నటీనటులు: ఆర్య, ఐశ్వర్య లక్ష్మి, సిమ్రాన్, కావ్య శెట్టి మరియు ఇతరులు
దర్శకత్వం : శక్తి సౌందర్ రాజన్
నిర్మాతలు: ఎస్ ఎన్ ఎస్ మూవీ ప్రొడక్షన్ & షో పీపుల్
సంగీత దర్శకుడు: డి ఇమ్మాన్
సినిమాటోగ్రఫీ: ఎస్ యువ
ఎడిటర్: ప్రదీప్ ఇ రాఘవ
రేటింగ్: 2.25/5
ఆర్య తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడే. తన డబ్బింగ్ సినిమాలు కొన్ని తెలుగులో బాగా ఆడాయి. వరుడు సినిమాలో విలన్‌గా నటించాడు. సైజ్ జీరోలోనూ కనిపించాడు. తన కథల ఎంపిక బాగుంటుంది. ఎవరూ టచ్ చేయని పాయింట్లతో సినిమా చేస్తుంటాడు. తన నుంచి వచ్చిన సినిమానే `కెప్టెన్`. ఈ ట్రైలర్ సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఎందుకంటే ఇదో వింత జీవి నేపథ్యంలో సాగే కథ. ఇలాంటి కథలు హాలీవుడ్‌లో తీశారు కానీ, మన దగ్గర ఇలాంటి ప్రయత్నాలు చేయలేదు. మరి... `కెప్టెన్` సంగతేంటి? ఆర్య ప్రయోగం ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందించింది?
* కథ
తూర్పు ఈశాన్య అడవుల్లో ఉన్న సెక్టార్ 43...లో ఎవరు వెళ్లినా ప్రాణాలతో తిరిగిరారు. ఆ మిస్టరీ ఛేదించడానికి కెప్టెన్ విజయ్ (ఆర్య) తనకు అత్యంత నమ్మకమైన తన టీమ్ తో కలిసి సెక్టార్ 43లో అడుగుపెడతాడు. అయితే అనూహ్యంగా.. తన టీమ్ లోని కార్తి.. మిగిలిన వాళ్లపై కాల్పులు జరిపి, తాను ఆత్మహత్య చేసుకుంటాడు. దాంతో కెప్టెన్ విజయ్ అండ్ టీమ్ దిగ్భ్రాంతికి గురవుతుంది. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కాదు. ఏడాది తరవాత... మళ్లీ అదే అడవులో మిస్టరీ ఏంటో తెలుసుకోవడానికి వెళ్తుంది విజయ్ టీమ్. అక్కడో వింత జంతువు ఉందన్న సంగతి అర్థమవుతుంది. ఆ జంతువు కథేంటి? దాన్ని కెప్టెన్ ఎలా అంతం చేశాడు? అనేది తెరపై చూడాలి.
* విశ్లేషణ
హాలీవుడ్ లో రూపొందిన `ప్రీడియేటర్` లాంటి కథ ఇది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొనే దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ ఈ కథ తయారు చేసుకొన్నాడు. సౌత్ ఇండియన్ స్క్రీన్‌పైనే కాదు, ఇండియన్ స్క్రీన్ పైనా ఇలాంటి జోనర్ లో సినిమా రాలేదు. కాబట్టి.. ఈ విషయంలో రూపకర్తల ధైర్యా్నని మెచ్చుకోవాల్సిందే. కాకపోతే.. ఐడియా ఒక్కటే సరిపోదు. దాని చుట్టూ బలమైన సన్నివేశాలు, ఆసక్తికరమైన అంశాలూ ఉండాలి.
`కెప్టెన్`లో అవి పూర్తిగా లోపించాయి. ఓ వింత జీవి సినిమా ఇది.. అని థియేటర్లో అడుగు పెడుతున్నప్పుడే ఆడియన్ కి తెలుసు. అలాంటప్పుడు ఆ జీవి ఎప్పుడొస్తుందా? అని ఆసక్తిగా ఎదురు చూడడం మొదలెడతాడు. దానికి ముందు ఏం చెప్పినా ప్రేక్షకుడు వినిపించుకోడు. ఈ సినిమాలో వింత జీవి ఎంటర్ అవ్వడానికి చాలా టైమ్ పట్టేస్తుంది. వింత జీవి ఇంట్రో కూడా ఆసక్తికరంగా లేదు. సైన్యంలో బలమైన ఓ టీమ్...దానికి ఓ కెప్టెన్, తన టీమ్ ని తన కుటుంబంలా భావించడం, వాళ్ల మధ్య అనుబంధం.. ఇలా రొటీన్ స్టఫ్‌తో సినిమా సాగుతుంది. మధ్యలో లవ్ స్టోరీ కూడా అనవసరమైన ట్రాకే.
సెక్టార్ 42కి వెళ్లిన ఎవరైనా సరే చనిపోతారు అని బలంగా చెప్పిన దర్శకుడు.. ఆ శవాల్ని తీసుకొచ్చినవాళ్లు మాత్రం ఎలా బతికారో చెప్పలేదు. ఇదొర్కటే కాదు.. చాలా విషయాల్లో లాజిక్ మిస్సయ్యింది. పతాక సన్నివేశాలకు ముందు కాస్త థ్రిల్ కలుగుతుంది. వింత జీవులకు కింగ్ లాంటి జీవి మరోటి ఉందని చెప్పి, దాని కోసం ఎదురు చూసేలా చేశాడు. అయితే... ఆ కింగ్ ని చూపించడంలో, ఆ కింగ్ గ్రాఫిక్స్ ని డిజైన్ చేయడంలో టీమ్ పూర్తిగా విఫలమైంది. విజువల్ ఎఫెక్ట్స్ ఎంత బాగుంటే ఇలాంటి కథల్లో అంతగా కనెక్ట్ అవుతారు. అదే మిస్సయినప్పుడు కథతో కనెక్ట్ అవ్వడం చాలా కష్టం. అందుకే పతాక సన్నివేశాలు బాగానే ఉన్నా, గ్రాఫిక్స్ తేలిపోవడంతో ఇంపాక్ట్ గా అనిపించలేదు.
* నటీనటులు
ఆర్య ఫిట్ గా ఉన్నాడు. కెప్టెన్ పాత్రకు పర్‌ఫెక్ట్. తను తన పనిని చాలా సిన్సియర్‌గా చేశాడు. ఆర్య టీమ్ లోని వాళ్లంతా బాగానే చేశారు. హీరోయిన్ పాత్రకు పెద్ద స్కోప్ లేదు. కేవలం ఓ పాటలోనూ, రెండు సన్నివేశాల్లోనూ కనిపించింది అంతే.
ఒకప్పటి అందాల నటి సిమ్రాన్ ఇప్పుడు మరీ వయసుమళ్లిన పాత్రలో కనిపించడం ఆమె అభిమానులకు రుచించదు. ఆ పాత్రని కూడా సరిగా డిజైన్ చేయలేదనిపిస్తుంది.
* సాంకేతిక వర్గం
గ్రాఫిక్స్ విషయంలో ఈ సినిమా తేలిపోయింది. చాలా కీలమైన విషయంలో చేతులు ఎత్తేయడం `కెప్టెన్`కు పెద్ద దెబ్బ. నిజానికి ఈ సినిమాకి మరింత బడ్జెట్ ఉంటే అవుట్‌పుట్ మారేదేమో..? పాటలకు అస్సలు స్కోప్ లేదు. ఓ పాటని ఇరికించినా.. అది అతకలేదు.
స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు కొన్ని పొరపాట్లు చేశాడు. కొన్ని చోట్ల లాజిక్కుల్ని వదిలేశాడు. ఓ కొత్త జానర్ ని దక్షిణాదికి పరిచయం చేయాలన్న తపన మాత్రం మెచ్చుకోవాల్సిందే.
* ప్లస్ పాయింట్స్
ఆర్య
కథా నేపథ్యం
* మైనస్ పాయింట్స్
గ్రాఫిక్స్
బలహీనమైన స్క్రీన్ ప్లే
లాజిక్కులు మిస్
* ఫైనల్ వర్డిక్ట్: కెప్టెన్.. తేలిపోయాడు.