తెలుగు సినీ పరిశ్రమలో శ్రీరెడ్డి రేపిన కలకలం, ఆ తర్వాత ఊపందుకున్న కాస్టింగ్ కౌచ్ నినాదం, బాలీవుడ్‌లో తనూశ్రీ దత్తా రేపిన 'మీ టూ' ప్రకంపనలు ఇవన్నీ సినీ పరిశ్రమకు సంబంధించి 2018లో సంచలనం సృష్టించాయి. 'మణికర్ణిక' సినిమా వివాదం, ఇంకో సినిమా ఘన విజయం ఇలాంటి వాటి కంటే మీ టూ గురించే ఎక్కువ చర్చించుకున్నాం.
నానా పటేకర్‌లాంటి నటుడు మీ టూ దెబ్బకు నటనకు దూరమవ్వాల్సి వచ్చింది. మీ టూ ఆరోపణలు వచ్చిన వారితో పని చేసేది లేదని అక్షయ్ కుమార్‌లాంటి స్టార్స్ తీర్మానించుకున్నారు. ఓ కేంద్రమంత్రి తన పదవిని కోల్పోయారు. సౌత్‌లో తెలుగు సినీ పరిశ్రమ నుండి మీ టూ వివాదాలు కనిపించలేదు. ఒక్క శ్రీరెడ్డి రచ్చ తప్ప. తమిళనాడులో మాత్రం గాయని చిన్మయి పెను ప్రకంపనలే సృష్టించింది.
కన్నడ హీరోయిన్ శృతి హరిహరన్ తమిళ హీరో అర్జున్‌పై మీ టూ ఆరోపణలు చేసింది. ఆ కేసు అర్జున్‌ని ఇంకా వెంటాడుతూనే ఉంది. అయితే ఈ మధ్యకాలంలో మీ టూ గురించిన చర్చ పెద్దగా జరగట్లేదు. మీ టూ ఇంత పాపులర్ అవడానికి కారణమైన తనూశ్రీదత్తా కూడా విదేశాలకు చెక్కేసింది. కొత్త ఏడాదిలో మళ్లీ మీ టూ రచ్చ ఊపిరి పోసుకుంటుందా.? లేదంటే ఈ గొడవ కాలగర్భంలో కలిసిపోయినట్లేనా.?