటు` అనే సందేశాన్ని చెప్పే కథ ఇది. కమర్షియల్ అంశాలు ఏమాత్రం కనిపించవు. సినిమా లెక్కలకు ఆమడదూరంలో ఉన్న కథ ఇది. ఓటీటీ లో విడుదల చేస్తున్నామన్న భరోసా రావడంతో కాస్త ధైర్యంగా ఈ కథని మలచగలిగారు. ఈ సినిమా ఆహాలో విడుదలైంది. మరి.. ఎలా ఉంది? దర్శకుడు చెప్పాలనుకున్న ఈ నీతి కథలో ఆకట్టుకునే అంశాలేంటి?
* కథ
మల్లి (పాయల్ రాజ్‌పుత్) ది ఓ సాధారణమైన దిగువ మధ్యతరగతి కుటుంబం. ఒకప్పుడు బాగా బతికినవాళ్లే. కానీ.. అప్పుల పాలై, తమ పొలంలోనే కూలీ కి పనిచేసే దుస్థితి వస్తుంది. మనసు నిండా ఎన్నో ఆలోచనలు, ఎన్నో అసంతృప్తులు. తన కోరికలు తీరడం లేదన్న బాధ తల్లిదండ్రుల దగ్గర అనుక్షణం వ్యక్తం చేస్తుంటుంది. అలాంటి ఆ ఇంటికి ఓ రోజు అనుకోని అతిథి వస్తాడు. తన పేరు శ్రీనివాస్ (చైతన్య కృష్ణ). తను ఓ దేశ దిమ్మరి. ఇల్లూ, వాకిలి లేవు. దేశమంతా తిరుగుతూ ఉంటాడు. ఒక్క రోజు తల దాచుకోవడానికి చోటు ఇమ్మని అడుగుతాడు. తన దగ్గర బోలెడంత డబ్బు, నగలు ఉంటాయి. వాటిని ఎలాగైనా తన వశం చేసుకోవాలని ఆశ పడుతుంది మల్లి. మెల్లగా ఆ కోరికని తల్లిదండ్రుల్లోనూ రాజేస్తుంది. కోడికూరలో విషం కలిపి, శ్రీనివాస్ తో తినిపించి, తను చనిపోతే.. ఆ డబ్బుతో తమ కష్టాలన్నీ పోగొట్టుకోవాలని ఆ కుటుంబం దురాశతో ఆలోచిస్తుంది. మరి అందుకోసం వాళ్లు చేసిన ప్రయత్నాలేంటి? అతిథిని చంపేశారా? ఆ డబ్బు వాళ్ల వశం అయ్యిందా? అన్నదే మిగిలిన కథ.
* విశ్లేషణ
ముందే చెప్పినట్టు దురాశ పనికిరాదని చెప్పే ప్రయత్నం చేసిన కథ ఇది. ఈ పాయింట్ ని ఉత్కంఠ భరితంగా, భావోద్వేగభరితంగా చెప్పాలని చూశారు. కన్నడ నాటకం `కాళ రాత్రి` ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. నాటకంలో ఎమోషన్ ని దర్శకుడు బాగా అర్థం చేసుకున్నాడు కూడా. మల్లిలోని అసంతృప్తి, ఆ ఇంటి కష్టాలు, అక్కడికి ఓ అతిథి వెదుక్కుంటూ రావడం.. ఇలా కథ మెల్లమెల్లగా నడుస్తుంటుంది. అతిథిని చంపాలన్న ప్రయత్నం దగ్గర్నుంచి కథనం జోరందుకుంటుంది. డబ్బు కోసం మనసులు ఎలా కలుషితం అవుతాయో, దురాశతో ఎంతటి నిర్ణయాల్ని తీసుకోగలరో చెప్పే ప్రయత్నం అడుగడుగునా కనిపిస్తుంది. పతాక సన్నివేశాలు మాత్రం మరింత హృద్యంగా సాగుతాయి. శ్రీనివాస్‌పై జాలి, ఆ ఇంట్లో వాళ్లపై కోపం ఒక్కసారిగా పెరిగిపోతాయి. ముగింపు కూడా సరిగ్గానే కుదిరింది. ఓ భారమైన సన్నివేశంతో చిత్రాన్ని ముగించారు.
తక్కువ లొకేషన్ల మధ్య, తక్కువ పాత్రల మధ్య జరిగే కథ ఇది. దర్శకుడు ఆ లొకేషన్లనీ, పాత్రల్నీ సరిగా వాడుకోగలిగాడు. అసవరమైన పాత్ర ఒక్కటీ కనిపించదు. చిన్నదో, పెద్దదో ప్రతీ పాత్ర ఈ కథకు కీలకమే. చాలా చిన్న కథ ఇది. 90 నిమిషాల నిడివి ఉందంతే. ఇలాంటి కథలు సినిమాలకు పనికి రావు. కేవలం వెబ్ ప్రేక్షకుల్ని దృష్టిలో ఉంచుకుని తీసినదే. సినిమాటిక్ లక్షణాలు ఈ కథలో కనిపించవు. కమర్షియల్ అంశాలూ ఉండవు. ఓ నాటకం ఆధారంగా తెరకెక్కిన చిత్రం కాబట్టి, నాటకం చూస్తున్నట్టే ఉంటుంది. తొలి భాగంలో కథనం చాలా నెమ్మదిగా సాగుతుంది. తల్లిని ఉద్దేశించి కూతురు కొన్ని మసాలా డైలాగులు వేయడం పెద్దగా నచ్చకపోవొచ్చు. డబ్బు కోసం మరీ ఇంత కర్కోటకంగా మనుషులు మారిపోతారా? అనే ఆశ్చర్యం కూడా కలుగుతుంది.
* నటీనటులు
పాయల్ రాజ్ పుత్ కి ఇది కొత్త తరహా పాత్ర అని చెప్పుకోవొచ్చు. కాస్త హాటుగా, కాస్త నాటుగా ఆ పాత్ర సాగింది. తన బాడీ లాంగ్వేజే కొత్తగా అనిపిస్తుంది. మేకప్ తక్కువ. పాత్రకు తగినట్టు ఇమిడిపోగలిగింది. చైతన్య కృష్ణ నటనకూ మంచి మార్కులు పడతాయి. తల్లిదండ్రుల పాత్రధారులు కూడా బాగా చేశారు. మిగిలిన పాత్రలన్నీ తక్కువ నిడివి ఉన్నవే.
* సాంకేతిక వర్గం
1980 నేపథ్యంలో సాగే కథ. ఆ వాతావరణాన్ని తెరపై ప్రతిబింబించారు. తక్కువ బడ్జెట్‌లో తీసిన సినిమా ఇది. ఆ పరిమితుల మేర చూస్తే.. బాగా తీసినట్టే లెక్క. రెండు పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతమూ ఉత్కంఠభరితంగా ఉంది. ఇలాంటి కథలు మనకు కావల్సినన్ని దొరుకుతాయి. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఇలాంటి కథలు చెప్పొచ్చన్న భరోసా కలిగించిన ప్రయత్నమిది.
* ప్లస్ పాయింట్స్
ఎమోషన్
క్లైమాక్స్
పాయల్ రాజ్ పుత్
* మైనస్ పాయింట్స్
కమర్షియల్ అంశాలు లేవు
ఓటీటీ ప్రేక్షకులకు మాత్రమే
* ఫైనల్ వర్డిక్ట్: ఓ నీతి పాఠం