'ప్రెజ‌ర్ కుక్క‌ర్' మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటలు : సాయి రోన‌క్‌, ప్రీతి, త‌నికెళ్ల భ‌రణి, రాహుల్ రామ‌కృష్ణ

దర్శకత్వం : సుజోయ్ & సుశీల్

నిర్మాత : సుజోయ్ & సుశీల్, అప్పిరెడ్డి

మ్యూజిక్ : హర్షవర్ధన్ రామేశ్వర్

 

రేటింగ్‌: 2/5


పిల్ల‌ల చ‌దువులు ఓ ప్రెజ‌ర్‌. వాళ్ల ఉద్యోగాలు ఓ ప్రెజ‌ర్‌. పెళ్లిళ్లు మ‌రో ప్రెజ‌ర్‌. బాల్యం నుంచి య‌వ్వ‌నం వ‌ర‌కూ, య‌వ్వ‌నం నుంచి వృద్ధాప్యం వ‌ర‌కూ... ఇలాంటి ఒత్తిడిలోనే బ‌తుకుతున్నారంతా. ఈ త‌రాన్ని `అమెరికా` జ్వ‌రం పీడిస్తోంది. ఇక్క‌డ చ‌దువుకుని, అమెరికాలో ఉద్యోగం తెచ్చుకుంటేనే జీవితం ఉన్న‌ట్టు, డాలర్లు సంపాదిస్తేనే ప్ర‌తిభావంతుడ‌న్న‌ట్టు లెక్కేస్తున్నారు. ఈ అమెరికా ఆశ‌ల్లో, డాల‌ర్ల వేట‌లో యువ‌త‌రం ఎలా బ‌లైపోతోంది? అమెరికా జీవితాల ముసుగేంటి? పిల్ల‌ల‌కు దూర‌మై, దేశంలో ఒంటరిగా బ‌తుకుతున్న వృద్ధ త‌ల్లిదండ్రుల ఆవేద‌నేంటి? అనే విష‌యాల్ని చూపించే ప్ర‌య‌త్నం చేసింది `ప్రెజ‌ర్ కుక్క‌ర్‌`.

 

* క‌థ‌

 

కిషోర్ (సాయి రోన‌క్‌) అమెరికా వెళ్లే ప్ర‌యత్నాలు చేస్తుంటాడు. కానీ ఎన్నిసార్లు ప్ర‌య‌త్నించినా వీసా రాదు. దొంగ స‌ర్టిఫికెట్ల‌తో ప్ర‌య‌త్నించి ఓసారి దొరికిపోతాడు. పాతిక ల‌క్ష‌లిస్తే.. అమెరికా వీసా వ‌స్తుంద‌ని ఆశ‌ప‌డి, పొలాన్ని తాక‌ట్టు పెట్టి మ‌రీ బ్రోక‌ర్ చేతికి అప్పగిస్తే.. వాళ్లూ మోస‌గిస్తారు. ఇలా అమెరికా వెళ్లే మార్గాల‌న్నీ మూసుకుపోతాయి. ఈ ప్ర‌యాణంలో అనిత (ప్రీతి) తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. మ‌రి ఈ ప్రేమ‌క‌థ ఎలా సాగింది? త‌న అమెరికా ప్ర‌యాణంలో ఏర్ప‌డ్డ ఆటంకాల్ని ఎలా దాటుకుంటూ వెళ్లాడు? అనేది మిగిలిన క‌థ‌.

 

* విశ్లేష‌ణ‌

 

చాలా సాధార‌ణ‌మైన క‌థ ఇది. షార్ట్ ఫిల్మ్ రైట‌ర్స్ కూడా ఇలాంటి క‌థ‌ల్ని ఏనాడో వండి వార్చేశారు. దాన్ని ప‌ట్టుకుని, ఇన్ని కోట్లు ఖ‌ర్చు పెట్ట‌డం రిస్కే. ఇలాంటి క‌థ‌లు ఎంచుకున్న‌ప్పుడు అందులో ఏదో ఓ స‌బ్ ఫ్లాట్ ఉండాలి. లేదంటే వినోదాన్ని బాగా రంగ‌రించ‌గ‌ల‌గాలి. యువ‌త‌రానికి న‌చ్చేలా చెప్ప‌గ‌ల‌గాలి. కానీ.. ఈ సినిమాలో అవేం క‌నిపించ‌వు. క‌థ ఎంత సాదా సీదాగా ఉందో క‌థ‌నం కూడా అలానే త‌యారైంది. ఏ ద‌శ‌లోనూ ఆక‌ట్టుకోని సినిమా ఇది. ప్రేమ‌క‌థ చ‌ప్ప‌గా సాగుతుంది. క‌దిలించాల్సిన సెంటిమెంట్ స‌న్నివేశాలు కూడా సాదాసీదా న‌డుస్తాయి. వినోదం పండ‌లేదు. పాట‌లూ అంతంత మాత్ర‌మే. అలాంట‌ప్పుడు ప్రేక్ష‌కుల‌కు భ‌రించే ఓపిక ఎక్క‌డి నుంచి వ‌స్తుంది? సినిమాలో మాట‌కోసారి `అమెరికా` అనే ప‌దం వ‌చ్చిపోతుంటుంది. దాంతో... `ఈ లొల్లేంట్రా బాబూ` అని ప్రేక్ష‌కుడు అనుకోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది.

 

స‌బ్ ఫ్లాట్ బ‌లంగా లేదు. ఆ మాట‌కొస్తే స‌బ్ ఫ్లాటే లేదు. త‌నికెళ్ల భ‌ర‌ణి క‌థ‌ని స‌బ్ ఫ్లాట్ అనుకున్నా - అది కూడా అమెరికా చుట్టూనే తిరుగుతుంది. `మేకిన్ ఇండియా` అంటూ సాఫ్ట్ వేర్ కంపెనీ ముందు క్లాస్ పీకిన హీరో.. అమెరికా వెళ్లి డాల‌ర్లు సంపాదించాల‌ని ఎలా అనుకుంటాడో అర్థం కాదు. హీరో - హీరోయిన్ మ‌ధ్య కాన్లిఫ్ట్ కూడా అమెరికా కావ‌డంతో ఒకే విష‌యంపై ఈ క‌థంతా న‌డుస్తున్న ఫీలింగ్ క‌లుగుతుంది. ప‌తాక స‌న్నివేశాల్లో ఏం జ‌రుగుతుందో ఈ సినిమా ప్రారంభ‌మైన‌ప్పుడే... ప్రేక్ష‌కుడు ఊహించేస్తాడు. సినిమా కూడా అలానే ముగుస్తుంది.

 

* న‌టీన‌టులు

 

సాయిరోన‌క్ బాగానే న‌టించాడు. త‌న న‌ట‌న‌లో వంక పెట్టాల్సిన విష‌యాలేం లేవు. త‌న లుక్స్ బాగున్నాయి. కాస్ట్యూమ్స్ ఎంపిక బాగుంది. సంభాష‌ణ‌లు ప‌లికే విధాన‌మూ న‌చ్చుతుంది. ప్రీతి అందంగా క‌నిపించింది. కానీ హీరోయిన్ ల‌క్ష‌ణాలు అంతంత‌మాత్రంగానే ఉన్నాయి. త‌నికెళ్ల భ‌రణి న‌ట‌న‌, ఆయ‌న క‌నిపించే స‌న్నివేశాల్లో పండిన భావోద్వేగాలు మాత్ర‌మే కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తాయి. రాహుల్ రామ‌కృష్ణ దాదాపుగా సినిమా అంతా క‌నిపిస్తాడు గానీ, న‌వ్వించిన సంద‌ర్భం ఒక్క‌టీ ఉండ‌దు.

 

* సాంకేతిక వ‌ర్గం

 

ఇద్ద‌రు ద‌ర్శ‌కులు క‌లిసి చేసిన సినిమా ఇది. అయితే... అవుట్ పుట్ మాత్రం స‌రిగా ఇవ్వ‌లేక‌పోయారు. క‌థ ఎంపిక‌లోనే త‌ప్పు జ‌రిగింది. ఈమ‌ధ్య విడుద‌లైన ప్ర‌తి రోజూ పండ‌గే లాంటి క‌థ ఇది. దాంతో చూసిన క‌థ‌నే మ‌ళ్లీ చూస్తున్న ఫీలింగ్ క‌లుగుతుంది ప్రేక్ష‌కుల‌కు. సంగీతం, పాట‌లు, సంభాష‌ణ‌లు అన్నీ సాదా సీదాగానే ఉన్నాయి. అమెరికా జ‌పం త‌ప్ప‌... ఈ సినిమాలో ఇంకేం క‌నిపించ‌లేదు. ఆ ఒక్క పాయింట్ తోనే సినిమా అంతా చుట్టేద్దామ‌నుకుని భంగ ప‌డ్డారు

 

* ప్లస్ పాయింట్స్‌

టైటిల్

 

* మైన‌స్ పాయింట్స్

మిగిలిన‌వ‌న్నీ

 

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌: ఇదేం లొల్లి..? 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS