తారాగణం: సత్యదేవ్, నందిత శ్వేత, ఆదిత్య మీనన్, బ్రహ్మాజీ, పృథ్వి, ధనరాజ్ & తదితరులు
సంగీతం: సునీల్ కశ్యప్
ఎడిటర్: నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ: దాశరధి శివేంద్ర
నిర్మాత: రమేష్.పి.పిళ్ళై
దర్శకత్వం: గోపీ గణేష్ పట్టాభి
రేటింగ్: 2.5/5
టెక్నాలజీ ఎలాగైతే ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటుందో... అలా సమాజంలో జరిగే మోసాల తీరు కూడా మారుతూ ఉంటుంది. రోజుకో కొత్త రకమైన మోసం వెలుగు చూస్తుంటుంది. వాటిని పత్రికల్లోనూ, టీవీల్లోనూ ఆసక్తిగా చూస్తూ చర్చించుకుంటుంటాం. అలాంటిది ఇప్పుడు కూడా ఎవరైనా నాలుగేళ్ల కిందటి మోసాల గురించి మాట్లాడటం మొదలుపెడితే... `అందులో ఏముంది? అసలు నిన్నేం జరిగింది తెలిస్తే ఆశ్చర్యపోతారు తెలుసా?` అంటూ మనకు తెలిసిన మరో కొత్త విషయం చెప్పడం ప్రారంభిస్తాం. `బ్లఫ్ మాస్టర్` చూశాక ప్రేక్షకుడికి కూడా అలాంటి అభిప్రాయమే కలుగుతుంది. ఈ సినిమాలో చూపించిన మోసాలు కొత్త కాదు, అందులో నీతీ తెలియంది కాదు.
కథ
ఉత్తమ్ కుమార్ (సత్యదేవ్) చిన్నప్పుడే డబ్బు విలువ తెలుసుకుంటాడు. అందుకోసం జనం ఎలా అడ్డదారులు తొక్కుతుంటారో కూడా అర్థం చేసుకుంటాడు. అందుకే తాను కూడా అదే మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. రకరకాల పేర్లు మార్చుకుంటూ... జనాల్ని ఎలా వీలైతే అలా మోసాలు చేస్తుంటాడు. తన మాటలతో మాయ చేసి కోట్లు దండుకుంటూ విలాసంగా బతుకుతుంటాడు. చట్టానికి కూడా దొరకడు. అలాంటి ఉత్తమ్ కుమార్ చావు బతుకుల్లో ఉన్నప్పుడు తన కిందనున్న మనుషులే మోసం చేస్తారు.
దాంతో అతని జీవితం చిక్కుల్లో పడుతుంది. ఇక తప్పు తెలుసుకొని, మోసాల బాటని వదిలిపెట్టి కొత్త జీవితం మొదలు పెట్టాలనుకుంటాడు. తనకి ఇష్టమైన అవని (నందితశ్వేత)ని పెళ్లి చేసుకొని దూరంగా బతుకుతుంటాడు. అయినా అతని పాత జీవితం అతన్ని వదిలిపెట్టకపోవగా, ప్రాణానికి ప్రాణమైన భార్య, పుట్టబోయే బిడ్డ ప్రాణాలకి కూడా ముప్పు ఏర్పడుతుంది. మరి వాళ్లని కాపాడుకొన్నాడా లేదా? డబ్బు గురించి చివరకి అతను తెలుసుకున్నదేమిటి? తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే.
నటీనటుల పనితీరు..
సత్యదేవ్ నటన చిత్రానికి ప్రధాన బలం. అయితే ఆయన ప్రతి సన్నివేశంలోనూ ఒకలాగే కనిపించాడు. భావోద్వేగాల విషయంలో ఆయన నటన పూర్తిస్థాయిలో మెప్పించదు. నందిత శ్వేత ఒక అమాయకపు యువతిగా కనిపిస్తుంది. ఆమె పాత్ర పరిధి తక్కువే. కానీ ఉన్నంతలో అందంగా కనిపించదు. ఆమెకి డబ్బింగ్ మాత్రం అతకలేదు. ఆదిత్యమీనన్ విలన్‌గా కనిపిస్తాడు. ధన్‌రాజ్, బ్రహ్మాజీ, పృథ్వీల నటన నవ్విస్తుంది. చైతన్యకృష్ణ ఓ కీలక పాత్రలో కనిపిస్తాడు.
విశ్లేషణ...
2014లో తమిళంలో విడుదలైన `శతురంగ వేట్టై` సినిమాకి రీమేక్‌గా రూపొందిన చిత్రమిది. అప్పటికి ఇందులో చూపించిన మోసాలు కొత్తే కావొచ్చు. ఇప్పుడింకా కొత్త రకమైన మోసాల తతంగాలు వినిపిస్తున్నాయి. కానీ ఈ సినిమా మాత్రం మనం ఇప్పటికే టీవీల్లోచూసేసిన, మనకు తెలిసిన మోసాల్నే చూపించింది. పోనీ అందులో ఏమైనా కొత్త అంశాల్ని మేళవించి కొత్తగా చెప్పారా అంటే అది కూడా లేదు. నిజానికి ఒకరిని బురిడీ కొట్టించే తతంగం వెనక బోలెడంత వ్యంగాన్ని, హాస్యాన్ని జోడించొచ్చు. కానీ దర్శకుడు ఆ ప్రయత్నం కొద్దివరకే చేశాడు.
పైగా మోసం చేసే ఎపిసోడ్లని సుదీర్ఘంగా చూపిస్తూ వాటితోనే కాలక్షేపం చేయించాడు. దాంతో కథలో పెద్దగా మలుపులు, ఆసక్తి కనిపించవు. కథానాయకుడు చిక్కుల్లో పడటం మొదలయ్యాక కథలో కాస్త వేగం అందుకుంటుంది. అక్కడ్నుంచి మాతృక తరహాలో కథ అనూహ్యమైన మలుపులు చోటు చేసుకొంటూ సినిమా, ఒక థ్రిల్లర్ సినిమా మారాల్సి ఉన్నా... అది జరగలేదు. దాంతో సినిమా ఆద్యంతం మోసాల ఎపిసోడ్లతో అలా మామూలుగా సాగుతున్నట్టు అనిపిస్తుంటుంది. మోసాల్ని చూపించే విధానంలో కూడా ప్రతి పాత్రని ఒక బకరాలా చూపించారు దర్శకుడు.
ఎవరైనా మరీ ఇంత గుడ్డిగా ఎలా నమ్మేస్తారనే ప్రశ్న ప్రేక్షకుడిలో కనిపిస్తుంది. మధ్యలో కొన్ని సంభాషణలు మాత్రం మెప్పిస్తాయంతే. ఇందులో సెంటిమెంట్ కూడా అతకలేదు. కథానాయకుడు మోసగాడని తెలిసి కూడా ఒక అమ్మాయి అతన్ని నమ్మి పెళ్లి చేసుకోవడం నమ్మశక్యంగా అనిపించదు. మొత్తం సినిమా మన నేటివిటీకి దూరంగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. పతాక సన్నివేశాల్లోనూ బలం లేదు.
సాంకేతిక వర్గం...
టెక్నికల్‌గా సినిమాకి యావరేజ్ మార్కులే పడతాయి. దాశరథి శివేంద్ర కెమెరా పనితనం, సునీల్ కశ్యప్ సంగీతం పర్వాలేదనిపిస్తుందంతే. ప్రొడక్షన్ వ్యాల్యూస్ అంతంత మాత్రమే. దర్శకుడి పనితనం మాటల వరకు మెప్పిస్తుందంతే. కథనం పరంగానూ, పాత్రల డిజైన్ పరంగానూ ఆయన పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు.
* ప్లస్ పాయింట్స్
- సత్యదేవ్ నటన
- తొలి సగం
* మైనస్ పాయింట్స్
- ద్వితీయార్థం
- ఎమోషన్ లేకపోవడం
పైనల్ వర్డిక్ట్: బ్లఫ్ మాస్టర్.. స్టఫ్ తక్కువే
రివ్యూ రాసింది శ్రీ.