నటీనటులు : నాగ చైతన్య, సాయి పల్లవి, ఈశ్వరి రావు, రాజీవ్ కనకాల తదితరులు
దర్శకత్వం : శేఖర్ కమ్ముల
నిర్మాతలు : నారాయణ్ దాస్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్
సంగీతం : పవన్ .సి.హెచ్
సినిమాటోగ్రఫర్ : విజయ్ సి కుమార్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
రేటింగ్ : 3/5
శేఖర్ కమ్ముల సినిమాలపై ఓ ప్రత్యేకమైన గౌరవం ఉంది తెలుగు ప్రేక్షకులకు. క్లీన్ అండ్ నీట్ సినిమాలే తీస్తారాయన. ఆయన కథల్లో ఓ నిజాయతీ కనిపిస్తుంది. తెలుగుదనం కనిపిస్తుంది. మనుషులపై నమ్మకం, గౌరవం కనిపిస్తాయి. పాత్రల మధ్య సంఘర్షణని గొప్పగా తీర్చిదిద్దుతారు. చాలా చిన్న విషయాలే అయినా లోతుగా సృశిస్తారు. దాంతో ఆయన తెలుగు ప్రేక్షకులకు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయారు. ప్రేమకథల్ని తనదైన శైలిలో ఆవిష్కరించడం వల్ల ఇంకాస్త ఎక్కువ గుర్తింపు దక్కింది.
ఫిదాతో ఆయన మ్యాజిక్ మళ్లీ తెలిసొచ్చింది. ఇప్పుడు అందరి కళ్లూ `లవ్ స్టోరీ`పై పడ్డాయి. లాక్ డౌన్‌కి ముందే విడుదల కావల్సిన సినిమా ఇది. పలుమార్లు విడుదల తేదీ వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు... ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాయి పల్లవి కథానాయిక కావడం, నాగచైతన్య కొత్తగా కనిపిస్తుండడం, ఇప్పటికే పాటలకు మంచి ఆదరణ లభించడంతో, `లవ్ స్టోరీ`పై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? శేఖర్ కమ్ముల ఏ వర్గాన్ని టార్గెట్ చేశారు? ఎవరిని మెప్పిస్తుంది?
* కథ
రేవంత్ (నాగచైతన్య) ఓ లోయర్ మిడిల్ క్లాస్ అబ్బాయి. జుంబా డాన్స్ అంటే తనకు చాలా ఇష్టం. ఓ మారు మూల ప్రాంతం నుంచి హైదరాబాద్ వచ్చి కోచింగ్ సెంటర్ తెరుస్తాడు. మరోవైపు మౌనిక (సాయిపల్లవి) కూడా హైదరాబాద్ వస్తుంది. తను బీటెక్ పూర్తి చేసింది. ఉన్నత కుటుంబానికి చెందిన అమ్మాయి. హైదరాబాద్ లో ఓ ఉద్యోగం సంపాదించి, తన కాళ్లపై తాను నిలబడాలనుకుంటుంది. మరి రేవంత్, మౌనిలు ఎలా కలిశారు? వాళ్ల మధ్య ప్రేమ ఎలా చిగురించింది? ఆ ప్రేమకు ఎలాంటి అడ్డుగోడలు ఎదురయ్యాయి? వాటి నుంచి ఇద్దరూ ఎలా బయటపడ్డారు? అనేదే కథ.
* విశ్లేషణ
శేఖర్ కమ్ముల కథలెప్పుడూ నేల విడచి సాము చేయవు. భయంకరమైన ట్విస్టులేం ఉండవు. సినిమాటిక్ అప్రోచ్ ఉండదు. కాబట్టి.. అవి కొత్తగా లేకపోయినా సహజంగా కనిపిస్తాయి. ఈసారీ అలాంటి కథే ఎంచుకున్నాడు. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ఇద్దరు ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా సాగుతుంది. వాళ్ల ప్రేమకొచ్చిన అవాంతరాల నేపథ్యంలో నడుస్తుంది. ప్రధాన పాత్రల పరిచయం, వాళ్లని హైదరాబాద్ తీసుకురావడం, ఎవరి దారుల్లో వాళ్లు ఎదిగే ప్రయత్నం చేయడం.. ఇలాంటి సన్నివేశాలతో సరదాగానే మొదలైంది సినిమా. సాయి పల్లవి ఇంటర్వ్యూ సీన్ అయితే కాస్త నవ్విస్తుంది. రేవంత్, మౌనికలను పరిచయం చేసే సీన్, వాళ్ల మధ్య సన్నివేశాలు... వింటేజ్ శేఖర్ కమ్ముల సినిమాల అనుభూతుల్ని ఇస్తాయి. మంచి పాటలు పడడంతో.. ఫస్టాఫ్ ఎలాంటి గందరగోళం లేకుండా సాగిపోతుంది.
ద్వితీయార్థంలో కథ సీరియస్ టర్న్ తీసుకుంటుంది. అక్కడి నుంచి లక్ష్యాలు, గోలలు మొదలవుతాయి. కుల వివక్షతనీ, లింగ వివక్షతనీ... ఈ రెండు పాయింట్లనీ శేఖర్ కమ్ముల రెండు ప్రధాన పాత్రలపై వేశాడు. అయితే ఇవన్నీ ఇది వరకటి సినిమాల్లో చూసిన అంశాలే కావడంతో కొత్తదనం ఏమీ అనిపించదు. పతాక సన్నివేశాలు మరీ హెవీగా అనిపిస్తాయి. ఓ మంచి లవ్ స్టోరీలో, ప్రశాంతంగా సాగే ప్రేమకథలో.. ఇవన్నీ పంటికింద రాళ్లలా తగులుతుంటాయి. అయితే దర్శకుడు చెప్పాలనుకున్న ఉద్దేశం అదే కాబట్టి, ఆయా సన్నివేశాల్ని భరించాలి. దర్శకుడి పాయింట్ కుటుంబ ప్రేక్షకులకు చేరువ అయినా, యూత్ కి తలనొప్పి వ్యవహారంలానే అనిపిస్తుంది. పైగా శేఖర్ కమ్ముల సినిమాలు చాలా స్లో ఫేజ్‌లో సాగుతాయి. దాంతో ఇంకాస్త నీరసం ఆవహిస్తుంది.
ట్రిమ్ చేసుకోవాల్సిన వ్యవహారాలు తెరపై చాలా కనిపిస్తాయి. హీరో - హీరోయిన్ల కెమిస్ట్రీ.. ఏ ప్రేమకథకైనా బలం. ఈ సినిమాలో ఆ కెమిస్ట్రీ అంతగా పండలేదనిపిస్తుంది. తొలి సగంలో తప్పితే, ద్వితీయార్థంలో రిలాక్సింగ్ మూమెంట్సే ఉండవు. యూ ట్యూబ్ ని దున్నేసిన సారంగ దరియా పాట కూడా రాంగ్ ప్లేస్ మెంట్ అన్న భావన కలుగుతుంది. ఆ పాట వచ్చేటప్పటికే థియేటర్ మొత్తాన్ని నీరసం ఆవహిస్తుంది.
* నటీనటులు
నాగచైతన్య, సాయి పల్లవి ఇద్దరూ తమ భుజాలపై వేసుకుని ఈ సినిమాని నడిపించారు. నాగచైతన్యకు ఇది కొత్త తరహా పాత్ర. తెలంగాణ అబ్బాయిగా చక్కగా ఇమిడిపోయాడు. శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోలంతా కొత్తగా కనిపిస్తుంటారు. చైతూ కూడా అంతే. సాయి పల్లవికి ఇదేం కొత్త తరహా పాత్రేం కాదు. ఫిదా మాదిరే. తను అల్లుకుపోయింది. డాన్సుల్లో అయితే.. చైతూని కనిపించనివ్వకుండా చేసేసింది. రాజీవ్ కనకాలని ఈ తరహా పాత్రలో ఇది వరకు చూసి ఉండరు. ఉత్తేజ్ తనకిచ్చిన చిన్న పాత్రలోనే. తనదైన ముద్ర వేసేశాడు. ఈశ్వరీ రావుకి సైతం మంచి పాత్ర పడింది.
* సాంకేతిక వర్గం
ఈ సినిమా విడుదల అవ్వక ముందే మ్యూజికల్ హిట్. సారంగ దరియా పాట కోసం థియేటర్ మొత్తం ఎదురు చూస్తూనే ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ప్లజెంట్ గా ఉంది. కెమెరా వర్క్ గురించి చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ వాతావరణాన్ని ప్రతిబింబించింది. శేఖర్ కమ్ముల స్టైల్ సంభాషణలు చాలా చోట్ల మెరుస్తాయి. కానీ... కథ, కథనాల్లో బలం లేదు. పాత పాయింటే మళ్లీ తిప్పి తిప్పి కొట్టాడు. తన గత సినిమాల ఛాయలు చాలా చోట్ల కనిపిస్తాయి. క్లైమాక్స్ భరించడం కష్టమే.
* ప్లస్ పాయింట్స్
పాటలు
హీరో, హీరోయిన్లు
ప్రధమార్థం
* మైనస్ పాయింట్స్
ద్వితీయార్థం
స్లో నేరేషన్
* ఫైనల్ వర్డిక్ట్: శేఖర్ కమ్ముల మ్యాజిక్...