బళ్లు ఓడలు అవ్వడం.. ఓడలు బళ్లు అవ్వడం టాలీవుడ్‌లో మామూలే. అంచనాలు ఆకాశాన్ని తాకిన చిత్రాలు... నేలమట్టం అవుతాయి. ఏమాత్రం ఆశలు లేని సినిమాలు సంచలనాలు సృష్టిస్తుంటాయి. ఒక్క శుక్రవారం చాలు.. టాలీవుడ్‌లో జాతకాలు మారిపోవడానికి. 2018లోనూ... అభిమానుల ఆశల్ని నీరుగార్చిన సినిమాలు కొన్నొచ్చాయి. వాటిలో.. ప్రధమస్థానం, 2018 ఫ్లాపుల్లో ప్రధమస్థానం ఇవ్వాలంటే మాత్రం... 'అజ్ఞాతవాసి' ని చూపించొ్చ్చు.
పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఇది. అంతకు ముందు వీరిద్దరి నుంచి జల్సా, అత్తారింటికి దారేది లాంటి సూపర్ డూపర్ హిట్లు వచ్చాయి. అత్తారింటికి దారేది అయితే... అప్పటి రికార్డులన్నీ తుడిచిపెట్టేసింది. అందుకే ఈ కాంబోపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మరోసారి వీరిద్దరూ హ్యాట్రిక్ సృష్టించడం ఖాయం అనుకున్నారు. తారాబలం, టెక్నికల్ టీమ్.. ఏ రూపంలో చూసినా ఈ సినిమా స్ట్రాంగ్‌గా ఉంది.
పవన్ క్రేజ్ కూడా మామూలుగా లేదు. తను ఓ మాట మాట్లాడినా సంచలనం అయిపోతున్న రోజులవి. రాజకీయాల్లో పూర్తిగా దిగే ముందు చేసిన సినిమా. అందుకే... ఈ సినిమా హిట్టవ్వడం పవన్‌కి చాలా అవసరం. బయ్యర్లు కూడా భారీ రేట్లు పెట్టి ఈ సినిమాని కొనేశారు. అంతకు ముందు ఏ సినిమా రిలీజ్ అవ్వని స్థాయిలో, అత్యధిక థియేటర్లలో ఈసినిమాని విడుదల చేశారు.
కానీ.. సినిమా మాత్రం బాక్సాఫీసు దగ్గర బొక్క బోర్లా పడింది. కథ, కథనాలు, త్రివిక్రమ్ పంచ్‌లూ ఏవీ పేలలేదు. ద్వితీయార్థం అయితే క్లూ లెస్‌గా సాగింది. త్రివిక్రమ్ నుంచి ఇలాంటి సినిమాని ఊహించరు. ఆ స్థాయిలో టేకింగ్ ఉండేసరికి... పవన్ వీరాభిమానులు సైతం నీరసపడిపోయారు. ఈ సినిమాని చుట్టేశారని, క్రేజ్ చూపించి ఎక్కువ రేట్లకు అమ్ముకున్నారన్న విమర్శలు ఎక్కువయ్యాయి.
విచిత్రం ఏమిటంటే.. ఇంత ఫ్లాపులోనూ ఈ సినిమా రూ.60 కోట్ల వరకూ వసూలు చేసింది. మిగిలిన నష్టాన్ని పవన్, త్రివిక్రమ్ కలసి భర్తీ చేశారు. అజ్ఞాతవాసి ఫ్లాపు నుంచి తేరుకోవడానికి త్రివిక్రమ్ కి చాలా రోజులే పట్టింది. పవన్ అభిమానులు ఇప్పటికీ ఆ షాక్‌లోనే ఉన్నారు.
రీక్యాప్ 2018, ఐక్లిక్ మూవీస్ (iQlikmovies)