కొరియన్ సినిమా 'మిడ్‌నైట్ రన్నర్స్'ని తెలుగులో 'శాకిని డాకిని' పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకుడు. అయితే... ఈ సినిమా ప్రమోషన్లలో సుధీర్ వర్మ ఎక్కడా కనిపించడం లేదు. ఈ సినిమా టీమ్ తో సుధీర్ వర్మకు చెడిందని, అందుకే టచ్‌లో లేకుండా పోయాడని సమాచారం. ఈ సినిమాలోని కొన్ని సీన్లని దర్శకుడికి ఇష్టం లేకపోయినా.. నిర్మాతలు మరో దర్శకుడితో రీషూట్లు చేయించారని టాక్ నడుస్తోంది. 'ఓయ్' చిత్రాన్ని అందించిన ఆనంద్ రంగా `డాకిని శానికి` సినిమాకి రెండో దర్శకుడిగా పని చేశాడట. ఈ విషయాన్ని మీడియా ముందు నిర్మాత సునీత సైతం ఒప్పుకొన్నారు.
''ఈ సినిమా కోసం సుధీర్ వర్మ దాదాపు రెండేళ్లు కష్టపడ్డారు. ఆ తరవాత ఆయన వేరే సినిమా పనుల్లో బిజీగా అయిపోయారు. అందుకే ఆయన్ని డిస్ట్రబ్ చేయదలచుకోలేదు. కొంత ప్యాచ్ వర్క్‌ని వేరే దర్శకుడితో పూర్తి చేశాం. దానికి సుధీర్ కూడా ఒప్పుకొన్నారు'' అంటూ క్లారిటీ ఇచ్చారు. సో.. ఈ ఇద్దరు హీరోయిన్ల సినిమాకి ఇద్దరు దర్శకులు పనిచేశారన్నది నిజమే అన్నమాట. ఈనెల 16న `శాకిని - డానికి` రిలీజ్‌కు రెడీ అయ్యింది.