నటీనటులు: ప్రియమణి, శరణ్య ప్రదీప్, జాన్ విజయ్, శాంతి రావు తదితరులు
దర్శకత్వం: అభిమన్యు
నిర్మాతలు: బాపినీడు, సుధీర్
సంగీత దర్శకుడు: జస్టిన్ ప్రభాకరన్, మార్క్ కె రాబిన్
సినిమాటోగ్రఫీ: దీపక్ యెరగరా
ఎడిటర్ : విప్లవ్ నైషాదం
రేటింగ్: 2.5/5
ప్రియమణి ఇప్పుడు టీవీలకి షిఫ్ట్ అయిపోయింది కానీ తను మణిరత్నం హీరోయిన్. నేషనల్ అవార్డ్ విన్నర్. ఫ్యామిలీ మాన్ లాంటి పాపులర్ వెబ్ సిరిస్ లో లీడు. అందుకే ఆమె నుంచి సినిమా వస్తుందంటే సహజంగానే ఆసక్తి వుంటుంది. ఇప్పుడు ఆమె డైరెక్ట్ ఓటీటీకి ఓ సినిమా చేసింది.అదే 'భామాకలాపం'. ఆహాలో విడుదలైన ఈ సినిమా రివ్యూలోకి వెళితే..
కథ:
అనుపమ(ప్రియమణి) హౌస్ వైఫ్. యూట్యూబ్ లో వంట వీడియోలు చేసి పెట్టడం హాబీ. ఆమెకి ఇంకో క్యాలిటీ కూడా వుంది. ఆత్రం ఎక్కువ. ఇరుగుపొరుగు వారి ఇళ్లల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకునే ఆత్రం. ఆ ఆత్రమే అనుపమ కొంప ముంచుతుంది. ఆత్రంతో ఓ ఇంట్లో చొరబడి ఏం జరుగుతోందో తెలుసుకునే ఆరాటంలో.. అనుకోకుండా ఒకరిని పొడిచి చంపేస్తుంది. ఇంకో అసలు విషయం ఏమిటంటే హత్యకు గురైనవాడి దగ్గర 200 కోట్ల విలువ చేసే ఓ గుడ్డు వుంటుంది. దాని కోసం ఓ గ్యాంగ్ తిరుగుతుంది.చివరికి ఈ హత్య కేసు నుంచి.. అనుపమ ఎలా తప్పించుకుంది? ఆ గుడ్డు కథ ఏమిటి ? అనేదే మిగిలిన కథ.
విశ్లేషణ:
కథ వినడానికి ఆసక్తిగానే వుంది కానీ ఆ కథని చూపించిన విధానం మాత్రం చాలా సాదాసీదాగా అసహనంగా సాగుతుంది. క్రైమ్ కామెడీ జోనర్ ట్రీట్ చేయాలని ప్లాన్ చేసిన దర్శకుడు .. దాన్ని పక్కన పెట్టి బోరింగ్ డ్రామాగా మార్చేశాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం సాదాసీదాగా సాగిపోతుంది. కామెడీ కూడా వర్కవుట్ అవ్వలేదు. నిజానికి ఈ కథ ఎత్తుగడలోనే లోపం వుంది. ఒకసాదారణ గృహణి అనుకోకుండా హత్య చేయడం దాని నుంచి బయటపడటం అనేది ఇంట్రస్టింగ్ పాయింటే. అయితే ఇది సహజంగా వుంటే బావుండేది. అయితే తన పాత్రకి వున్న వీక్ నెస్ కారణంగా హత్య జరగడంతో సహజత్వం లోపించి తర్వాత అంతా ఫేక్ డ్రామా కిందికి మారిపోయింది. అలా కాకుండా ఆ మర్డర్ అనేది కాస్త సహజంగా ప్లాన్ చేసివుంటే అనుపమ పాత్ర పై సింపతి వచ్చి డ్రామా రక్తికట్టేది.
ఈ సినిమాలో విలన్ కూడా ప్రధాన మైనస్. 200 కోట్ల విలువ చేసే వస్తువు పోగొట్టుకొని సిల్లీగా బిహేవ్ చేస్తుంటాడు. దీంతో గుడ్డు చుట్టూ జరిగే డ్రామా కూడా సిల్లీగా వుందనిపిస్తుంది. పైగా దర్శకుడు టూ మచ్ సినిమా లిబార్టీ తీసుకున్నాడు. ఒక శవాన్ని బట్టలు మడత పెట్టినట్లు ఒక సూట్ కేసులో పెట్టి, దాన్ని అపార్ట్మెంట్ మధ్యలో పడేసి, మర్డర్ చేసిన వ్యక్తి ఫస్ట్ ఎయిడ్ చేసుకొని మళ్ళీ సూట్ కేసు తెచ్చుకునే వరకూ ఆ శవాన్ని ఎవరూ చూడకపోవడం టూ మచ్ అనిపిస్తుంది.
పైగా ఇంటికి తెచ్చిన శవాన్ని ఫ్రిజ్ లో ఐస్ క్రీమ్ పెట్టినట్లు వంటగదిలో ఓ అల్మారాలో పెట్టి కూల్ గా నిద్రపోయి పొద్దున్నకల్ల మళ్ళీ భయపడిపోవడం డ్రామాలో సీరియస్ నెస్ ని మొదటే దెబ్బతీసింది. పైగా ఈ కథకి మతాలు,ఫాస్టర్ ప్రవచనాలని ఏదో కోటింగ్ ట్రై చేశారు. కానీ ఈ కథకు అది అనవసరం. ఆ టచ్ సినిమాకి ప్లస్ కాకపోగా మైనస్ గా మారింది.
నటీనటులు:
ప్రియమణి మంచి నటి. అనుపమ పాత్రని చక్కగా చేసింది. అయితే ఆమె పాత్ర డిజైన్ చేసిన విధానం అంత కనెక్టింగా లేదు. ప్రియమణితో పాటు కనిపించే పని మనిషి శిల్ప(శరణ్య) తన నటనతో నవ్వించే ప్రయత్నం చేసింది. నటుడు కిషోర్ కుమార్ పొలిమేర నెగెటివ్ షేడ్స్ ఉన్న చర్చ్ ఫాదర్ గా ఓకే. కామెడీ విలన్ క్యారెక్టర్ లో జాన్ విజయ్ పరవాలేదనిపిస్తాడు. మిగతానటులు ఓకే .
సాంకేతిక వర్గం:
జస్టిన్ ప్రభాకర్ స్వరాలు రిజిస్టర్ కావు. మార్క్ కె రాబిన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేట్ అయ్యింది. దీపక్ సినిమాటోగ్రఫీ బాగుంది. సంభాషణలు కొన్ని బావున్నాయి. నిర్మాణ విలువలు అంత గొప్పగా లేవు.
ప్లస్ పాయింట్స్
ప్రియమణి
అక్కడక్కడా సస్పెన్స్
మైనస్ పాయింట్స్
సాగతీత..
బోరింగ్ స్క్రీన్ ప్లే
వీక్ ప్లాట్
ఫైనల్ వర్దిక్ట్ : భామతో రిస్కే