నటీనటులు : అమలా పాల్, తదితరులు
దర్శకత్వం : పవన్ కుమార్
నిర్మాతలు : టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల, పవన్ కుమార్
సంగీతం : పూర్ణచంద్ర తేజస్వి
సినిమాటోగ్రఫర్ : అద్వైత గురుమూర్తి
ఎడిటర్: సురేష్ ఆరుముగం
రేటింగ్: 3/5
వెబ్ సిరీస్‌లు వచ్చాక.. కొత్త కాన్సెప్టులు మరిన్ని పుడుతున్నాయి. వెండి తెరపై చెప్పలేని కథలు, చెప్పడానికి వీలు లేని కథల్ని.. వెబ్ సిరీస్‌లుగా మలుస్తున్నారు. తెలుగులో ఇప్పటి వరకూ చాలానే వెబ్ సిరీస్‌లు వచ్చినా - అందులో ఒక్కటీ కట్టిపడేయలేకపోయిందన్నది వాస్తవం. అయితే ఆ లోటుని `కుడి ఎడమైతే` కొంత వరకూ తీర్చిందనే చెప్పాలి. `ఆహా`లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ ఇది. అమలాపాల్ ప్రధాన పాత్రధారి. `యూ టర్న్`లాంటి హిట్ సినిమా అందించిన పవన్ కుమార్ దర్శకత్వం వహించాడు. మరి.. కుడి ఎడమైతే ఎలా ఉంది? ఈ కుడి ఎడమల కథేంటి?
*కథ
ఆది (రాహుల్ విజయ్) ఓ ఫుడ్ డెలివరీ బోయ్. తనది చాలా సాధారణమైన జీవితం. నటుడు కావాలనుకుంటాడు. ఓ పక్క ఉద్యోగం చేసుకుంటూనే... మరో వైపు ఆడిషన్స్‌కి వెళ్లడం, షార్ట్ ఫిల్మ్స్ లో నటించడం చేస్తుంటాడు. అనుకోకుండా ఓ రోజు రోడ్డు ప్రమాదంలో తను మరణిస్తాడు. విచిత్రంగా అదంతా కల. కాకపోతే... మరుసటి రోజు అదే కల.. నిజంగా రిపీట్ అవుతుంటుంది.
దుర్గ (అమలాపాల్) ఓ పోలీస్ ఆఫీసర్. తన స్టేషన్ పరిధిలో వరుసగా కిడ్నాపులు జరుగుతుంటాయి. వరుణ్ అనే ఐదేళ్ల పిల్లాడిని కిడ్నాప్ చేసి, పాతిక లక్షలు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరిస్తుంటారు అగంతకులు. ఆ కేసు చిక్కుముడి ఎప్పటికీ వీడదు. తాను కూడా ఓ రోడ్డు ప్రమాదంలో మరణిస్తుంది. అయితే ఇదంతా కల. ఆదికి జరిగినట్టే.. దుర్గకి కూడా కల రిపీట్ అవుతుంటుంది. మరి అభి, దుర్గ ఎలా కలుసుకున్నారు? టైమ్ లూప్ లో పడిన వీరిద్దరూ తమ కలని, వాస్తవ జీవితాన్నీ ఎలా మార్చుకున్నారు? అన్నదే కాన్సెప్ట్.
*విశ్లేషణ
టైమ్ లూప్ కాన్సెప్టుతో హాలీవుడ్ లో చాలా సినిమాలొచ్చాయి. ఏ డే (2017), గ్రౌండాగ్ డే (1993)లో వచ్చిన సినిమాలు ఇంచుమించుగా ఇదే కాన్సెప్ట్ తో సాగాయి. అయితే ఆ కథల్ని.. మనదైన వాతావరణంలో మార్చుకోగలిగారు. హాలీవుడ్ చిత్రాల స్ఫూర్తి ఉన్నా - పవన్ కుమార్ ఈ కథని కొత్తగా మలుచుకోగలిగాడు. స్థూలంగా చెప్పాలనుకుంటే.. ఒకే రోజులో ఇద్దరు ఇరుక్కుపోవడం. అదే రోజు.. రిపీట్ అవ్వడం ఈ సినిఆమ కథ. ఇలాంటి కథలు.. తెలుగులో చాలా కొత్త. కాబట్టి... మనవాళ్లు థ్రిల్ ఫీల్ అవ్వొచ్చు. తొలి రెండు ఎపిసోడ్లూ చాలా గ్రిప్పింగ్ గా సాగుతాయి. ఆ తరవాత... చూపించిందే చూపిస్తుంటాడు దర్శకుడు. జరిగిందే మళ్లీ జరగడమే ఈ కథ కాన్సెప్ట్ కాబట్టి.. ఆ లోపాన్ని భరించాల్సిందే. అయితే ప్రతీ ఎపిసోడ్ లోనూ ఓ కొత్త ట్విస్టు చేర్చుకుంటూ పోయాడు. పార్వతి ప్రెగ్నెన్సీ ట్రాక్, రాహుల్ కిడ్నాప్, ఫారుక్ యాక్సిడెంట్... ఈ కథలో ఉపకథలు. వీటిలో పార్వతి ఎపిసోడ్ మాత్రమే కాస్త ఇబ్బందిగా సాగుతుంటుంది.
నిజానికి ఇలాంటి కథలు డీల్ చేయడం చాలా కష్టం. స్క్రిప్టు పకడ్బందీగా రాసుకోకపోతే దొరికేస్తారు. కానీ... పవన్ కుమార్ ఆ తప్పు చేయలేదు. వీలైనంత వరకూ ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయడానికే ప్రయత్నించాడు. సాధారణంగా తెలుగులో వెబ్ సిరీస్‌లంటే.. బూతు కంటెంట్ తో నింపేస్తున్నారు. సహజత్వం పేరుతో వీలైనంత హింస, శృంగారం చూపిస్తున్నారు. వాటికి `కుడి ఎడమైతే` దూరంగా ఉండడం అభినందించదగిన విషయం. దుర్గ పాత్రకు ఫ్లాష్ బ్యాక్ ఉంది. అదేంటన్నది దాచారు. అలానే ఈ ప్రమాదాన్ని కళ్లారా చూసిన ఓ బిచ్చగాడికీ ఓ కథ ఉంది. అదీ... దాచేశారు. బహుశా.. సెకండ్ సీజన్ కోసం అనుకుంటా. మొత్తానికి తెలుగులో మంచి వెబ్ సిరీస్‌లు రావడం లేదన్న లోటుని.. కుడి ఎడమైతే తీర్చింది.
*నటీనటులు
రాహుల్ విజయ్ చాలా సహజంగా నటించాడు. తనకు మంచి భవిష్యత్తు ఉంది. కాకపోతే... మనకు తెలిసిన ఓ యువ హీరోని తీసుకుంటే ఇంకా బాగా ఎంగేజ్ అయ్యేవారు తెలుగు ప్రేక్షకులు. అమలాపాల్ దుర్గ గా రాణించింది. తనలో సీరియస్ నెస్, సిన్సియారిటీ రెండూ ఆ పాత్రలో కనిపించాయి. అయితే మిగిలిన ఏ పాత్రకూ పెద్దగా స్కోప్ లేదు. చాలా వరకూ తెలియని మొహాలే. బహుశా... తమిళంలోనూ ఈ వెబ్ సిరీస్ మార్కెట్ చేయడానికి అక్కడి వాళ్లని ఎక్కువగా తీసుకుని ఉంటారు.
* సాంకేతిక వర్గం
స్క్రీన్ ప్లే ఈ చిత్రానికి ప్రాణం. ట్విస్టులు ఉన్నాయి. వాటిని సరిగానే డీల్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. దర్శకుడి ప్రతిభేంటో.. యూటర్న్ తోనే ప్రేక్షకులకు అర్థమైంది. తనపై మరింత భరోసా కల్పించే ప్రయత్నమిది. 8 ఎపిసోడ్ల సిరీస్ ఇది. ఒకటి కత్తిరించి 7గా మార్చుకుని ఉంటే... మరింత షార్ప్ గా సాగేది. రిపీటెడ్ సీన్లు - జరిగిందే జరగడం - ఈ కథలో బలం. అప్పుడప్పుడూ అదే బలహీనతగా మారాయి.
*ప్లస్ పాయింట్స్
కాన్సెప్ట్
నటీనటులు
సాంకేతిక వర్గం
స్క్రీప్ ప్లే
*మైనస్ పాయింట్స్
రిపీటెడ్ సీన్లు
లెంగ్త్ ఎక్కువ
* ఫైనల్ వర్డిక్ట్: కుడి ఎడమైతే.. పొరపాటు లేదోయ్...