తారాగణం: సుమంత్, అంజు కురియన్, శివాజీ రాజా & తదితరులు
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
ఎడిటర్: గ్యారి బిహెచ్
సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి
నిర్మాత: శ్రీధర్ గంగపట్నం
దర్శకత్వం: అనిల్ శ్రీకంఠం
రేటింగ్: 1.5/5
సుమంత్ తన కెరీర్‌లో చాలా కథలు ట్రై చేశాడు. లవ్ స్టోరీలు, మాస్ సినిమాలు ఇలా చాలా జోనర్లు టచ్ చేశాడు. అయితే తనకు ప్రేమకథలే బాగా మప్పుతాయని `మళ్లీ రావా` లాంటి సినిమాలు నిరూపించాయి. కానీ..ఇప్పుడు తన దృష్టి థ్రిల్లర్స్ వైపు మళ్లింది. `సుబ్రహ్మణ్యపురం`తో ఓ థ్రిల్లర్ కథని ఎంచుకున్నాడు సుమంత్. ఇప్పుడు మరోసారి `ఇదం జగత్` తో అదే జోనర్ ట్రై చేశాడు. `సుబ్రహ్మణ్యపురం`తో దక్కని విజయం `ఇదం జగత్` ఇచ్చిందా? ఈ సినిమా ఎలా ఉంది?
కథ
నిశిత్ (సుమంత్) ఓ ఫ్రీలార్సర్. విశాఖపట్నంలో రాత్రి పూట జరిగే నేరాల్ని తన కెమేరాలో బంధించి ఆ ఫుటేజీని ఛానళ్లకు అమ్ముకుంటాడు. తనకు డబ్బు సంపాదించడం ఒక్కటే ధ్యేయం. ఇలా ఫుటేజీలను అమ్ముకోవడం నేరం కాదన్నది తన ఉద్దేశ్యం. మహతి (అంజుకురియన్)ని చూసి ఇష్టపడతాడు. తన భావాలు, ఆదర్శాలు వేరు. అనాథ పిల్లల కోసం శ్రమిస్తుంటుంది. రాత్రి పూట పనిచేసే ఉద్యోగులంటే సదాభిప్రాయం ఉండదు. అందుకే ఆ విషయాన్ని దాచి మహతికి దగ్గరవుతాడు నిశిత్. అనుకోకుండా ఓసారి విశాఖపట్నంలో ఓ వృద్ధుడ్ని ఓ అగంతకుడు కాల్చి చంపుతాడు. ఆ హత్యకు సంబంధించిన ఫుటేజీ నిశిత్ దగ్గర ఉంటుంది. దాన్ని అడ్డుపెట్టుకుని ఛానల్ ద్వారా లక్షలు సంపాదించాలన్నది తన ప్లాన్. కానీ ఆ ఫుటేజీనే తనని అనుకోని చిక్కుల్లో పడేస్తుంది. అదేంటి? ఆ తరవాత ఏం జరిగింది? నిశిత్ ఆలోచనలు మారాయా, లేదా? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు..
సుమంత్ చాలా నీరసంగా కనిపించాడు. నిద్ర మత్తులో ఉన్నట్టు నటించాడు. పాత్ర కూడా అలాంటిదే కాబట్టి... ఓకే అనుకోవొచ్చు. తన మేకప్ ఏమాత్రం బాలేదు. విగ్గు కూడా అతికినట్టు అనిపిస్తుంటుంది. కథానాయిక `ఆంటీ`లా కనిపించింది. ఆదిత్య మీనన్‌తో సహా మిగిలినవన్నీ దాదాపుగా అతిథి పాత్రల్లానే కనిపిస్తాయి. సత్య ఉన్నా.... నవ్వించడానికి ఛాన్స్ దొరకలేదు.
విశ్లేషణ...
ఓ హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో తెరకెక్కిన చిత్రమిది. తెలుగు నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేశాడు దర్శకుడు. రాత్రిపూట జరిగే నేరాల్ని రికార్డు చేయడం, దాని ద్వారా జీవనం సాగించడం అనే వృత్తి కొత్తగా అనిపిస్తుంది. కథానాయకుడి పాత్రలోనూ `స్వార్థం` తాలుకూ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఓ రకంగా.. సుమంత్‌కి ఇది కొత్త కథే. కొత్త పాత్రే అనుకోవాలి. దీనిని ఓ థ్రిల్లర్‌గా మలచాలన్నది దర్శకుడి ఉద్దేశం. ఆ లక్షణాలు కథలో ఉన్నాయి. కానీ.. దాన్ని తెరపై అంత ప్రభావవంతంగా చూపించలేకపోయాడు దర్శకుడు.
తెరపై జరుగుతున్న ఏ సన్నివేశం ప్రేక్షకుడికి కనెక్ట్ కాదు. చిన్న చిన్న వీడియోలు తీసి ఛానల్‌కి ఇస్తే... ఛానల్ వాళ్లు అంత త్వరగా తీసుకుంటారా? అన్ని డబ్బులు ఇస్తారా? అనేది అసలు ప్రశ్న. ఈ రోజుల్లో సీసీ టీవీ ఫుటేజీలు ఎక్కడ పడితే అక్కడ దొరకేస్తున్నాయి. అందుకోసం టీ వీ ఛానళ్లు ఇంత వేలం వెర్రిగా ఖర్చు పెడతాయా? అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ కూడా నీరసంగా, నిదానంగా తెరకెక్కించారు.
ద్వితీయార్థంలో మలుపులు చాలా తక్కువ. కథనం కూడా నత్తనడకన సాగుతుంది. సినిమా మొత్తం ఒకే ఒక్క పాయింట్ చుట్టూ సాగడం, ప్రతినాయకుడి పాత్రని చివర్లో రంగంలోకి దింపడం... ఇవన్నీ కథాగమనాన్ని దెబ్బతీశాయి. ఉక్కిరి బిక్కిరి చేసే స్క్రీన్ ప్లే గానీ, తరువాత ఏం జరుగుందా అనే ఉత్కంఠత గానీ `ఇదం జగత్` ఇవ్వలేకపోయింది.
సాంకేతిక వర్గం...
తక్కువ బడ్జెట్ లో తీసిన సినిమా ఇది. ప్రొడక్షన్ వాల్యూస్ అంతంతమాత్రంగానే ఉన్నాయి. బడ్జెట్ లేకపోవడం వల్లనేమో నేపథ్య సంగీతం, కెమెరా పనితనం అంత ప్రభావవంతంగా కనిపించలేదు. ఓ చిన్న పాయింట్‌ని పట్టుకున్న దర్శకుడు.. దాన్ని ఆసక్తికరంగా మలచడంలో పూర్తిగా విఫలమయ్యాడు
* ప్లస్ పాయింట్స్
- చెప్పడం కష్టం
* మైనస్ పాయింట్స్
- రాయడం కష్టం
పైనల్ వర్డిక్ట్: ఇదేం సినిమా
రివ్యూ రాసింది శ్రీ.