నటీనటులు: శ్రీ విష్ణు, నివేదా థామస్, సత్యదేవ్, నివేతా పెతురాజ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తదితరులు
దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాతలు: విజయ్ కుమార్ మన్యం
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫర్: సాయి శ్రీరామ్
విడుదల తేదీ: జూన్ 28, 2019
రేటింగ్: 3/5
క్రైమ్ కామెడీలు అనుకున్నంత ఈజీ కాదు. క్రైమ్‌లో కామెడీ, కామెడీలో క్రైమ్ రెండింటినీ మిక్స్ చేయడం తెలిసుండాలి. రెండింటిలో ఏది తగ్గినా - ఆ మేళవింపుకు న్యాయం జరగదు. ఈమధ్య కాలంలో క్రైమ్ కామెడీలు చాలా వచ్చాయి. ఈ మేళవింపు సరిగా లేకపోవడం వల్లే తేలిపోయాయి. ఇప్పుడొచ్చిన `బ్రోచేవారెవరురా` కూడా క్రైమ్ కామెడీ సినిమానే. మరి ఈసారి ఏం జరిగింది? ఈ సినిమాలో ఉన్న కామెడీ ఎంత? క్రైమ్ ఎంత?
* కథ
రాహుల్, రాంకీ, రాంబో (శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ) ముగ్గురు మంచి స్నేహితులు. ఇంటర్ పల్టీల మీద పల్టీలు కొడుతూ... ఒకే క్లాసులో సెటిలైపోతారు. అదే కాలేజీలోకి అడుగుపెడుతుంది మిత్ర (నివేదా థామస్). తను ప్రిన్సిపాల్ కూతురు. తండ్రంటే భయం. ఆ తండ్రి క్రమశిక్షణ పేరుతో విసిగించేస్తుంటాడు. దాంతో ఇల్లు వదిలి పారిపోదామనుకుంటుంది మిత్ర.
అందుకోసం ఈ మిత్ర త్రయం సాయం చేద్దామనుకుంటారు. డబ్బుల కోసం ఓ కిడ్నాప్ డ్రామా ఆడతారు. మిత్రని తామే కిడ్నాప్ చేసి, ప్రిన్సిపాల్ నుంచి డబ్బులు లాగాలనుకుంటారు. అక్కడి నుంచే... ఈ నలుగురికీ కష్టాలు మొదలవుతాయి. ఇంతకీ ఈ కిడ్నాప్ డ్రామా సక్సెస్ అయ్యిందా? లేదా? ఆ తరవాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అనేదే సినిమా కథ.
* నటీనటులు
రాహుల్‌గా శ్రీవిష్ఱు నటన ఆకట్టుకుంటుంది. ఇదివరకటికంటే హుషారుగా నటించాడు. నవ్వించాడు. దర్శకుడు అవ్వాలని కలలుకనే కుర్రాడిగా సత్య నటన కూడా బావుంది. హీరో స్నేహితులుగా నటించిన రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఎప్పట్లా కామెడీ పంచారు. ఈ సినిమాలో నవ్వులు పంచే బాధ్యత వీరిద్దరిదే. నివేదా మరోసారి ఆకట్టుకునే అభినయం ప్రదర్శించింది. నివేదా పేతురాజ్ అందంగా, హుందాగా కనిపించింది. హర్షవర్థన్ కనిపించేది రెండు మూడు సన్నివేశాల్లో అయినా - నవ్వించగలిగాడు.
* సాంకేతిక వర్గం
వివేక్ ఆత్రేయ రెండో చిత్రమిది. ఎక్కడా తడబడకుండా ఈ కథని చెప్పగలిగాడు. తన స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. సంభాషణలు సహజంగా ఉన్నాయి. నేపథ్య సంగీతం కెమెరా పనితనం ఆకట్టుకుంటాయి. ద్వితీయార్థంలో ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్‌గా ఉండాల్సింది.
* విశ్లేషణ
చిత్రమే చలనము... చలనమే చిత్రము అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. అలా ఎందుకు పెట్టాడా? అనే అనుమానం వేస్తుంది. ఈ సినిమా మొదలైతే.. అది తేలిపోతుంది. ఎందుకంటే... ఇది సినిమాలో సినిమా. ఓ దర్శకుడు కథానాయికకు ఓ సినిమా కథ చెబుతుంటే.. జరిగే కథ. దర్శకుడి కథకీ, సినిమా కథకీ లింకు పెట్టిన పద్ధతి బాగుంది. ఓ రకంగా ఇది స్క్రీన్ ప్లే ప్రధానమైన కథ. పకడ్బందీగా స్క్రీన్ ప్లే రాసుకుంటేనే ఇలాంటి కథలు పండుతాయి. వివేక్ ఆత్రేయ రాసుకున్న కథనం ఈ సినిమాకి ప్రధాన బలంగా మారింది.
మిత్ర త్రయం చిందించే నవ్వులతో ఈ సినిమా సరదాగా హాయిగా మొదలవుతుంది. కాలేజీ సన్నివేశాలు, పేపర్ దొంగతనం చేయాలనుకోవడం బాగా నవ్విస్తాయి. కిడ్నాప్ డ్రామా, ప్రిన్సిపాల్ ని బెదిరించడం బాగా పండాయి. తొలి సగంలో ఎలాంటి కంప్లైంట్లూ లేవు. ఇంట్రవెల్ బ్యాంగ్ కూడా ఆకట్టుకుంటుంది. ద్వితీయార్థంలో కథ సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కిడ్నాప్ డ్రామా కాస్త నిజం అయిపోతుంది. మిత్రత్రయం అనవసరంగా ఊబిలో కూరుకుపోతుంటారు. మరో పక్క మిత్ర మాయం అవుతుంది.
ఈ కథలకు ఎలాంటి ముగింపు పలికారన్నది ఆసక్తి కలిగిస్తుంది. సెల్ ఫోన్ మాయం చేసి, కథని అరగంట అక్కడక్కడేతి ప్పారు. దాని బదులుగా మరో ఎత్తుగడ ఎంచుకుంటే బాగుండేది. కథని లింకులు వేసుకుంటూ చెప్పడం, ప్రతీ సన్నివేశానికీ ఓ అర్థం ఇవ్వాలనుకోవడం బాగుంది.
అయితే.. అందుకోసం కథని కాస్త సాగదీశారనిపిస్తుంది. తొలి సగంతో పోలిస్తే ద్వితీయార్థంలో కామెడీకి స్కోప్ చాలా తక్కువ. అదీ అర్థం చేసుకోదగినదే. అయితే క్లైమాక్స్‌ని ఇంకాస్త బాగా రాసుకుంటే.. ఇంకాస్త మంచి ఫలితం వచ్చి ఉండేది. కథలన్నీ సుఖాంతం అయినా - రాహుల్ కథని అలా వదిలేశారేంటి? అనిపిస్తుంది.
* ప్లస్ పాయింట్స్
+స్క్రీన్ ప్లే
+నటీనటులు
+నేపథ్య సంగీతం
* మైనస్ పాయింట్స్
- క్లైమాక్స్
* ఫైనల్ వర్డిక్ట్: థ్రిల్ + ఫన్
- రివ్యూ రాసింది శ్రీ.