'ఖిలాడీ' మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

నటీనటులు: రవి తేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి, అర్జున్, ఉన్ని ముకుందన్, అనసూయ భరద్వాజ్
దర్శకత్వం : రమేష్ వర్మ
నిర్మాత: సత్యనారాయణ కోనేరు
సంగీత దర్శకుడు: దేవీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు
ఎడిటర్ : అమర్ రెడ్డి


రేటింగ్: 2/5


మాస్, యాక్షన్ , కమర్షియల్ సినిమాలే రవితేజ్ ని హీరోగా నిలబెట్టాయి. రవితేజ నుంచి వచ్చే సినిమాలు దాదాపు మాస్ ని ద్రుష్టిపెట్టుకొని తయారైనవే. ఇప్పుడు 'ఖిలాడీ' కూడా మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన వచ్చిన సినిమానే. ట్రైలర్ లో యాక్షన్, రోమాన్స్ దట్టించారు. రవితేజ మార్క్ వినోదం చూపించారు. దీంతో సహజంగానే ఖిలాడీపై ఆసక్తి పెరిగింది. మరి ట్రైలర్ లో కనబరిచిన ఆసక్తి థియేటర్ కొనసాగిందా? రవితేజ మార్క్ వినోదం ప్రేక్షకులకు దొరికిందా ? ఇంతకీ ఏమిటీ ఖిలాడీ కథ. 


కథ:


మోహన్ గాంధీ ( రవితేజ ) ఓ ప్రముఖ ఆడిట్ కంపెనీలో ఆడిటర్. తన ఫ్యామిలీని హత్య చేసిన కేసులో జైలుకి వెళ్తాడు. పూజా (మీనాక్షి చౌదరి) సైకాలజీ స్టూడెంట్. మోహన్ గాంధీ కేసుపై ఆసక్తితో అతడిపై థీసిస్ చేస్తుంది. ఈ క్రమంలో కొన్ని షాకింగ్ విషయాలు బయటపడతాయి. వేలకోట్ల రూపాయిలు వున్న ఓ కంటైనర్ ఇటలీ నుంచి ఏపీకి  వస్తుంది. దాని వెనుక పెద్ద మాఫియా వుంటుంది. అసలు మోహన్ గాంధీ కేసు ఏమిటి ? డబ్బు బండిల్ వెనుక వున్న కథ ఏమిటి ? ఈ కేసులో వెనుక  ఎలాంటి నిజాలు వున్నాయి ? అనేది మిగిలిన కథ.


విశ్లేషణ:


‘చారణా కోడికి.. బారణా మసాలా ’ అని సామెత. అంటే కోడి విలువ కంటే మసాలా ఖర్చే అధికమని అర్థం. ఖిలాడీ సినిమా పరిస్థితి కూడా అదే. పావుకేజీ కథ వండటానికి పది కిలోల మసాలా నూరారు. దీంతో వంటకం భరించలేనంత చేదుగా తయారైయింది. జైలు ఎపిసోడ్ సినిమా మొదలైనప్పుడు.. ఇదేదో కొత్త కథ, ఏదో మ్యాజిక్ చేస్తారని నమ్మి సీట్లో సర్దుకొని కూర్చున్న ప్రేక్షకుడి ఆశలుపై మరో పది నిమిషాల్లోనే నీళ్ళు చల్లేశాడు దర్శకుడు. సాగాదీత ఫ్యామిలీ ఎపిసోడ్ తో తల పట్టుకొనేలా చేశాడు. అసలు కథలో వెళ్ళడానికి సమయం తీసుకున్నపుడు కనీసం కామెడీ అయిన కొత్తగా ఫ్రెష్ గా ఉండేట్లు చూసుకోవాల్సింది. అదీ చేయలేదు. రవితేజ ఎనర్జీగా కనిపిస్తుంటాడు కానీ రైటింగ్ లో బలం లేకపోవడంతో ఎంత టైమింగ్ తో నెట్టుకోస్తామని చూసిన కనెక్ట్ కాదు. ఇంటర్వెల్ కి ముందు అసలు కథలోకి వెళ్ళినట్లు కనిపించినట్లే కనిపించి మళ్ళీ వేగాన్ని తగ్గించేస్తారు. ఇంటర్వెల్ బాంగ్ కూడా ఆసక్తిని పెంచదు. 


ఖిలాడీకి అసలు సమస్య సెకండ్ హాఫ్ లో ఎదురౌతుంది. ఇక్కడి నుంచి అన్నీ ఓవర్ గా అనిపిస్తాయి. పాత్రలు వస్తుంటాయి, పోతుంటాయి. కొన్ని సీన్స్ కి అసలు కనెక్షన్ వున్నట్లు అనిపించదు. దర్శకుడు రాసుకున్న కొన్ని ట్విస్ట్ లు ఒక దశలో గంధరగోళానికి కూడా గురి చేస్తాయి. ట్విస్ట్ కోసం వేసుకున్న సబ్ ఫ్లాట్ లు క్లూస్ లెస్ గా వుంటాయి. ప్రీ క్లైమాక్స్ కి వచ్చేసరికి ఖిలాడీలో విషయం లేదనే సంగతి అర్ధమౌతుంది. లావిష్ మేకింగ్, రవితేజ మార్క్ యాక్షన్ సీన్లు, కలర్ ఫుల్ సినిమాటోగ్రఫీ అన్నీ ఉన్నప్పటికీ కథ, కధనంలో డొల్లతనం వుండటంతో అంతా బూడిదలో పోసిన పన్నీరుగా మిలిగిపోతుంది. అయితే ఇందులో రిలీఫ్ ఏమిటంటే పాటలు. కలర్ ఫుల్ హీరోయిన్స్,  గ్లామర్ లో కొంచెం శ్రుతి మించి ఉన్నప్పటికీ ఖిలాడీ ప్రహసనంలో అవే కొంత ఊరట.      

 

నటీనటులు :


రవితేజ అంటేనే వినోదం. స్క్రీన్ పై స్ప్రింగ్ లా కదులుతుంటాడు. అదే ఫ్యాన్స్ కి ఇష్టం. ఇందులో కూడా ఎనర్జీటిక్ గా కనిపించాడు. ఇది రవితేజకి అలవాటైన పాత్రే. అయితే ఈ పాత్ర డిజైన్ చేయడంలో దర్శకుడి లోపం కనిపిస్తుంది. పాత్రకి ఒక గ్రాఫ్ వుండదు. కొన్ని చోట్ల ఓవర్ యాక్షన్ కూడా అనిపిస్తుంది. ఇది దర్శకుడి లోపమే.


మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి ఇద్దరూ ఖిలాడీకి గ్లామర్ కోటింగ్. కొన్ని చోట్ల ఓవర్ ఎక్సపోజింగ్ అనిపిస్తుంది. అయితే ఈ మాత్రం సినిమాకి ఆ మాత్రం అతి వుండాలని సరిపెట్టుకోవాల్సిందే.  సిబిఐ ఆఫీసర్ గా కనిపించిన అర్జున్ పాత్రలో పెద్ద వైవిధ్యం లేదు. మురళి శర్మ, అనసూయా ట్రాక్ ఆకట్టుకోదు. ఉన్ని ముకుందన్, రావు రమేష్, సచిన్ ఖేడేకర్ ఇలా చాలా మంది మంచి నటులు వున్నా చెప్పుకోదగ్గ పాత్రలైతే కాదు. వెన్నల కిషోర్ జస్ట్ ఓకే. 


సాంకేతిక వర్గం :


దేవిశ్రీ మ్యూజిక్ రొటీన్ గా వుంది. పాటల చిత్రీకరణ మాత్రం కలర్ ఫుల్ గా వుంది. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. ఎడిటర్ ఇంకాస్త ట్రిమ్ చేసివుండొచ్చు. నిర్మాణ విలువలు బావున్నాయి.రమేష్ వర్మ విషయం వున్న  దర్శకుడు. అయితే ఆయన ద్రుష్టి కేవలం మేకింగ్ పెట్టాడనిపిస్తుంది. కాస్త కథ విషయంలో పగడ్బందీగా వుండి ప్లాన్ చేసివుంటే ఖిలాడీ రిజల్ట్ మరోలా వుండేది. 


ప్లస్ పాయింట్స్


రవితేజ,
కలర్ ఫుల్ పాటలు, యాక్షన్ 
లావిష్ మేకింగ్ 


మైనస్ పాయింట్స్ 


బలహీనమైన కథ 
బోరింగ్ స్క్రీన్ ప్లే 
వినోదం పండకపోవడం  
 

ఫైనల్ వర్దిక్ట్ :  రొటీన్ ప్లే 'ఖిలాడీ'


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS