నటీనటులు: నిఖిల్, లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, సత్య తదితరులు.
దర్శకత్వం: సంతోష్ టి.ఎన్
నిర్మాతలు: రాజ్ కుమార్ ఆకెళ్ళ, కావియా వేణు గోపాల్
సంగీతం: సామ్ సి ఎస్
విడుదల తేదీ: నవంబర్ 29, 2019
రేటింగ్: 2.75/5
నిఖిల్ ఎంతో నమ్మకంతో చేసిన సినిమా `అర్జున్ సురవరం`. తమిళంలో విజయవంతమైన `కణితన్`కి రీమేక్ ఇది. అప్పట్లో తమిళంలో ఈ సినిమా విడుదలయ్యాక చాలా మంది తెలుగు కథానాయకులు దీని గురించి మాట్లాడుకున్నారు. రీమేక్ చేయాలని కూడా ఆసక్తి ప్రదర్శించారు. ఈ దశలో కొద్దిమంది స్టార్ కథానాయకుల పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఈ రీమేక్ చేసే అవకాశం యువ కథానాయకుడు నిఖిల్‌కి లభించింది. `ముద్ర` అనే పేరుతో సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా, ఆ తర్వాత `అర్జున్ సురవరం`గా పేరు మార్చుకుంది. విడుదల తేదీల్ని కూడా పలుమార్లు మార్చుకుంది. కానీ నిఖిల్ ఈ సినిమాపై ఎప్పుడూ నమ్మకం కోల్పోలేదు. ఎంతో చొరవ తీసుకుని సినిమా బయటికి వచ్చేలా కష్టపడ్డాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? నిఖిల్‌కి మరో విజయాన్ని అందించినట్టేనా?
* కథ
అర్జున్ లెనిన్ సురవరం (నిఖిల్) ఒక జర్నలిస్టు. టీవీ 99లో రిపోర్టర్‌గా పనిచేస్తుంటాడు. సామాజిక బాధ్యత ఎక్కువ. ఎప్పటికైనా బీబీసీలో ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టుగా ఉద్యోగం సంపాదించాలనేది ఆయన కల. ఆ కలకి చేరువైన క్రమంలోనే ఓ కేసులో అరెస్ట్ అవుతాడు. దీని వెనక నకిలీ సర్టిఫికెట్ల మాఫియా ఉందనే విషయం అర్థమవుతుంది. బెయిల్‌పై బయటికొచ్చిన అర్జున్ ఆ మాఫియా చేస్తున్న నకిలీ వ్యవహారాన్ని ఎలా బయటికి తీశాడు? ఈ క్రమంలో ఆయనకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే.
* నటీనటులు
నిఖిల్ స్థాయిని పెంచే పాత్ర ఇది. రిపోర్టర్‌గా ఆ పాత్రకి తగ్గట్టుగా చాలా బాగా నటించాడు. యాక్షన్ సన్నివేశాల్లోనూ చక్కటి ప్రతిభ కనబరిచాడు. కావ్య అనే పాత్రికేయురాలిగా లావణ్య త్రిపాఠి ఆకట్టుకుంటుంది. కానీ ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. సత్య, వెన్నెల కిషోర్, విద్యుల్లేఖ రామన్ హాస్యం పండించారు. నాగినీడు,ప్రగతి, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర మెప్పిస్తారు. తరుణ్ అరోరా స్టైలిష్ విలన్‌గా ఆకట్టుకున్నాడు.
* సాంకేతిక వర్గం
సాంకేతికంగా సినిమా కి మంచి మార్కులు పడతాయి. సూర్య ఈ కథకి తగ్గ మూడ్‌ని క్రియేట్ చేసేలా కెమెరా బాధ్యతల్ని నిర్విర్తించాడు. సామ్.సి.ఎస్ సంగీతం ఆకట్టుకుంటుంది. చెగువేరాతోపాటు, విదేశాల్లో డ్యూయెట్ పాటల చిత్రీకరణ, బాణీలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు సినిమాని ప్రధానబలం. దర్శకుడు సంతోష్ మాతృకని తీసిన దర్శకుడే అయినా... అతి విశ్వాసం ప్రదర్శించకుండా తమిళ సినిమానే ఫాలో అయిపోయినట్టున్నాడు.
* విశ్లేషణ
క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఇలాంటి కథల్లో ఇన్వెస్టిగేషన్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కానీ ఈకథే ఇన్వెస్టిగేషన్‌తో కూడుకుని ఉంటుంది. పాత్రికేయుడిగా కథానాయకుడు ఈ కేసు వెనక ఉన్న కారకులు ఎవరో కనుక్కునేందుకు ఒకొక్క తీగని బయటికి లాగుతూ వెళతాడు. ఈ క్రమంలో కలుగులో దాక్కున్న అసలు వ్యక్తులు బయటికొస్తారు. వాళ్లతో కథానాయకుడు ఎలా యుద్ధం చేసి తాను అనుకున్నది సాధించడనేదే ఈ సినిమా.
ఆరంభ సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. వేగంగా కథలో లీనం చేస్తాయి. అయితే నకిలీ సర్టిఫికెట్ల కోణం బయటికొచ్చాకే కథలో ఆసక్తి మొదలవుతుంది. వాళ్లు ఎలా నకిలీలు తయారు చేస్తారు? అవి నకిలీ అనే విషయం బయటికొచ్చాక అవి అసలువి అని ఎలా నిరూపిస్తారనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తుంది. మాఫియా డెన్ ఆచూకీ కనిపెట్టడం, వాళ్లని బయటికి రప్పించేందుకు వేసే ఎత్తుగడలతో ప్రథమార్థం ముగుస్తుంది.
ద్వితీయార్థంలో భావోద్వేగాలపై దృష్టిపెట్టారు. కొత్తగా చెప్పేందుకు కథేమీ లేకపోవడం, ఇక మిగిలింది మాఫియాతో పోరాటమే కాబట్టి నకిలీల వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయో ఒక సంఘటన ఆధారంగా చూపెట్టారు. ఆ సన్నివేశాలు భావోద్వేగాల్ని పండిస్తాయి. పతాక సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. అయితే దర్శకుడు అక్కడక్కడా లాజిక్‌లు మిస్ అయ్యారు. ఈ ముఠా వెనక రాజా రవీంద్ర పాత్ర ఉన్నప్పుడు, ఆయనే నకిలీల భాగోతం పేరుతో కథానాయకుడిని ఎందుకు అరెస్ట్ చేస్తాడనేది అంతుచిక్కదు. అందరికీ కనెక్ట్ అయ్యే అంశాన్ని ఎంచుకున్నాడు కానీ... థ్రిల్లింగ్ అంశాల్ని మరింతగా జోడించడంలో దర్శకుడు విఫలమైటనట్టు అనిపిస్తుంది.
* ప్లస్ పాయింట్స్
కథ
వినోదం
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
* మైనస్ పాయింట్స్
స్లో నేరేషన్
* ఫైనల్ వర్డిక్ట్: నకిలీ వ్యవహారంపై సురవరం సంధించిన ఓ సామాజికాస్త్రం ఈ చిత్రం.
- రివ్యూ రాసింది శ్రీ