చిత్రం: భూతద్దం భాస్కర్ నారాయణ
నటీనటులు: శివ కందుకూరి, రాశి సింగ్, అరుణ్ కుమార్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివ కుమార్, షఫీ, శివన్నారాయణ
దర్శకత్వం: పురుషోత్తం రాజ్
నిర్మాతలు: స్నేహల్ జంగాల, శశిధర్ కాసి, కార్తీక్ ముడుంబి
సంగీతం: శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్
ఛాయాగ్రహణం: గౌతమ్ జి
కూర్పు: గారి Bh
బ్యానర్స్: మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్, VSP ప్రొడక్షన్స్
విడుదల తేదీ: 1 మార్చి 2024
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 3.25/5
మర్డర్ మిస్టరీ, డిటెక్టీవ్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. థ్రిల్, ఫన్, సస్పెన్స్.. ఇవన్నీ కలగలిపిన సినిమాలు ఇవి. కంటెంట్ బాగుంటే చాలు, ఏ సీజన్లో వచ్చినా, అందులో హీరో ఎవరైనా... ప్రేక్షకుల మెప్పు పొందగలుగుతాయి. స్టార్ హీరోలకే కాదు, కొత్త కుర్రాళ్లకీ డిటెక్టీవ్ కథలు బాగానే సూట్ అవుతాయి. అందుకే శివ కందుకూరి కూడా ఇలాంటి కథనే ఎంచుకొన్నాడు. అదే `భూతద్దం భాస్కర్ నారాయణ`. టైటిల్ తోనే ఫన్ పుట్టించిన సినిమా ఇది. పైగా డిటెక్టీవ్ కథ. ముందు నుంచీ పద్ధతిగా, నాణ్యమైన కథలు ఎంచుకొంటున్న శివ కందుకూరి ఈ సినిమాలో హీరో. అందుకే అన్ని రకాలుగా `భూతద్దం`పై అటెన్షన్ పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? శివ కందుకూరి చేసిన ఈ ప్రయత్నం ఎంత వరకూ మెప్పించింది?
కథ: భాస్కర్ నారాయణ (శివ కందుకూరి)కి చిన్నప్పటి నుంచీ డిటెక్టీవ్ అవ్వాలన్నది ఆశయం. భాస్కర్ అన్నయ్య ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే అనుకోకుండా ఆ అమ్మాయి హత్యకు గురవుతుంది. ఆ నేరం అన్నయ్యపై పడుతుంది. ఆ అవమానం భరించలేక అన్నయ్య ఆత్మహత్య చేసుకొంటాడు. తన అన్నయ్య నిర్దోషి అని నిరూపించడానికి భాస్కర్ చేసే ప్రయత్నాలన్నీ విఫలం అవుతాయి. దాంతో డిటెక్టీవ్ అవ్వాలన్న కోరిక మరింత బలపడుతుంది. పెరిగి పెద్దయ్యాక... ఓ డిటెక్టీవ్ గా మారి, మర్డర్ కేసుల్ని ఈజీగా సాల్వ్ చేస్తుంటాడు. అయితే... ఆంధ్రా, కర్నాటక బోర్డర్లో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. వాటికి సంబంధించిన క్లూస్ మాత్రం భాస్కర్ కనిపెట్టలేకపోతాడు. మరోవైపు భాస్కర్ స్నేహితురాలు కూడా హత్యకు గురవుతుంది. మరి.. ఈ కేసుల్ని భాస్కర్ ఎలా సాల్వ్ చేశాడు? ఇంతకీ బోర్డర్లో హత్యలు చేస్తోందెవరు? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ: థ్రిల్, సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్, ఎత్తుకు పై ఎత్తులు, మలుపులూ.. ఇదే డిటెక్టీవ్ కథలకు ముడి సరుకులు. ఓ హత్య, లేదంటే ఓ మిస్టరీని ఛేదించడానికి డిటెక్టీవ్ ఏం చేశాడన్నది ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఆ మలుపులు, ఆ ఆసక్తీ... ఇవన్నీ `భూతద్దం భాస్కర్ నారాయణ`లో కనిపించాయి. సాధారణంగా ఇలాంటి కథలు చాలా స్లోగా మొదలవుతాయి. హీరో క్యారెక్టరైజేషన్‌ని ప్రేక్షకులకు ఎక్కడానికి కాస్త సమయం పడుతుంది. కథలో అసలైన సంఘర్షణ మొదలవ్వగానే కథనం ఊపందుకొంటుంది. ఇక్కడా అదే జరిగింది. కథని ప్రారంభించిన విధానం కాస్త స్లోగా అనిపిస్తుంది. అయితే రాను రాను.. వేగం పుంజుకొంటుంది. ఇంట్రవెల్ బ్యాంగ్, సెకండాఫ్‌కి బేస్ వేసిన పద్ధతి... నచ్చుతాయి. ఆంధ్రా బోర్డర్లో అసలేం జరుగుతోంది? హత్యలు చేస్తోందెవరు? అనే కుతూహలం కలుగుతుంది.
తొలి సగంతో పోలిస్తే ద్వితీయార్థం మెరుగ్గా ఉంటుంది. కథకు అదే ఆయువు పట్టు. చివర్లో వచ్చే మలుపులు, కథని ముగించిన పద్ధతీ... అన్నీ ఆకట్టుకొనేలా సాగాయి. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లు, డిటెక్టీవ్ కథలు ఇది వరకు తెలుగులో చాలా వచ్చాయి. అయితే వాటి ప్రభావం దీనిపై అంతగా లేదనే చెప్పాలి. ఓ థ్రిల్లర్‌ని పురాణాలతో ముడి పెట్టడం కొత్తగా అనిపిస్తుంది. లవ్ ట్రాక్‌కు దర్శకుడు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇది ఎలాగూ ఇన్వెస్టిగేషన్ కథ కాబట్టి, ఆ అవసరం లేదు కూడా. క్లైమాక్స్, కథని నడిపిన తీరు.. ఇవన్నీ చూస్తే `విక్రాంత్ రోణ` గుర్తొస్తుంది. కొంతమంది... క్లైమాక్స్ ట్విస్ట్ కనిపెట్టొచ్చేమో కానీ, మిగిలిన వాళ్లకలు అదో ఫజిల్ లా ఉంటుంది.
నటీనటుల ప్రతిభ: తన కెరీర్లో విభిన్నమైన కథల్ని, పాత్రల్ని ఎంచుకొంటూ ప్రయాణం చేస్తున్న శివ కందుకూరికి ఇది మరో కొత్త తరహా పాత్ర. అందులో తాను ఒదిగిపోయాడు. ఫన్, ఎమోషన్స్ చక్కగా పలికిస్తున్నాడు. లక్ష్మి పాత్రలో రాశీసింగ్ నటన కూడా మెప్పిస్తుంది. దేవి ప్రసాద్ నటన, ఆ పాత్రని మలిచిన విధానం సర్ప్రైజింగ్గా అనిపిస్తాయి. మిగిలిన వాళ్లంతా తమ పాత్ర పరిధిమేర చేశారు.
సాంకేతిక వర్గం: చిన్న సినిమా అయినా సాంకేతికంగా ఉన్నతంగా తీర్చిదిద్దారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. కెమెరా, నేపథ్య సంగీతం బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాయి. దర్శకుడు ఈ కథని మొదలెట్టిన విధానం, ముగించిన పద్ధతీ బాగున్నాయి. కొన్ని చోట్ల సినిమాటిక్ లిబర్గీ ఎక్కువ తీసుకొన్నాడనిపిస్తుంది. మధ్యమధ్యలో కొన్ని డల్ మూమెంట్స్ ఉంటాయి. అలాంటి సన్నివేశాల్ని ఇంకాస్త ఫోకస్ చేసి, బాగా రాసుకొని ఉంటే... `భూతద్దం భాస్కర్ నారాయణ` డిటెక్టీవ్ కథల్లో ఎప్పటికీ మిగిలిపోయే మంచి చిత్రమయ్యేది. అయితే ఇప్పటికి మాత్రం మంచి కాలక్షేప చిత్రంగా ప్రేక్షకుల్ని అలరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్లస్ పాయింట్స్
కథ
క్లైమాక్స్ ట్విస్ట్
పురాణాలతో ముడి వేసిన పద్ధతి
మైనస్ పాయింట్స్
కథనం
స్లో మూమెంట్స్
ఫైనల్ వర్దిక్ట్: షెర్లాక్‌హోమ్స్.. పక్కా లోకల్..!