నటీనటులు: నితిన్, తమన్నా, నభా నటేష్, నరేష్ తదితరులు
నిర్మాతలు: ఎన్. సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి
దర్శకుడు: మేర్లపాక గాంధీ
సంగీత దర్శకుడు: మహతి స్వరసాగర్
సినిమాటోగ్రఫీ: జె యువరాజ్
ఎడిటర్: ఎస్‌ఆర్ శేఖర్
రేటింగ్: 3/5
ఈమధ్య హీరోలు బాగా సాహసాలు చేస్తున్నారు. ఎలాంటి పాత్ర చేయడానికైనా రెడీ అంటున్నారు. చెవిటివాడిగా అన్నా సరే ఓకే. గుడ్డివాడి పాత్రలకూ సై. ఏదో ఓ డిజార్డర్ పెడతామన్నా - వెనకడుగు వేయడం లేదు. ఈ పాత్రతో జనానికి ఎంటర్ టైన్‌మెంట్ ఇవ్వగలమా, లేదా? అనేది ఒక్కటే ఆలోచిస్తున్నారు. అందుకే వెండి తెరపై మన హీరోల్ని కొత్త కొత్త పాత్రల్లో చూసే అవకాశం దక్కుతుంది. తాజాగా నితిన్... అంధుడిగా మారిపోయాడు. `మాస్ట్రో` కోసం. బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన `అంధాధూన్`కి ఇది రీమేక్. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు హాట్ స్టార్ లో విడుదలైంది. మరి ఈ సినిమా కథేమిటి? నితిన్ చేసిన ప్రయోగం ఫలించిందా, లేదా?
* కథ
అరుణ్ (నితిన్) పియానో ప్లేయర్. సంగీతం అంటే చాలా ఇష్టం. మ్యూజిక్ పై ఫోకస్ పెంచడానికి గుడ్డివాడిగా మారతాడు. తన చుట్టు పక్కల వాళ్లు సైతం... అరుణ్ గుడ్డివాడే అనుకుంటారు. కానీ.. తనకు కళ్లున్నాయి. మోహన్ (నరేష్) ఓ మాజీ హీరో. సిమ్రన్ (తమన్నా)ని రెండో పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరికీ వయసులో పదిహేనేళ్లు తేడా ఉంటుంది. తమ మూడో పెళ్లి రోజున అరుణ్ తో ఓ చిన్న కాన్సర్ట్ ప్లాన్ చేస్తాడు మోహన్. ఆ రోజున అరుణ్ వచ్చేటప్పటికి మోహన్ తన ఇంట్లోనే శవంలా కనిపిస్తాడు. ఈ హత్య చేసింది ఎవరో కాదు... సిమ్రన్. కళ్లు లేవని అందరినీ నమ్మిస్తున్న అరుణ్ ఈ హత్యని చూశాక ఏం చేశాడు? సిమ్రన్‌తో అరుణ్ కి ఎదురైన సమస్యలేంటి? వాటి నుంచి ఎలా తప్పించుకున్నాడు? ఇవన్నీ వెండి తెరపై చూసి థ్రిల్ అవ్వాల్సిందే.
* విశ్లేషణ
రీమేక్ కథలతో వచ్చిన ఇబ్బంది ఏమిటంటే... కొత్తగా మార్పులు చేస్తే - మంచి కథని పాడు చేశావంటారు. ఉన్నది ఉన్నట్టు తీస్తే... కాపీ పేస్ట్ అంటారు. ఈ విషయాన్ని మేర్లపాక గాంధీనే చెప్పాడు. కాబట్టి.. ఈ రిస్క్ కి తాను రెడీ అయిపోయాడన్నమాట. కాకపోతే. కాపీ పేస్ట్ అనుకున్నా ఫర్వాలేదని డిసైడ్ అయిపోయి.. ఈ కథలో మార్పులు చేర్పులు చేసే సాహసం చేయలేదు. దానికి తోడు. అంధాధూన్ పర్పైట్ రైటింగ్ కి ఓ మంచి తార్కాణం. లింకులన్నీ కరెక్టుగా వేసుకుని తీసిన సినిమా. కాబట్టి మార్పులకు పెద్దగా ఛాన్సు లేదు. అందుకే అంధాధూన్ ని ఫాలో అయిపోయాడు.
సినిమా ప్రారంభమైన విధానం చాలా స్లోగా ఉంటుంది. నిజంగా మన కమర్షియల్ సినిమాలకు భిన్నమైన నేరేషన్. నితిన్ ఏమిటి మరీ ఇంత డల్ గా ఉన్నాడు అనిపిస్తుంది. అయితే క్రమంగా ట్విస్టులు రివీల్ అవుతూ, కొత్త పాత్రలు వస్తుండడంతో ఆసక్తి మొదలవుతుంది. మోహన్ ఇంట్లో పియానో ప్లే చేయడానికి అరుణ్ వెళ్లే సీన్... అక్కడ జరిగే మర్డర్, అరుణ్ గుడ్డి వాడా, కాదా? అనే విషయాలు తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాలు.. ఇలా అన్నీ ఒక దాన్ని మించి మరోటి ఉత్కంఠత కలిగించుకుంటూ వెళ్తాయి.
ద్వితీయార్థంలో కథ కొత్త మలుపులు తీసుకుంటుంది. అక్కడ కూడా... కథని దాటి బయటకు వచ్చి, ఏదో చెప్పాలన్న ప్రయత్నం చేయలేదు దర్శకుడు. కేవలం కథనే ఫాలో అయ్యాడు. తొలిసగంతో పోలిస్తే.. రెండో సగం కాస్త నెమ్మదిగా ఉందనిపిస్తుంది. కాకపోతే.. క్లైమాక్స్, అంతకు ముందొచ్చే ట్విస్టు ఇవన్నీ ఆ లోటు భర్తీ చేస్తాయి. మోహన్ ని హత్య చేసిందెవరో తెలిసి కూడా.. ఆ విషయాన్ని చివరి వరకూ అలానే గోప్యంగా ఉంచేయడం, పోలీస్ ఆఫీసర్ పాత్రకు జస్టిఫికేషన్ ఇవ్వకపోవడం `అంధాధూన్`లో కనిపించాయి. ఆ పొరపాటు ఈ రీమేక్ లో సరి చేస్తారనుకుంటే, ఇక్కడా ఆ సాహసం చేయలేదు. నిడివి తక్కువ ఉండేలా చూసుకోవడం, పాటల్ని కత్తిరించడం చాలా ప్లస్ అయ్యింది. మొత్తానికి ఓ మంచి రీమేక్ మూవీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
* నటీనటులు
నితిన్ కి ఇది తప్పకుండా కొత్త తరహా పాత్ర. తన వంతు బాగా చేశాడు. ఓ కొత్త తరహా నితిన్ ని చూసే అవకాశం దక్కింది. కళ్లున్నా - లేనివాడిగా బాగా నటించాడు. నిజంగా కళ్లు పోయినప్పుడూ ఆ ఫీలింగ్ ని అద్భుతంగా పలికించాడు. తమన్నా పాత్ర ఈ సినిమాకి ఆయువు పట్టు. తను కూడా తన బాధ్యత సక్రమంగా నెరవేర్చింది. నభా నటేషాది కేవలం గ్లామర్ షో. చిట్టి పొట్టి దుస్తుల్లో మెరిసింది. నరేష్ మాజీ హీరోగా తన పాత్రలో ఒదిగిపోయాడు. మంగ్లీ ఓ చిన్న పాత్రలో కనిపించింది.
* సాంకేతికత
సినిమా క్వాలిటీ చాలా బాగుంది. మేకింగ్ పరంగా జాగ్రత్తలు తీసుకున్నారు. కెమెరా వర్క్, నేపథ్య పనితనం ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ చాలా షార్ప్ గా సాగింది. దర్శకుడు ప్రయోగాల జోలికి వెళ్లలేదు. మాతృక ని ఏమాత్రం కెలకలేదు. ఉన్నది ఉన్నట్టుగా తీసినా, ఆ ఫీల్ చెడిపోలేదు. ద్వితీయార్థం కాస్త స్లో అయినట్టు కనిపించినా మొత్తానికి సినిమా పూర్తయ్యేసరికి ఓ థ్రిల్ కలిగించడంలో చిత్రబృందం సఫలమైంది.
* ప్లస్ పాయింట్స్
కథ
కథనం
ట్విస్టులు
తమన్నా పాత్ర
* మైనస్ పాయింట్స్
సెకండాఫ్ లో కాస్త స్లో నేరేషన్
* ఫినిషింగ్ టచ్: పర్‌ఫెక్ట్ మేడ్ రీమేక్