నటీనటులు : మేఘ ఆకాష్, ఆడిత్, అర్జున్ సోమయాజులు తదితరులు
దర్శకత్వం : సుశాంత్ రెడ్డి
నిర్మాతలు : అర్జున్ దాస్యన్
సంగీతం : గౌరా హరి
సినిమాటోగ్రఫర్ : ఐ ఆండ్రూ
ఎడిటర్: ప్రవీణ్ పూడి
రేటింగ్: 2.5/5
ప్రేమకథకు కావల్సింది కొత్తదనం కాదు. అనుభూతి ముఖ్యం. అందుకే రోజుకో ప్రేమకథ పుడుతూ ఉంటుంది. కొన్నిసార్లు రొటీన్ కథలే.. రికార్డులు సృష్టిస్తాయి. కొత్తగా అనిపిస్తుంటాయి. కన్నడలో సూపర్ హిట్ అయిన `దియా` అలాంటి కథే. ఇదో ముక్కోణపు ప్రేమకథ. ఇలాంటి కథలు ఇది వరకు చాలా వచ్చాయి.కానీ ముందే చెప్పినట్టు.. ఆ అనుభూతి పండింది. ఆ కథ.. హృదయాల్ని హత్తుకుంది. అందుకే ఇప్పుడు ఆ సినిమాని తెలుగులో `డియర్ మేఘా`గా రీమేక్ చేశారు. మేఘా ఆకాష్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ఈరోజు (శుక్రవారం) విడుదలైంది.
* కథ
మేఘా (మేఘా ఆకాష్) తన కాలేజీలో చదివే అర్జున్ (అర్జున్ సోమయాజుల)ని గాఢంగా ప్రేమిస్తుంది. మూగగా ఆరాధిస్తుంది. తన ప్రేమ విషయం మాత్రం మనసులోనే దాచుకుంటుంది. అర్జున్ ఎదురు పడి చెప్పలేదు. సడన్ గా ఓ రోజు.. అర్జున్ సింగపూర్ వెళ్లిపోతాడు. తన జ్ఞాపకాలతో సతమతమవుతుంది మేఘా. ఆ తరవాత.. మేఘ కుటుంబం ముంబైకి షిఫ్ట్ అయిపోతారు. అయితే. సడన్‌గా తన అపార్ట్మెంట్ లోనే అర్జున్ కనిపిస్తాడు. ఇద్దరివీ ఎదురెదురు ఫ్లాట్సే. మూడేళ్ల తరవాత అర్జున్ కనిపించాడన్న ఆనందంలో మునిగిపోతుంది మేఘ. అయితే... అది చాలదన్నట్టు అర్జున్ కూడా మేఘకు ఐలవ్ యూ చెబుతాడు. అయితే ఓ ప్రమాదంలో అర్జున్ చనిపోతాడు. ఆ జ్ఞాపకాలు భరించలేక... మేఘ హైదరాబాద్ వచ్చేస్తుంది. ఇక్కడ... అభి (అరుణ్ అదిత్) పరిచయం అవుతాడు. మరి.. ఈ పరిచయం మేఘ జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? ఆ తరవాత ఏమైంది? అనేదే డియర్ మేఘ కథ.
* విశ్లేషణ
ఇలాంటి ముక్కోణపు ప్రేమకథలు గతంలోనూ చూశాం. ఇదీ అలాంటి కథే. కాకపోతే.. కన్నడలో ఈ సినిమాని చాలా హృద్యంగా తెరకెక్కించారు. అక్కడ నటించినవాళ్లంతా కొత్తవాళ్లే. కాబట్టి ఆ ఎమోషన్స్ బాగా పండాయి. అదే గాఢతని, ఎమోషన్ నీ తెలుగులోకి తీసుకురావడానికి దర్శకుడు తనవంతు కృషి చేశాడు. కానీ సఫలీకృతం కాలేదు. సినిమా చాలా స్లో ఫేజ్ తో మొదలవుతుంది.
మధ్యలో అయినా.. వేగం పుంజుకుంటుందేమో అని ప్రేక్షకుడు భావిస్తాడు. కానీ అది జరగదు. ఎంత స్లోగా సినిమా మొదలైందో.. అంతే స్లోగా సినిమా ముగుస్తుంది. నిజానికి ఈ కథ ఇలానే చెప్పాలి. కానీ అలా చెబితే తెలుగు ప్రేక్షకులకు నచ్చదు.అలాగని కథతో ప్రయోగాలు చేయలేరు. అందుకే డియర్ మేఘ రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. అటు మాతృకలోని అనుభూతిని పంచలేక, ఇటు తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించలేక మధ్యలోనే ఊగిసలాడింది.
మేఘ - అర్జున్ ప్రేమకథ చాలా నెమ్మదిగా సాగుతుంది. ఆ కథలో మలుపులేం ఉండవు. మూడేళ్ల తరవాత.. మేఘని అర్జున్ కలవడం, తన మనసులోని ప్రేమని వ్యక్త పరచడం మాత్రమే ఆకథలోని ఫ్రెష్ నెస్. మేఘ - ఆదిల ఎపిసోడ్లు కాస్త హుషారుగా సాగుతాయి. కానీ.. అది కూడా మెల్లమెల్లగా బోర్ కొట్టించడం మొదలవుతుంది. ఇదో ఆర్ట్ సినిమా అన్న ఫీలింగ్ లోనే దర్శకుడు ఉండిపోయాడు. నటీనటులకూ అలాంటి పాత్రలే అప్పగించాడు.
కథనం కాస్త స్పీడయినా ఆర్ట్ సినిమా అన్న ఫీలింగ్ పోతుందేమో అని భయపడ్డాడు. దాంతో... సినిమా అంతా స్లో మోషన్‌లో సాగుతుంది. చనిపోయిన అర్జున్ తిరిగొస్తే... అది ప్రేక్షకులకు షాకింగ్ ఎలిమెంట్ గా ఉండాలి. ఇప్పుడు మేఘ ఏం చేస్తుంది? ఎవరిని ప్రేమిస్తుంది? అంటూ ప్రేక్షకుడు సందిగ్థంలోకి వెళ్లిపోవాలి. ఇవేం జరగవు. అసలు అర్జున్ పాత్ర చనిపోయినప్పుడే సింపతీ క్రియేట్ కాలేదు. దాంతో.. `దియా`లోని హృద్యమైన భావన ఇక్కడ కనిపించకుండా పోయింది.
క్లైమాక్స్ ఒక రకంగా భారమైనదే. కన్నడ ప్రేక్షకులు ఈ క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నాడు. కానీ తెలుగులో మాత్రం అంపూర్తిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి భారమైన క్లైమాక్స్‌లు తెలుగు ప్రేక్షకులు భరించలేరు.
* నటీనటులు
మేఘా ఆకాష్‌కి ఇదే తొలి పూర్తి స్థాయి పాత్ర. తన వరకూ బాగా చేసింది. తన అందమైన మొహం, ఆ మొహంలో కనిపించే అమాయకత్వం ఆ పాత్రని మరింత దగ్గర చేశాయి. గుండెలో భరించలేనంత విషాదాన్ని, వేదనని తనకళ్లలో బాగా పలికించింది. అదిత్ అరుణ్ కి మంచి మార్కులు పడతాయి. ఓ స్వచ్ఛమైన ప్రేమికుడిగా మెప్పించాడు. అర్జున్ సోమయాజుల మాత్రమే రాంగ్ ఛాయిస్ అనిపిస్తుంది. తన ఎక్స్ ప్రెషన్స్ సరిగా పలకలేదు.
* సాంకేతిక వర్గం
పాటలు బాగున్నాయి. కాకపోతే.. సినిమానే స్లో అనుకుంటే, పాటలు మరింత స్లోగా వినిపిస్తాయి. మాటలు అక్కడక్కడ మెరిశాయి. జీవితం గురించి హీరోతో చెప్పించిన ఫిలాసఫీ మాత్రం పాత చింతకాయ పచ్చడి లా అనిపిస్తుంది. తల్లీ కొడుకుల మధ్య ఎమోషన్ బాండింగ్ బాగా చూపించారు. దియాని కట్ కాపీ పేస్ట్ చేశాడు దర్శకుడు. కానీ ఆ ఎమోషన్ ని మాత్రం క్యారీ చేయలేకపోయాడు.
* ప్లస్ పాయింట్స్
ప్రేమలోని స్వచ్ఛత
* మైనస్ పాయింట్స్
స్లో నేరేషన్
* ఫైనల్ వర్డిక్ట్: మేఘం కరిగిపోయింది.