'కెజిఎఫ్‌ చాప్టర్-2' మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు: యశ్, సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ తదితరులు
దర్శకత్వం : ప్రశాంత్ నీల్
నిర్మాతలు: విజయ్ కిరగందూరు
సంగీత దర్శకుడు: రవి బసృర్
సినిమాటోగ్రఫీ: భువన్ గౌడ
ఎడిటర్ : ఉజ్వల్ కులకర్ణి


రేటింగ్ : 3/5


కన్నడ చిత్ర పరిశ్రమని ఒక్కసారిగా వందరెట్లు పెంచిన సినిమా 'కేజీయఫ్'. విడుదలకు ముందు పెద్ద అంచనాలు లేని కేజీయఫ్ సంచలన విజయం సాధించింది. బాహుబలి తర్వాత రెండో పాన్ ఇండియా సినిమాగా కలెక్షన్స్ వసూళ్లు కురిపించింది. కేజీయఫ్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో పార్ట్ 2 పై వందరెట్లు అంచనాలు పెరిగిపోయాయి. కేజీయఫ్ పై ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లి ప్రేక్షకుడు థ్రిల్ అయ్యాడు.


అయితే పార్ట్ 2 అలా కాదు.. కేజీయఫ్ ప్రపంచంలో రాకీ భాయ్ ఓ మెరపు, ఉరుము, పిడుగు. పార్ట్ వన్ కి లో ఎమోషన్, ఎలివేషన్ మామూలుది కాదు. ఇప్పుడు ప్రేక్షకుడు అంతకుమించి ఆశించి థియేటర్ లో అడుగుపెట్టాడు. మరి రాఖీ భాయ్ ఆ అంచనాకు అందుకున్నాడా ? కేజీయఫ్ ప్రపంచంలో ఈసారి ఎలాంటి కథ జరిగింది? కేజీయఫ్ ని పార్ట్ 2 మైమరపించిందా ? తెలియాలంటే రివ్యూలోకి వెళ్ళాల్సిందే.


కథ:


కేజీయఫ్ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే పార్ట్ 2 కథ మొదలౌతుంది. కేజీయఫ్ లో జెండాపాతిన రాకీ భాయ్ అక్కడ తన సామ్రాజ్య పునాదులు వేస్తాడు. కేజీయఫ్ తను వూహించినదాని కంటే పెద్ద ప్రపంచమని గ్రహిస్తాడు. అయితే ఇదే సందర్భంలో అధీరా (సంజయ్ దత్ ) నుంచి రాకీకి సవాల్ ఎదురౌతుంది. ఇదే సమయంలో ప్రభుత్వం మారుతుంది. రామిక సేన్ (రవీనా టాండన్ ) ప్రధానమంత్రి అవుతుంది. ఆమె కేజీయఫ్ పై ద్రుష్టి పెడుతుంది. ఒక పక్క అధీరా, మరోపక్క దేశ ప్రధాన మంత్రి.. ఇద్దరూ రాఖీ భాయ్ పతనం కోరుకుంటారు. అప్పుడు రాఖీ భాయ్ ఏం చేశాడు ? ఈ సవాళ్ళని దాటి కేజీయఫ్ ని తన చేతిలో పెట్టుకున్నాడా ? అనేది తెరపై చూడాలి.


విశ్లేషణ:


కేజీయఫ్ కథలో కోర్ ఎమోషన్ అందరిని ఆకట్టుకుంది. తల్లికి ఇచ్చిన మాట కోసం ఓ కొడుకు సామ్రాట్ లా ఎదుగుతాడు. కేజీయఫ్ పార్ట్ 1లోనే రాకీ సామ్రాట్ అయ్యాడు. అప్పుడే ఆ కథకు ఒక పరిపూర్ణత వచ్చింది. అయితే కేజీయఫ్ 2ని కూడా ప్రకటించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. కేజీయఫ్ అదిరిపోవడంతో సహజంగానే పార్ట్ పై రెట్టించిన అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలు బాగానే ఏర్పడాయి కానీ .. ఆ అంచనాలకు తగ్గ కథ చూపించడంలో కేజీయఫ్ 2 కొంత నిరాస పరిచింది. కేజీయఫ్ లో వీర లెవల్ ఎలివేషన్స్ ని చూసేశారు ప్రేక్షకులు. హీరో పాత్రని ముందుకు తీసుకెళ్ళడానికి తగిన కథ పార్ట్ వన్ లో వుండటంతో హీరో జర్నీలో హీరోయిజం ఎలివేషన్స్ ని ఎంజాయ్ చేశారు. అయితే సెకండ్ పార్ట్ విషయానికి వచ్చేసరికి ఆ ఎలివేషన్స్ అన్నీ రిపీట్ గా అనిపిస్తాయి.


కేజీఎఫ్ తో పోల్చుకుంటే పార్ట్ 2లో ఎమోషనల్ డెప్త్ కూడా తక్కువగానే వుంటుంది. రాఖీ పాత్ర పరిచయం, భారీ ఎలివేషన్స్, కేజీఏఫ్ ప్రపంచం, అధీరా పాత్ర రూపంలో రాఖీ ఎదురయ్యే సవాల్ చూపించడాకే దాదాపు ఫస్ట్ హాఫ్ సగానికి వచ్చేస్తుంది. ఇంటర్వెల్ దగ్గర ఆసక్తికరమైన ఓ మలుపుని ప్లాన్ చేసి సెకండ్ హాఫ్ పై అంచనాలు పెంచారు. నిజానికి అసలు కథ ఇంటర్వెల్ తర్వాతే మొదలౌతుంది, మొదటి సగంతో పోల్చుకుంటే రెండో సగమే కొంచెం ఆసక్తికరంగా వుంటుంది. అయితే హీరోకి ఎదురయ్యే సవాల్ ని మొదటి బాగంలో చూపించినంత థ్రిల్లింగ్ గా మలచలేకపోయాడు దర్శకుడు. అధీరాకి రాకీ దొరికిన వడిచిపెట్టడం, రాకీకి అధీరా విషయంలో ఇదే చేయడం నిడివి పెంచడానికి తప్పా డ్రామా పండటానికి ఉపయోగ పడలేదు.


పైగా పార్ట్ వన్ చూడకుండా పార్ట్ 2 చూసేవారికి సినిమా అసలు అర్ధం కాదు. ఇది వరకూ చాలా సినిమాల పార్ట్ 2లు వచ్చాయి.  ఒక పరిచయంతో కథ మొదలుపెటితే పార్ట్ 2 కొత్తవారికి కూడా అర్ధమౌతుంది. కానీ కేజీయఫ్ అలా కాదు..క్లాస్ టీచర్ రివిజన్ చేసి  క్లాస్ కి రమ్మని చెప్పినట్లు... పార్ట్ 2చూడాలంటే ఒకసారి కేజీయఫ్ ని మళ్ళీ చూసి థియేటర్ లోకి రావాలనే పద్దతిలో పాత్రలు, సన్నివేశాలు డిజైన్ చేశారు.


భారీగా ఖర్చుపెట్టారు. భారీ కష్టపడ్డారు. ప్రేక్షకులు కూడా అంతే భారీ అంచనాలతో అడుగుపెట్టారు. పార్ట్ 2అంటే డబుల్ ఉంటుందని అనుకున్నారు. కానీ కేజీయఫ్ లో సగం కూడా ఈ పార్ట్ లో చూపించలేదనే ఫీలింగ్ ప్రేక్షకుడిలో కలుగుతుంది.


కేజీయఫ్ అంటే ఒక బలమైన కథానాయకుడు, అంతకంటే బలమైన విలన్ .. కానీ పార్ట్ 2కి వచ్చేసరికి హీరో విలన్ ల మధ్య సంఘర్షణ స్థాయి తగ్గిపోయింది. దీంతో డ్రామా థ్రిల్ దెబ్బతింది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ లో అడుగుపెడితే ఓకే కానీ కేజీయఫ్ కి మించి వుంటుందనే అంచనాతో వెళ్తే మాత్రం నిరాశ తప్పదు. అన్నట్టు.. పార్ట్ 3 పై కూడా హింట్ ఇచ్చాడు దర్శకుడు. దీంతో కేజీయఫ్ ని ఒక సూపర్ హీరో సిరిస్ గా నడిపే ఆలోచన దర్శకుడిలో వుందని అర్ధం చేసుకోవచ్చు.


నటీనటులు:


కేజీయఫ్ తో లార్జర్ దెన్ లైఫ్ పాత్ర చేసే అవకాశం అందుకున్నాడు యష్. రాకీ భాయ్ పాత్రని యష్ పోషించిన విధానం అద్భుతం. ఒక్క చిన్న గ్యాంగ్ స్టార్ గా మొదలై .. ఒక సామ్రాజ్యన్ని సొంతం చేసుకున్న పాత్ర .. కేజీయఫ్ లో కనిపిస్తుంది. అయితే పార్ట్ 2కి వచ్చేసరికి అంత జర్నీ వుండదు. రాకీ పాత్ర ఎదురుకొనే సవాళ్ళు కూడా పెద్దగా వుండవు. ఫస్ట్ పార్ట్ లో డిఫరంట్ షేడ్స్ లో కనిపించిన యష్ కి పార్ట్ 2 అంత వివైధ్యమైన అనుభవాన్ని ఇవ్వదు. అయితే యష్ లో హీరోయిజం పీక్స్ లో కనిపిస్తుంది.


యాక్షన్ సీన్ లో వీర లెవల్ లో చేశాడు. హీరోయిన్  శ్రీనిధి పాత్ర మొదటి పార్ట్ లానే సపోర్టింగ్ గా చేసింది. అయితే ఈ పార్ట్ తో ఆమె పాత్రని ముగించేశాడు దర్శకుడు. అధీరా గా సంజయ్ దత్ లుక్ , యాక్టింగ్ అద్భుతంగా వుంది. అయితే ఆ పాత్రని ఇంకా బలంగా  డిజైన్ చేయాల్సింది. రవీనా టాండన్, రావు రమేష్ , ప్రకాష్ రాజ్ పార్ట్  2కోసం కొత్తగా యాడ్ అయ్యారు. వారి పాత్రల వరకూ చక్కగా చేశారు. మిగతా నటులు పరిధి మేర నటించారు.


టెక్నికల్ గా :


సాంకేతికంగా సినిమా ఉన్నంతగా వుంది. రవి బస్రూర్ సంగీతం ఎలివేషన్స్ కి ప్రాణం పోషించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వుంది. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవల్ వుంది.  డ్రామా వీక్ గా వున్న విజువల్స్ కట్టిపడేశాయి. డైలాగ్ కొన్ని ఆకట్టుకున్నాయి. నిర్మాణ విలువలు భారీ స్థాయి లో వున్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ అడుగడుగునా భారీదనం ఉండేలా చూసుకున్నాడు.  


ప్లస్ పాయింట్స్


హీరోయిజం
ఎలివేషన్స్
నేపధ్య సంగీతం
నిర్మాణ విలువలు


మైనస్ పాయింట్స్ :


కథలో ఎమోషనల్ డెప్త్ లేకపోవడం
హీరో, విలన్ మధ్య సంఘర్షణ తగ్గడం


ఫైనల్ వర్దిక్ట్: కేజీయఫ్2..మాస్ మసాలా స్టఫ్ఫ్..!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS