నటీనటులు : నితిన్, రష్మిక, జిషు సేన్‌గుప్తా, అనంత్ నాగ్, వెన్నెల కిషోర్ తదితరులు
దర్శకత్వం : వెంకీ కుడుముల
నిర్మాతలు : సితార ఎంటర్టైన్మెంట్స్
సంగీతం : మహతి స్వర సాగర్
సినిమాటోగ్రఫర్ : సాయి శ్రీ రామ్
ఎడిటర్ : నవీన్ నూలి
రేటింగ్: 3/5
సినిమాకి కావల్సినవి మూడే మూడు విషయాలు.
1. ఎంటర్‌టైన్‌మెంట్
2. ఎంటర్‌టైన్‌మెంట్
3. ఎంటర్‌టైన్‌మెంట్
సినిమా పుట్టినప్పటి నుంచీ ఈ విషయం చెవిలో గూడు కట్టుకుని మరీ చెబుతూనే ఉన్నారు. కానీ పట్టించుకునేవాళ్లు కొంతమందే. అందుకే హిట్లూ కొన్నే. నువ్వు ఏ విషయాన్నైనా చెప్పు - ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అవ్వకుండా చెప్పు... అనేది సినిమా ఫార్ములా. ఛలోతో దాన్ని పట్టేశానని నిరూపించుకున్న దర్శకుడు వెంకీ కుడుముల. ఇప్పుడు `భీష్మ`తోనూ తన దారి అదే అని ఇంకోసారి సిల్వర్ స్క్రీన్ గుద్ది మరీ చెప్పాడు. మరి `భీష్మ` కోసం వెంకీ కుడుముల కొత్తగా ఏం చేశాడు.?? వరుస ఫ్లాపులలో ఉన్న నితిన్‌కి భీష్మ ఎలా కలిసొచ్చింది? ఈ సినిమాలోని నవ్వులెన్ని..?
* కథ
భీష్మ ఆర్గానిక్స్ అధినేత భీష్మ (అనంత్ నాగ్). తన వయసు మీద పడుతుంది. మార్కెట్‌లో పోటీ పెరుగుతుంది. అందుకే.. ఈ కంపెనీతో పాటు తన ఆశయాన్ని నడిపించగల వ్యక్తిని సీఈవో చేద్దామనే అన్వేషణలో ఉంటాడు. ఆ కంపెనీలో పనిచేసే చైత్ర (రష్మిక)ని తొలి చూపులోనే ప్రేమించేస్తాడు మరో భీష్మ (నితిన్). కొన్ని సినిమాటిక్ కారణాల వల్ల.... భీష్మ కంపెనీకి తాత్కాలిక సీఈవోగా నియమితమవుతాడు భీష్మ. ఈ 30 రోజుల్లో తన పనితీరుని బట్టి భీష్మ కంపెనీకి సీఈఓగా ఉంటాడా, లేదంటే ఆ కంపెనీ నుంచి వెళ్లిపోతాడా అనేది నిర్ణయం అవుతుంది. మరి ఈ 30 రోజుల్లో ఏం జరిగింది? ఆ కంపెనిని భీష్మ ఎలా నిలబెట్టాడు? తన ప్రేమని ఎలా దక్కించుకున్నాడు? అనేదే భీష్మ కథ.
* విశ్లేషణ
సేంద్రియ ఎరువులు - వాటి ఉపయోగాలు... వాటి నేపథ్యంలో సాగే కథ ఇది. నిజానికి రైతుల సమస్యలు, వాళ్ల కన్నీళ్ల చుట్టూ తిరగాల్సిన సినిమా ఇది. కానీ వెంకీ కుడుముల ఈ కథని అంత భారంగా చెప్పాలనుకోలేదు. వినోదాల పూత పూసి.. హాయిగా నవ్వుకుంటూ చూసేలా తీయాలనుకున్నాడు. అదే చేశాడు. ఓ అమ్మాయిని ప్రేమించడం తప్ప, జీవితంలో మరే లక్ష్యమూ లేని, ఓ డిగ్రీ తప్పిన ఆకతాయిని తీసుకొచ్చి.. భీష్మ కంపెనీలో పడేశాడు. అక్కడ అమ్మాయిలతో రొమాన్స్, సహ ఉద్యోగులతో కామెడీ చేసుకుంటూ, మధ్యమధ్యలో విలన్ ని ఆడుకుంటూ, హీరోలా ఫైట్లు చేస్తూ, కంపెనీని కాపాడేస్తుంటాడు. వాటికి సంబంధించిన సన్నివేశాలు కాస్త లాజిక్‌కి దూరంగా ఉన్నా, దర్శకుడు తనకు కావల్సిన లిబర్టీ కంటే ఎక్కువే తీసుకున్నా... ఆయా సన్నివేశాలన్నీ చూడబుల్‌గా ఉంటాయి. కారణం... వినోదమే. ప్రతీ రెండు మూడు సన్నివేశాలకూ ఓ నవ్వించే ఎపిసోడో, ఓ జోకో.. చిన్న పంచో పడుతుంది. దాంతో కాలక్షేపం అయిపోతూ ఉంటుంది. నితిన్ - రష్మికల కెమిస్ట్రీ, మాసీ స్టెప్పులు, క్లాసీ ఫైట్లతో ఎక్కడా కాలక్షేపానికి ఢోకా లేకుండా సాగిపోతుంది.
దర్శకుడు ముందు నుంచీ వినోదాన్నే నమ్ముకున్నాడు. తన బలం... అదే. దాన్ని మరింత బలంగా, పకడ్బందీగా చూపించుకుంటూ వెళ్లాడు. కథానాయకుడి పాత్ర చిత్రణ, హీరోయిన్‌తో పరిచయం, కమీషనర్‌తో సరదాలు, సరసాలూ.. ఇవన్నీ బాగా పండాయి. ఇంట్రవెల్ ట్విస్టుతో కావల్సిన బ్యాంగ్ ఇచ్చుకున్నాడు. సీఈఓగా నితిన్ చేసే ఆకతాయి పనులూ నవ్విస్తాయి. మధ్యలో సేంద్రియ వ్యవసాయం అనే టాపిక్ కథకు వెన్నుదన్నుగా నిలుస్తూ, ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తుంది. సాధారణ రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లోలా.. క్లైమాక్స్ లో ఫైటు పెట్టకుండా, అక్కడ కూడా దర్శకుడు తెలివితేటలు వాడి.. గట్టెక్కేశాడు.ఈ సినిమాకి `మహర్షి`లా సీరియస్ లుక్‌తో తీయొచ్చు. కానీ.. నితిన్ నుంచి అలాంటి సన్నివేశాలు, సినిమాలూ ఆశించరు. పైగా అలాంటి కథలు ఈమధ్య చూసీ చూసీ ప్రేక్షకులకూ బోర్ కొట్టేసింది. అందుకే ఓ ఫన్ రైడ్‌గా మలిచాడు. విజయం సాధించాడు.
* నటీనటులు
నితిన్‌కి ఈ పాత్ర నల్లేరుమీద నడకే. దిల్, గుండెజారిగల్లంతయ్యిందే సినిమాల్లోలా... ఆడుతూ పాడుతూ నటించేశాడు. ఎప్పటిలా స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. కొటేషన్లతో కట్టిపడేశాడు. రష్మిక క్యూట్‌గా కనిపించింది. వాటే బ్యూటీలో రష్మిక డాన్స్.. చూసే కొద్దీ చూడబుద్ధేస్తుంది. నితిన్ - రష్మికల కెమిస్ట్రీ ఈ సినిమాకున్న మరో అదనపు ఆకర్షణ. వెన్నెల కిషోర్ మరోసారి తనదైన టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. రఘుబాబు చాలా కాలం తరవాత నవ్వించాడు. అనంతనాగ్ తన హుందాతనానికి తగిన పాత్రలో కనిపించారు. మిగిలినవాళ్లంతా షరా మామూలే.
* సాంకేతిక వర్గం
మహతి పాటలు ఓకే అనిపిస్తాయి. మంచి లొకేషన్లలో తెరకెక్కించడం వల్ల, స్టెప్పుల వల్ల ఇంకాస్త అందం వచ్చింది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. సినిమా అంతా ఓ కలర్ థీమ్‌ని ఫాలో అవుతూ తీసినట్టు అనిపిస్తుంది. వెంకీ కుడుముల పెన్ను బాగా పరిగెట్టింది. చిన్న లైన్ పట్టుకుని, వినోదాత్మకంగా తెరకెక్కించగలిగాడు. ఈ సినిమాతో పెద్ద హీరోల దృష్టి తనపై పడొచ్చు.
* ప్లస్ పాయింట్స్
నితిన్ - రష్మిక కెమిస్ట్రీ
వాటే బ్యూటీ లో స్టెప్పులు
వినోదం
* మైనస్ పాయింట్స్
సింపుల్ కథాంశం
సినిమాటిక్ మలుపులు
* ఫైనల్ వర్డిక్ట్: పచ్చని వినోదం