తారాగణం: పూజా గాంధీ, మకరంద్ దేష్ పాండే, రవి కాలే, పి.రవిశంకర్, శృతిహాసన్, సంజన, కరి సుబ్బు, తబ్లా నాని, పెట్రోల్ ప్రసన్న, అవినాష్ తదితరులు
సంగీతం: అర్జున్ జన్యా
సినిమాటోగ్రఫీ: వెంకట్ ప్రసాద్
దర్శకత్వం: శ్రీనివాస్‌రాజు
నిర్మాత: వెంకట్
నిర్మాణం: వెంకట్ మూవీస్
యావరేజ్ యూజర్ రేటింగ్: 2.5/5
కథా కమామిషు...
'దండుపాళ్యం' అనేది కేవలం ఓ సినిమా కాదు. వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన సినిమాగా, క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రాచుర్యం పొందింది. అత్యంత కిరాతకంగా హత్యలు చేసే ముఠా పోలీసులకు చిక్కుతుంది. ఆ తర్వాత ఏమవుతుందన్నది 'దండుపాళ్యం-2' సినిమా కథ. ఐదేళ్ళ తర్వాత జైలు శిక్ష పడుతుంది దండుపాళ్యం గ్యాంగ్‌కి. 80 కేసుల్లో నేరం రుజువైతే, 12 కేసుల్లో మాత్రమే సాక్ష్యాలుంటాయి, అవీ బలమైనవి కావు. దాంతో దండుపాళ్యం గ్యాంగ్ తరఫున ఓ జర్నలిస్ట్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడం ఈ రెండో పార్ట్‌లో చూడొచ్చు. శిక్ష పడిందా? లేదా? ఇంకో సీక్వెల్‌కి దర్శకుడు ఆస్కారమిచ్చాడా? అనే అంశాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటులెలా చేశారు?
'దండుపాళ్యం' బీభత్సమైన క్రైమ్ థ్రిల్లర్. అత్యంత క్రూరమైన కథాంశమిది. కానీ మొదటి పార్ట్ హిట్టయ్యింది. దానిక్కారణం, నటీనటులెవరూ నటించలేదు, తమ తమ పాత్రల్లో జీవించేశారు. మొదటి పార్ట్‌కి కొనసాగింపు అయిన ఈ సినిమాలోనూ దండుపాళ్యం టీమ్ నటించి, భయపెట్టింది. పోలీసుల చిత్ర హింసలను దండుపాళ్యం టీమ్ తట్టుకునే సన్నివేశాలు ఆలోచింపజేస్తాయి. అమాయకుల్లా కనిపిస్తారు, అత్యంత క్రూరమైన నేరస్వభావమూ ప్రదర్శిస్తారు.
ఒకర్ని మించి ఒకరు తమ పాత్రల్లో జీవించేయడం 'దండుపాళ్యం' ప్రత్యేకత. పూజా గాంధీ, రవి కాలే, మకరంద్ దేశ్ పాండే, సంజన ఇలా ఎవరికి వారే హైలైట్ అనిపిస్తారు. నటన పరంగా ఎవరికీ వంక పెట్టలేం. వారి నుంచి దర్శకుడు అంత మంచి ఔట్‌పుట్ రాబట్టుకోవడం గొప్ప విషయం. ఎక్కడా ఓవర్ ది బోర్డ్ అనిపించదు.
విశ్లేషణ...
మొదటి పార్ట్‌తో పోల్చితే రెండో పార్ట్ కొంచెం నెమ్మదించినట్లు అనిపిస్తుంది. మూడో పార్ట్ కోసం మిగిల్చిన లీడ్ అంతగా ఆకట్టుకోదు. ఈ రెండూ మినహాయిస్తే నటీనటుల పరంగా, దర్శకుడి ఆలోచనల పరంగా సినిమా ఇంకో లెవల్ అన్నట్లుగానే ఉంటుంది. అయితే ఇలాంటి సినిమాలు మన తెలుగు ఆడియన్స్‌కి అంతగా నచ్చే అవకాశం లేదు. ఇలాంటి సినిమాల్నే ఇష్టపడే కొందరికి మాత్రం మంచి ఫీస్ట్ అనిపిస్తుంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవడం, గ్లామర్ తక్కువగా ఉండటం కూడా ఇబ్బందికరమే.
సాంకేతిక వర్గం పనితీరు...
సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ట్, కాస్ట్యూమ్స్ ఇలా దేనికదే అన్నట్లుగా సాంకేతిక విభాగం పూర్తి సహకారం అందించింది ఈ చిత్రానికి. క్రైమ్ డ్రామా రక్తి కట్టడానికి ఏమేం కావాలో, అన్నీ ఉన్నాయి. డ్రామా అనిపించదెక్కడా, అంతా వాస్తవమే అనిపిస్తుంది. అంతలా నటీనటులు, సాంకేతిక నిపుణులు పోటీ పడ్డారు.
ఫైనల్ వర్డ్..
'దండుపాళ్యం' మళ్ళీ భయపెట్టింది
రివ్యూ బై శేఖర్