నటీనటులు: వెంకటేశ్, మీన, నదియా, నరేశ్, సంపత్ రాజ్, ఏస్తర్ అనిల్ తదితరులు
దర్శకత్వం : జీతూ జోసెఫ్
నిర్మాతలు: సురేశ్ బాబు, అంటోనీ పెరంబవూర్, రాజ్‌కుమార్ సేతుపతి
సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: సతీష్ కురూప్
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేశ్
రేటింగ్: 3/5
మలయాళంలో తెరకెక్కిన దృశ్యమ్... సంచలనాలు సృష్టించింది. స్క్రీన్ ప్లే పరంగా ఓ పాఠంగా నిలిచింది. ఆ సినిమాలో ట్విస్టులు, టర్న్‌లో ఎంత ఆకట్టుకున్నాయో, ఫ్యామిలీ ఎమోషన్స్‌కూడా అంతగా పండాయి. అందుకే ఏ భాషలో తెరకెక్కినా, మంచి విజయాన్ని అందుకుంది. దృశ్యమ్ ని తెలుగులో తీశారు. మంచి ఫలితం వచ్చింది. దృశ్యమ్ కి సీక్వెల్ గా రూపొందిన దృశ్యమ్ 2... కూడా ఘన విజయాన్ని అందుకుంది. దాంతో.. తెలుగులోనూ సీక్వెల్ వచ్చేసింది. ఈరోజు అమేజాన్ ప్రైమ్ ద్వారా నేరుగా విడుదలైన.. ఈ సీక్వెల్ ఎలా వుంది? ఇందులో ఆకట్టుకునే అంశాలేంటి?
* కథ
వరుణ్ హత్య కేసు క్లోజ్ అయిన ఆరేళ్ల తరవాత ఈ కథ మొదలవుతుంది. ఊర్లో రాంబాబు స్థాయి, హోదా పెరుగుతుంది. సీడీ షాపు ఓనర్ నుంచి.. థియేటర్ యజమాని అవుతాడు. ఓ సినిమా కూడా తీయాలనుకుంటాడు. అందుకోసం ఓ కథని తానే రాస్తాడు. కుటుంబం అంతా హ్యాపీగానే ఉంటుంది. కానీ ఏదో ఓ భయం వెంటాడుతూ ఉంటుంది. పాత కేసు తిరగేస్తారేమో.. తమని మళ్లీ పోలీసులు ఇబ్బంది పెడతారేమో అని అనుక్షణం భయపడుతూనే ఉంటారు.
పోలీసుల్ని చూసినా, పోలీస్ సైరన్ విన్నా... అదే భయం. మరోవైపు పోలీసులు కూడా ఈ కేసుని మళ్లీ రీ ఓపెన్ చేస్తారు. రాంబాబుపై ఓ కన్నేసి ఉంచుతారు. వరుణ్ హత్యకు సంబంధించి ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని అన్వేషిస్తుంటారు. కనీసం... వరుణ్ శవం దొరికినా చాలన్నది వాళ్ల ప్రయత్నం. చివరికి వరుణ్ ని పాతిపెట్టింది పోలీస్ స్టేషన్‌లో అనే సంగతి పోలీసులకు తెలిసిపోతుంది. ఈ విషయాన్ని బయటకు తీసుకురావడానికి పోలీసులు ఏం చేశారు? వరుణ్ ఆస్తికలు దొరికిన తరవాత.. రాంబాబు అరెస్ట్ అయ్యాడా? తన కుటుంబాన్ని పోలీసులు మళ్లీ ఇబ్బంది పెట్టారా? ఈ విషయాలన్నీ దృశ్యమ్ 2లో చూడొచ్చు.
* విశ్లేషణ
పాత కేసుని తిరిగి తోడడమే... దృశ్యమ్ 2 స్పెషాలిటీ. కథ కూడా అంతే. వరుణ్ ని చంపి శవాన్ని మాయం చేస్తాడు దృశ్యమ్ 1లో. ఆ శవం ఎక్కడుందో కనుక్కోవడమే... ఈ కథ సారాంశం. అందుకోసం పోలీసులు వేసిన ప్లాన్‌లు, ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి రాంబాబు చేసిన ప్రయత్నాలూ... ఇదే కథ. నిజానికి ఓ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ చేయాలనుకోవడమే సాహసం. బలమైన కథ, తొలి భాగంతో పోలిస్తే... అబ్బుర పరిచే మలుపులూ ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది. జీతూ జోసెఫ్ ఆ మలుపుల్ని బాగా రాసుకున్నాడు.
చివరి 40 నిమిషాలూ.. కథ ఉరుకులు పరుగులుగా నడుస్తుంది. క్లైమాక్స్ లో ట్విస్టు ఊహిచనిదే. కాకపోతే... అక్కడి వరకూ సినిమాని కాస్త ఓపిగ్గా చూడాలి. క్లైమాక్స్ లో తాను వాడుకోవడానికి ఉపయోగపడేలా కొన్ని సన్నివేశాల్ని, తొలి సగంలో పేర్చుకున్నాడు దర్శకుడు. అవన్నీ చూస్తున్నప్పుడు... ఇంత లాగ్ ఎందుకు చేస్తున్నాడా అనిపిస్తుంది. కానీ చివర్లో ఇచ్చిన ట్విస్ట్ చూస్తే... ఇది చెప్పడానికి ఆయా సన్నివేశాల్ని వాడుకున్నాడని అనిపిస్తుంది. 2.35 గంటల సినిమా ఇది. నిజానికి దీన్ని బాగా ట్రిమ్ చేయొచ్చు. ఇలాంటి థ్రిల్లర్లు 2 గంటల్లో ముగిస్తే బాగుంటుంది. సినిమా లెంగ్త్ పెరగడం వల్ల... తొలి సగంలో ఆసక్తి సన్నగిల్లింది.
రాంబాబు ఫ్యామిలీ తాలుకూ భయం, పోలీసుల సన్నాహాలతో తొలి సగం సాగిపోతుంది. అందులో... అన్నీరొటీన్ సన్నివేశాలే. వినోదానికి కూడా ఛాన్స్ లేదు. సెకండాఫ్ కూడా సో..సోగానే మొదలవుతుంది. రాంబాబుని పట్టుకోవడానికి పోలీసులు వేసిన స్కెచ్ తెలిసిన దగ్గర్నుంచి కథలో వేగం వస్తుంది. రాంబాబు దొరికేశాడన్న చోట.. ఓ ట్విస్టు ఇచ్చి, ప్రేక్షకుల్ని షాక్ కి గురి చేస్తాడు దర్శకుడు. ఆ ట్విస్టంటూ లేకపోతే, ఈ సినిమా తేలిపోయేది. చివర్లో.. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి రాంబాబు చేసిన కసరత్తులేంటో తెలిశాక... ప్రేక్షకులు మరింత ఉత్కంఠతకు గురవుతారు. మొత్తానికి క్లైమాక్స్ ఈసినిమాని నిలబెట్టిందన్నది వాస్తవం. అయితే దృశ్యమ్ 1 చూడని వాళ్లకు.. ఈ కథలోని ఇంటెన్సిటీ అర్థం అవ్వదు. దృశ్యమ్ 2 చూడాలంటే, దృశ్యమ్ 1 తప్పకుండా చూడాల్సిందే.
* నటీనటులు
వెంకటేష్ గురించి చెప్పేదేముంది? ఇలాంటి పాత్రలకు తను పర్‌ఫెక్ట్. రీమేక్ సినిమాలంటే.. మరింత ఈజీగా చేసేస్తాడు. రాంబాబులో మరోసారి ఆవహించేశాడు వెంకీ. సగటు తండ్రిగా తనపాత్ర, అందులో వెంకీ నటించిన తీరు ఆకట్టుకుంటాయి. మీనా వయసుకి తగిన పాత్ర చేసింది. పిల్లలకు ఈసారి నటించే అవకాశం దక్కలేదు. సత్యం రాజేష్ ఓకే అనిపిస్తాడు. నదియా, నరేష్‌లదంతా సెకండాఫే. మిర్చీ సంపత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆకట్టుకున్నాడు.
* సాంకేతిక వర్గం
జీతూ రాసిన స్క్రీన్ ప్లే ఈ కథకు బలం. క్లైమాక్స్‌లో తన పనితనం బాగా కనిపించింది. కేవలం శవాన్ని అన్వేషించడం కోసం చేసే ప్రయత్నం ఈ కథ. దాన్ని రెండున్నర గంటల పాటు చూపిస్తూ, ప్రేక్షకుల్నికూర్చోబెట్టడం మాటలు కాదు. తొలి సగం ట్రిమ్ చేయాల్సింది. మలయాళంతో పోలిస్తే... మార్పులు చేర్పులకు ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. దాదాపు కట్ అండ్ పేస్ట్ చేశారు. తక్కువ బడ్జెట్,తక్కువ లొకేషన్లతో పూర్తయిన సినిమా ఇది. నిర్మాతలకు లాభసాటి ప్రాజెక్టే.
* ప్లస్ పాయింట్స్
వెంకీ - మీనా
క్లైమాక్స్ ట్విస్టు
* మైనస్ పాయింట్స్
తొలి సగంలో సాగదీత
నిడివి
* ఫైనల్ వర్డిక్ట్: పర్‌ఫెక్ట్ సీక్వెల్