తారాగణం: విజయ్ ఆంటోనీ, అంజలి, సునైన, అమ్రితా, శిల్ప రాకేశ్, తదితరులు
నిర్మాణ సంస్థ: విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పోరేషన్
సంగీతం: విజయ్ ఆంటోనీ
ఛాయాగ్రహణం: రిచర్డ్
ఎడిటర్: లారెన్స్ కిషోర్
నిర్మాత: ఫాతిమా విజయ్ ఆంటోనీ
రచన-దర్శకత్వం: ఉదయనిధి
రేటింగ్: 1.5/5
బిచ్చగాడుతో తెలుగులో పాపులర్ అయిపోయాడు విజయ్ ఆంటోనీ. అంతకు ముందు కొన్ని సినిమాలు చేసినా, అవి సరిగా ఆడలేదు. కానీ కాన్సెప్ట్ పరంగా మాత్రం ఆకట్టుకున్నాయి. బిచ్చగాడు హిట్ తో... `విజయ్ సినిమాలు కొంటే.. డబ్బులొస్తాయిలే` అన్న నమ్మకం కలిగాయి. దాంతో విజయ్ ఆంటోనీకి తెలుగులో మార్కెట్ ఏర్పడింది. అయితే... ఆ తరవాత విజయ్ ఖాతాలో ఒక్క హిట్టూ లేదు. బిచ్చగాడు లాంటి సినిమా చూడబోతున్నాం అని ఆశించిన ప్రేక్షకులకు ప్రతీసారీ నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో విజయ్ ఆంటోనీ చేసిన మరో ప్రయత్నం `కాశి`. ఇంతకీ కాశి కథేంటి? ఈసారైనా ఆంటోనీ అంచనాల్ని అందుకున్నాడా, లేదా?
* కథ
అమెరికాలో ఉండే భరత్ (విజయ్ ఆంటోనీ) అనే ఓ డాక్టర్ కథ ఇది. అమ్మానాన్నలతో కలసి హాయిగా ఉంటాడు. తనకు లేనిది ఏదీ లేదు. అందరూ ఈర్ష్య పడే జీవితం తనది. కానీ... ప్రతీరోజూ ఓ కల అతన్ని భయపెడుతూ ఉంటుంది. తన చిన్నతనంలో ఓ పాము కరవడానికి వస్తున్నట్టు, ఓ ఎద్దు తరుముతున్నట్టు వచ్చే ఆ కల.. ప్రతీసారీ నిద్రలోంచి ఉలిక్కిపడేలా చేస్తుంటుంది.
ఓరోజు.. తనకో నిజం తెలుస్తుంది. తన సొంత అమ్మానాన్నలు వీళ్లు కాదని, ఎక్కడో విజయవాడ అనాధాశ్రమం నుంచి తనని దత్తత తీసుకొచ్చి, డాక్టర్ చేశారని అర్థమవుతుంది. తన చిననాటి కలకూ, తన బాల్యానికీ ఏదో సంబంధం ఉందని గ్రహిస్తాడు భరత్. అందుకే తనని పెంచిన తల్లిదండ్రుల అనుమతి తీసుకుని ఓ వారం రోజులు పాటు ఇండియాలో ఉండి, తన బాల్యం నాటి సంగతులు తెలుసుకుందామని ఇండియాకి వస్తాడు. అంతే.. అక్కడి వరకే `కాశీ`ని చూపించారు. మిగిలిన కథేంటో తెలుసుకోవాలంటే `కాశీ` సినిమా చూడాల్సిందే.
* నటీనటులు
విజయ్ ఆంటోనీ నటన లోంచి కొత్తగా ఆశించేది ఏమీ లేదు. గత సినిమాల్లో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్‌తో కనిపించాడో.. ఈసారీ అంతే. ఎలాంటి మార్పూ లేదు. బహుశా విజయ్ ఆంటోనీని అలా చూడ్డానికే ప్రేక్షకులూ అలవాటు పడిపోయారేమో.
హీరోయిన్‌లా కనిపించిన అంజలిని సైడ్ క్యారెక్టర్ కంటే దారుణం చేసేశారు. మిగిలిన కథానాయికలకు ఒకొక్క పాటైనా ఉంది. అంజలికి అదీ లేదు. నాజర్, జయ ప్రకాష్‌లవి మాత్రమే తెలుగు ప్రేక్షకులకు తెలిసిన మొహాలు. అయితే వాళ్ల పాత్రలూ అంతంతమాత్రమే.
* విశ్లేషణ
తన కన్నతల్లిదండ్రుల గురించి తెలుసుకోవడానికి ఖరీదైన జీవితాన్ని, గొప్ప ఉద్యోగాన్నీ వదిలి.. ఇండియా వచ్చి సాధారణమైన జీవితాన్ని గడిపే ఓ కొడుకు కథ ఇది. వినడానికి ఇదీ `బిచ్చగాడు` తరహా సినిమానే అనిపిస్తుంది. కానీ ఆ స్థాయిలో కథనం, ట్రీట్‌మెంట్ లేవు. మొదటి పది నిమిషాలూ కథ, కథనం ఆకట్టుకుంటాయి. భరత్ కేదో భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ ఉండే ఉంటుందనిపిస్తుంది. పాము, ఎద్దు చూపించి ఇదేదో థ్రిల్లర్, ఫాంటసీ అనే భ్రమలు కల్పించాడు.
ఇలాంటి కథల్ని ఆసక్తికరంగానూ చెప్పొచ్చు. కానీ ఈ విషయంలో దర్శకురాలు విఫలం అయ్యింది. కథ ఎంత బలహీనంగా ఉందో.. కథనం అంతకంటే పేలవంగా కనిపిస్తుంది. ఈ కథలో మూడు ఉపకథలున్నాయి. వాటితో అసలు కథకు అంతగా సంబంధం ఉండదు. ఒక్కో ఉప కథ.. ఓ సినిమాలా అనిపిస్తుంది. అందులోనే పాటలు, చిన్న చిన్న ఫ్లాష్ బ్యాక్‌లు. కథలో ఉపకథలు ఎక్కువయ్యాయి అనుకుంటే... ఆ ఉపకథల్లో మళ్లీ ఫ్లాష్ బ్యాక్‌ల గోల. మొత్తానికి కాశి... చివరి వరకూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతూ సాగుతుంది.
కాలేజీ విద్యార్థి కథలో, దొంగ కథలో.. ఎలాంటి మలుపులూ కొత్త విషయాలూ ఉండవు. కథకు మూలమైన మాస్టర్ ఫ్లాష్ బ్యాక్ కూడా తేలిపోయింది. ఇది తెలుసుకోవడానికి భరత్ ఇండియా వచ్చాడా? అనిపిస్తుంది. కథలో వినోదానికి ఆస్కారం లేదు. దర్శకురాలు మాత్రం అక్కడక్కడ నవ్వించడానికి ప్రయత్నించింది. విజయ్ ఆంటోనీకి సహాయకుడిగా కనిపించిన కాంపోండర్ అక్కడక్కడ నవ్విస్తాడు.
ఓవరాల్‌గా మాత్రం... కథలో సీరియెస్ డోస్ ఎక్కువైంది. పతాక సన్నివేశాలు కూడా అంతంత మాత్రమే. ఈ మూడు ఉపకథలకూ అసలు కథతో ముడి పెట్టి ఉంటే... బాగుండేది. కానీ ఆ ప్రయత్నం జరగలేదు.
* సాంకేతిక వర్గం
కథలో ఎలాంటి మలుపులూ లేవు. కథనం పేలవంగా సాగింది. ఇవి రెండూ చేతులెత్తేసినప్పుడు మిగిలిన సాంకేతిక విభాగాలు మాత్రం ఏం చేయగలవు. విజయ్ ఆంటోనీ సంగీతంలో మెలోడీలు బాగానే వినిపించేవి. ఈసారి వాటినీ ఆశించలేం. పాటలు సోసోగా ఉన్నాయి. కథాగమనానికి అడ్డు తగిలాయి. కత్తిరించాల్సిన సినిమా చాలా మిగిలిపోయింది. సాంకేతికంగానూ ఈ సినిమా అంతంత మాత్రంగానే ఉంది.
* ప్లస్ పాయింట్స్
+ విజయ్ ఆంటోనీ
* మైనస్ పాయింట్స్
- మిగిలినవన్నీ
* ఫైనల్ వర్డిక్ట్: కాశి.. రాశి ఎక్కువ వాసి తక్కువ
రివ్యూ రాసింది శ్రీ