నటీనటులు : సుందీప్ కిషన్, బాబీ సింహ, నేహా హరిరాజ్ శెట్టి తదితరులు
దర్శకత్వం : జి నాగేశ్వర్ రెడ్డి
నిర్మాతలు : కోన వెంకట్, ఎమ్.వి.వి సత్యనారాయణ
సంగీతం : చౌరస్తా రామ్, సాయి కార్తీక్
సినిమాటోగ్రఫర్ : సుజాత సిద్ధర్థ్
ఎడిటర్: చోట కే ప్రసాద్
రేటింగ్: 2/5
కామెడీని మించిన కమర్షియల్ హంగు ఉండదు. చాలా సినిమాల్లు కేవలం కామెడీ వర్కవుట్ అవ్వడం వల్ల ఆడాయి. ఈమధ్య వచ్చిన `జాతిరత్నాలు` అందుకు అతి పెద్ద నిదర్శనం. కామెడీ పండితే - ప్రేక్షకులు లాజిక్కులు ఆలోచించరు. హాయిగా నవ్వుకుంటూ ప్రేక్షకుల్ని థియేటర్ల నుంచి బయటకు వస్తే ఆ సినిమా సూపర్ హిట్టు కిందే లెక్క.
అందుకే దర్శకులు, హీరోలూ ఈ జోనర్ అంటే పడి చస్తారు. జి.నాగేశ్వరెడ్డిది కామెడీ పంచడంలో మంచి హస్త వాసి. ఆయన సినిమాలన్నీ వినోదాత్మకంగా సాగేవే. `వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్` లాంటి సినిమాలతో సందీప్ కిషన్ కూడా బాగానే నవ్వించగలడు అని ప్రూవ్ అయ్యింది. మరి వీరిద్దరి కాంబోలో వచ్చిన `గల్లీ రౌడీ` కూడా అలానే నవ్వించాడా? ఈ సినిమాని కామెడీ ఎంత వరకూ కాపాడింది
* కథ
పట్టపగలు వెంటరావు (రాజేంద్ర ప్రసాద్) ఓ హెడ్ కానిస్టేబుల్. తనకు బీచ్ రోడ్‌లో 2 కోట్ల విలువైన స్థలం ఉంటుంది. దాన్ని బైరాగి అనే దాదా కబ్జా చేస్తాడు. తనని దారుణంగా అవమానిస్తాడు. వెంకటరావు కూతురు సాహిత్య (నేహా శెట్టి) బైరాగిపై పగ తీర్చుకోవాలనుకుంటుంది. తమ రెండు కోట్లూ ఎలాగైనా సరే, రాబట్టాలని ప్లాన్ వేస్తుంది. అందులో భాగంగా వాసు (సందీప్ కిషన్) సహాయం కోరుతుంది.
వాసు కుటుంబంలో అంతా రౌడీలే. తనని కూడా రౌడీ చేయాలని తాతయ్య (నాగినీడు) కలలు కంటాడు. కానీ వాసుకి రౌడీయిజం అంటే ఇష్టం ఉండదు. సాహిత్య కోసం మాత్రం తాను రౌడీగా మారతాడు. బైరాగిని కిడ్నాప్ చేసి రెండు కోట్లు డిమాండ్ చేయాలనుకుంటారు. ఆ ప్రయత్నంలో బైరాగిని ఇంకెవరో హత్య చేస్తారు. ఇంతకీ బైరాగీని ఎవరు హత్య చేశారు? ఈ కేసు నుంచి వాసు, సాహిత్య కుటుంబ సభ్యులు ఎలా తప్పించుకున్నారు? అనేదే మిగిలిన కథ.
* విశ్లేషణ
ఈ కథలో నాని సినిమా `గ్యాంగ్ లీడర్` ఛాయలు కనిపిస్తాయి. అందులోనూ అంతే... ఒకరిపై పగ తీర్చుకోవడానికి హీరో ఇంకెవరికో సహాయం చేస్తాడు. అసలేమాత్రం అనుభవం లేకుండానే.. మాస్టర్ ప్లాన్లు వేస్తుంటారు. ఆ కేసు నుంచి వాళ్లు తెలివిగా ఎలా తప్పించుకున్నారన్నది గ్యాంగ్ లీడర్ కథ. `గల్లీ రౌడీ` కూడా ఇంచు మించుగా అలానే ఉంటుంది. వాసుని రౌడీ చేసే ప్రయత్నాలతో సరదాగానే కథ మొదలవుతుంది. ఆ తరవాత వాసు - సాహిత్యల లవ్ స్టోరీ.
వైవా హర్ష ఉండడం వల్ల కొన్ని పంచ్‌లు బాగానే పండాయి. దానికి రాజేంద్ర ప్రసాద్ అనుభవం తోడైంది. దాంతో ఫన్ రైడ్ అనిపించుకునే ఆరంభం దొరికింది. అయితే బైరాగి కిడ్నాప్ డ్రామా ఎప్పుడైతే మొదలైందో అప్పుడు థ్రిల్ స్టార్ట్ అవుతుంది. ఆ కామెడీని, ఈ థ్రిల్ నీ రెండింటినీ మిక్స్ చేయడంలో నాగేశ్వరెడ్డి నైపుణ్యం కనిపించలేదు. సన్నివేశాలన్నీ పాత సినిమాల్నిగుర్తుకు తెచ్చేలా సాగి, ముతక ఫీలింగ్ కలిగిస్తాయి.
ద్వితీయార్థం మొత్తం... మర్డర్ ఇన్వెస్టిగేషనే. అందులో తెలివితేటలేం ఉండవు. హీరో అండ్ గ్యాంగ్ ఎంత తెలివిగా తప్పించుకుంటే `గల్లీ రౌడీ` అంత బాగుండేది. ఈ ఇన్వెస్టిగేషన్ లో ఎప్పుడూ పోలీసుల వైఫల్యం, వాళ్ల అమాయకత్వం కనిపిస్తుంది తప్ప, హీరో తెలివి తేటలు కాదు. బాబీ సింహా పాత్ర కూడా క్లూ లెస్ గా సాగుతుంది. భైరాగిని ఎవరు చంపారు? అనేది ఇంట్రస్టింగ్ ఫ్యాక్టరే. కాకపోతే ఆ దిశగా ఎలాంటి ఆసక్తినీ కలిగించలేకపోయాడు. సినిమా అంతా అయిపోయాక.. బైరాగిని చంపింది ఎవరో కాదు... అంటూ అసలైన ట్విస్ట్ రివీల్ చేయాలనుకుంటాడు దర్శకుడు. కానీ అప్పటికే ప్రేక్షకులంతా థియేటర్ విడచి బయటకు పరుగులు తీసేస్తుంటారు. వెన్నెల కిషోర్, షకలక శంకర్‌ల కామెడీ వర్కవుట్ కాలేదు. పైగా ఆయా సన్నివేశాలు మరింత విసిగించాయి. బలహీనమైన కథ, కథనంలో పాత సినిమాల వాసన తగలడంతో గల్లీ రౌడీ - డల్ రౌడీగా మారిపోవాల్సివచ్చింది
* నటీనటులు
సందీప్ కిషన్ చలాకీగా కనిపించాడు. వాసుగా ఆ పాత్రకు ఏం కావాలో అదంతా చేశాడు. కానీ ఇలాంటి రొటీన్ పాత్రల వల్ల సందీప్ కి హీరోగా ఒరిగేదేం ఉండదు. కథల విషయంలో తాను మరింత జాగ్రత్తగా ఉండాలి. నేహా శెట్టి అందంగా ఉన్నా, తన పాత్రని తీర్చిదిద్దిన విధానం అంత బాగాలేదు. బాబీ సింహా విషయంలోనూ అదే జరిగింది. తను చాలామంది నటుడు. తనకు సరిపడా పాత్ర కాదు. పోసాని, నాగినీడు రొటీన్ ఎక్స్‌ప్రెషన్స్, డైలాగ్ డెలివరీతో విసిగించారు.
* సాంకేతిక వర్గం
కథలో బలం లేదు. కథనంలో మెరుపుల్లేవు. దాంతో సినిమా మొత్తం.. బోరింగ్ గా సాగింది. కామెడీ సినిమాలకు.. నవ్వించడమే పెద్ద టాస్క్. అందులో దర్శకులు ఇతర టీమ్ దారుణంగా ఫెయిల్ అయ్యారు. రామ్ పాడిన పుట్టెనే ప్రేమా పాట బాగుంది. మిగిలిన పాటలూ ఓకే. సినిమా నిడివి తక్కువైనా. రెండు సినిమాల్ని ఒకేసారి చూసిన ఫీలింగ్ కలిగింది. అదంతా స్క్రిప్టులో ఉన్న లోపమే.
* ప్లస్ పాయింట్స్
టైటిల్
కొన్ని కామెడీ బిట్లు
* మైనస్ పాయింట్స్
రొటీన్ కథ, స్క్రీన్ ప్లే
పాత సినిమాల ప్రభావం
* ఫైనల్ వర్డిక్ట్: పాత రౌడీనే