నటీనటులు : అల్లరి నరేష్త, పూజ ఝవేరి, వెన్నెల కిశోరె, అజయ్ ఘోష్ దితరులు
దర్శకత్వం : గిరి పాలిక
నిర్మాతలు : సుంకర రాంబ్రహ్మం
సంగీతం : సాయి కార్తీక్
సినిమాటోగ్రఫర్ : సతీష్ ముత్యాల
ఎడిటర్: యమ్ ఆర్ వర్మ
రేటింగ్: 2/5
ఒకప్పుడు అల్లరి నరేష్ కెరీర్ సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్సులా పరుగులు పెడుతూ ఉండేది. యేడాదికి నాలుగైదు సినిమాలు తగ్గేవి కావు. అందులో ఒక్కటి హిట్టయినా... మరో యేడాది ఇంకో అరడజను సినిమాలు లైనులో ఉండేవి. అయితే... నరేష్ కెరీర్ ఈమధ్య కళ తప్పింది. తనకు హిట్టనేది అందని ద్రాక్ష పండు అయిపోయింది. నరేష్ బలం వినోదమే. హాయిగా నవ్వుకోవడానికి జనాలు థియేటర్లకు వచ్చేవాళ్లు. ఇప్పుడు అంత అవసరం లేదు. జబర్‌దస్త్ లాంటి కామెడీ పెరిగిపోవడం వల్ల... నవ్వులు ఎక్కడపడితే అక్కడ దొరికేస్తున్నాయి. అందుకే నరేష్ డిమాండ్ తగ్గింది. కొత్త తరహా కథలు ఎంచుకుంటే తప్ప నరేష్ కెరీర్ మళ్లీ గాడిలో పడలేని ఈ తరుణంలో.. `బంగారు బుల్లోడు` అవతారం ఎత్తాడు నరేష్. మరి ఈ బంగారం నిజంగా బంగారమేనా? గిల్టు నగలా? తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
* కథ
ప్రసాద్ (నరేష్) బ్యాంకులో ఉద్యోగి. తనకు ఇద్దరు అన్నలు. ఇద్దరూ... ఆవారా గాళ్లే. వాళ్లకింకా పెళ్లిళ్లు కాలేదు. అన్నలకైతే తప్ప తమ్ముడికి కాదు. తాతయ్య (తనికెళ్ల భరణి) ఊర్లో పేరు మోసిన కంశాలి. తనంటే ఊర్లో అందరికీ నమ్మకం. ఊర్లో అమ్మవారి విగ్రహానికి కూడా తనే ఆభరణాలు తయారు చేస్తాడు. అయితే.. ఓసారి అనుకోని పరిస్థితుల్లో అమ్మవారికి గిల్టు నగలు చేసిచ్చి, ఆ బంగారంతో.. తన కొడుకు కోడళ్లని బతికించుకోవాలనుకుంటాడు. పాతికేళ్లయినా... అమ్మవారి మెడలో గిల్టు నగలే ఉంటాయి. ఆ సంగతి ఊర్లో ఎవ్వరికీ తెలీదు. వాటిని నిజం నగలే అనుకుంటారు. ఎలాగైనా సరే.. అమ్మవారికి నిజం నగలు చేయించాలని తన పాపాన్ని కడిగేసుకోవాలని చూస్తాడు. ఆ బాధ్యత ప్రసాద్ తీసుకుంటాడు. తాతయ్య కోసం అమ్మవారికి బంగారు నగలు చేయించడం కోసం ఓ పథకం పన్నుతాడు. అదేంటి? ఆ ప్లాన్ ఎలా అమలు చేశారు? దాని వల్ల ఎలాంటి తిప్పలు ఎదుర్కోవాల్సివచ్చింది? అన్నదే మిగిలిన కథ.
* విశ్లేషణ
నరేష్ బలం కామెడీ. తను ఎలాంటి పాత్ర చేసినా, అందులోంచి వినోదాన్నే ఆశిస్తారు. అయితే నాణ్యమైన వినోదం ఇవ్వడంలో నరేష్ కొన్నేళ్లుగా విఫలం అవుతున్నాడు. అందుకే కాస్త రూటు మార్చి.. కథలో సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకున్నాడు. ఒక విధంగా నరేష్ మంచి పనే చేశాడు. కామెడీతో పాటు ఇంకొన్ని ఎలిమెంట్స్ జోడించే స్కోప్ దొరికింది. అమ్మవారి గిల్టు నగల ఫ్లాష్ బ్యాక్, బ్యాంకు లో నగల్ని బయటకు తీసుకురావడం, నగల చోరీ.. ఇలాంటి అంశాలు థ్రిల్లింగ్ కి చోటిచ్చాయి. వాటి మధ్య నరేష్ శైలి వినోదం జోడించుకుంటూ వెళ్తే.. నిజంగా బంగారు బుల్లోడు బంగారు గుడ్లు పెట్టే సినిమా అయ్యేది.
అయితే నరేష్ నుంచి ఆశించే వినోదం, థ్రిల్.. అంతంత మాత్రంగానే పండాయి. తొలి సన్నివేశాలతో ప్రేక్షకుల్ని కూర్చీలో కూర్చోబెట్టగలిగాడు గానీ, వాటిని అతుక్కుపోయేలా చేయలేకపోయాడు దర్శకుడు. వెన్నెల కిషోర్ ఎపిసోడ్ కాస్త నవ్విస్తుంది. లవ్ లెటర్ ఎపిసోడ్ ఓకే అనిపిస్తుంది. అయితే... అది మినహాయిస్తే.. నవ్వుకునే సందర్భాలు చాలా తక్కువ. ఇంట్రవెల్ ముందు నగలు మాయం అవ్వడంతో.. ఈ సినిమా క్రైమ్ కామెడీ జోనర్‌లోకి అడుగుపెడుతుంది.
అయితే.. ఆ క్రైమ్ కామెడీ ఎపిసోడ్లనీ దర్శకుడు సవ్యంగా రాసుకోలేకపోయాడు. సెకండాఫ్ ఇన్వెస్టిగేషన్ పకడ్బందీగా సాగి, ట్విస్టులు బయటకు వస్తే.. బాగుండేది. సెండాఫ్ మొదలవ్వగానే ఇన్వెస్టిగేషన్ అనేది గాలికి వదిలేసిన దర్శకుడు.. నరేష్ రెగ్యులర్ కామెడీ సీన్లని నమ్ముకున్నాడు. గెటప్ శ్రీనుని రంగంలోకి దింపి.. ఆడ గెటప్ వేసినా.. అది అతకలేదు. పైగా ఆయా సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. పోసాని క్యారెక్టర్ నుంచి కామెడీ పిండుకునే ఛాన్స్ వున్నా.. తను రెగ్యులర్ బాడీ లాంగ్వేజ్‌తో విసిగించాడు. లవ్ ట్రాక్ కూడా రోత పుట్టించడంతో.. సెకండాఫ్ పూర్తిగా తేలిపోయింది.
* నటీనటులు
నరేష్ కొత్తగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నాడు.కానీ కొత్త కథల్ని మాత్రం ఎంచుకోలేపోతున్నాడు. తాను ఈ జోనర్ నుంచి బయటపడాల్సిన అవసరం వుంది. పూజా జావేరీ హీరోయిన్ కి తక్కువ.. క్యారెక్టర్ ఆర్టిస్టుకి ఎక్కువ అన్నట్టు తయారైంది. తనికెళ్ల తన సీనియారిటీని సిన్సియర్ గా వాడుకున్నాడు. వెన్నెల కిషోర్ మాత్రమే కాస్తో కూస్తో నవ్వించాడు. మిగిలిన వన్నీ రెగ్యలర్ పాత్రలే.
* సాంకేతిక వర్గం
ఇదేం కొత్త కథ కాకపోయినా.. నరేష్ గత చిత్రాలతో పోలిస్తే... కాస్తో కూస్తో విషయం ఉన్న కథ. పైగా.. కొన్ని మలుపులూ కనిపించాయి. కానీ... దాన్ని సరైన రీతిలో వాడుకోలేదు. దర్శకుడు నరేష్ కామెడీ పల్స్ సరిగా పట్టుకోలేదేమో అనిపిస్తుంది. నిర్మాణ విలువలు.. అంతగా కనిపించలేదు. వీలైనంత తక్కువలో సినిమా తీద్దాం అన్న ధ్యాస తప్ప. బంగారు బుల్లోడు లోని సూపర్ హిట్ గీతం స్వాతిలో ముత్యమంత.. పాటని రీమిక్స్ చేశారు. అదొక్కటే మంచి ఊపు తెస్తుంది. కానీ రాంగ్ ప్లేస్ లో పడిందంతే.
*ప్లస్ పాయింట్స్
వెన్నెల కిషోర్
రీమిక్స్ పాట
* మైనస్ పాయింట్స్
కామెడీ డోసు తగ్గడం
సాగదీత
*ఫైనల్ వర్డిక్ట్: మెరుపుల్లేవు బుల్లోడా