తారాగణం: రాజ్ తరుణ్, రిద్ధి కుమార్, రాజీవ్ కనకాల, అజయ్ & తదితరులు
నిర్మాణ సంస్థ: శ్రీ వేంకటేశ్వర్ క్రియేషన్స్
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
నిర్మాత: దిల్ రాజు
రచన-దర్శకత్వం: అనీష్ కృష్ణ
రేటింగ్: 2.75/5
ప్రేమకథల్లో ఓ మాయ ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా వినడానికి, చూడ్డానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉంటారు. పైగా... యువతరానికి బాగా కనెక్ట్ అయ్యే పాయింటు. థియేటర్‌కి వచ్చేది వాళ్లే కాబట్టి.. మినిమం గ్యారెంటీ ఉంటుంది. అయితే..ఆ ప్రేమకథలో మనం ఏయే అంశాలు మిక్స్ చేస్తున్నామనేది ప్రధానం. వినోదం, కుటుంబ నేపథ్యం, నాయికానాయకుల కెమిస్ట్రీ లవ్ స్టోరీలకు మూలం. అవి ఉంటే చాలు. సినిమా నిలబడుతుంది. దానికి కాస్త క్రైమ్ నేపథ్యం జోడించి ఇంకాస్త బలం చేకూర్ చేప్రయత్నం చేశాడు అనీష్ కృష్ణ. అదే... 'లవర్'. మరి ఈ మేళవింపు ఎలా ఉంది? వరుస ఫ్లాపుల్లో ఉన్న రాజ్‌తరుణ్‌ని ఈ 'లవర్' గట్టెక్కిస్తుందా? వరుస విజయాల్లో ఉన్న దిల్‌రాజుకి మరో హిట్ ఇస్తుందా?
* కథ
రాజ్ (రాజ్‌తరుణ్) ఒక అనాథ. వృత్తి రీత్యా బైక్ మెకానిక్. జగ్గు (రాజీవ్ కనకాల)ని సొంత అన్నయ్యలా భావిస్తాడు. ఓ హాస్పిటల్‌లో నర్స్‌గా పనిచేస్తున్న చరిత (రిద్ధి కుమార్)ని చూసి ప్రేమిస్తాడు రాజ్. చివరికి ఆమె మనసుని ఎలాగోలా చేజిక్కించుకుంటాడు. వీరిద్దరూ పెళ్లికి సిద్ధమైన తరుణంలో సడన్‌గా చరిత మాయం అవుతుంది. చరితతో పాటు జగ్గు కూడా కనిపించకుండా పోతాడు. చరితని కిడ్నాప్ చేసింది ఓ మెడికల్ మాఫియా ముఠా అన్న సంగతి అర్థమవుతుంది. మరి ఈ మాఫియాకీ చరితకీ సంబంధం ఏమిటి? ఆ ముఠా చేతుల్లోంచి చరితని ఎలా కాపాడుకున్నాడు? అనేదే `లవర్` కథ.
* నటీనటులు
రాజ్ తరుణ్‌లో ఈజ్ ఏమాత్రం తగ్గలేదు. వరుస ఫ్లాపుల తరవాత చేసిన సినిమా కదా, ఇంకాస్త జాగ్రత్త పడినట్టు అర్థం అవుతుంది. అతని గెటప్ కూడా కొత్తగా అనిపిస్తుంది.
రిద్ది కుమార్‌కి ఇదే తొలి సినిమా. తెరపై చాలా అందంగా కనిపించింది. తనకీ కొన్ని అవకాశాలు రావొచ్చు.
రాజీవ్ కనకాల మరోసారి మంచి మార్కులు కొట్టేస్తాడు. అజయ్, సుబ్బరాజు, సచిన్ ఖేడ్కర్ ప్రతినాయక బృందంలో కనిపించారు. వాళ్లు కూడా తమ అనుభవాన్ని రంగరించారు.
* విశ్లేషణ
'లవర్' అని పేరు పెట్టినా.. నిజానికి ఇందులో ప్రేమ కంటే, క్రైమ్, మాఫియా, యాక్షన్ అంశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే వాటి మేళవింపు ఆకట్టుకొంటుంది కాబట్టి... 'లవర్' బాక్సాఫీసు దగ్గర పాస్ అయిపోయే అవకాశాలే ఎక్కువ. తొలి సగాన్ని పాత్రల పరిచయం, ప్రేమకథకు కేటాయించాడు దర్శకుడు.
హీరో, హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు, చరితని ప్రేమలో పడేయడానికి రాజ్ చేసే ప్రయత్నాలు ఇవన్నీ రొటీన్‌గానే అనిపిస్తాయి. పైగా కామెడీ కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. పాటలు బాగుండడం, కెమెరా వర్క్ ప్లెజెంట్‌గా కనిపించడంతో సాదా సీదా సన్నివేశాన్ని కూడా చూడలగులుతాం. ద్వితీయార్థంలో ట్విస్టులూ, టర్న్‌లూ కనిపించాయి. అక్కడి నుంచి సినిమా యాక్షన్ మూడ్‌లో సాగుతుంది. నిజానికి క్రైమ్ అనే ఎలిమెంట్, ఈ ఛేజింగులూ లేకపోతే.... 'లవర్' కథ రాజ్ తరుణ్ కెరీర్‌లో మరో డిజాస్టర్‌గా మిగిలిపోదును.
ప్రధమార్థాన్ని సో..సోగా లాగించేసిన అనీష్‌కృష్ణ... సెకండాఫ్‌కి వచ్చేసరికి జాగ్రత్త పడిపోయాడు. ప్రతీ సీన్ కట్టుదిట్టంగా రాసుకోవడంతో... ప్రేక్షకుడు థియేటర్లో కూర్చోగలిగాడు. దిల్‌రాజు బ్యానర్ నుంచి వచ్చే సినిమాలన్నీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లే. అలాంటి సన్నివేశాలకూ ఈ కథలో చోటు ఇవ్వడం, నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉండడంతో `లవర్`.. నిలబడిపోతాడు. తొలి సగం రొటీన్ గా అనిపించినా.. రెండో సగం బలంగా నిలవడంతో.. సాధారణ సినిమా కాస్త యావరేజ్ మైలు రాయి దగ్గర ఆగగలిగింది.
* సాంకేతికత వర్గం పనితీరు
సినిమా చాలా రిచ్‌గా ఉంది. కెమెరా వర్క్ అయితే... నూటికి నూరు మార్కులూ అందుకుంటుంది. అనంతపూర్‌ని కూడా చాలా అందంగా చూపించారు. కేరళ అందాలు ఆకట్టుకుంటాయి. యాక్షన్ సన్నివేశాలు మాస్‌కి నచ్చుతాయి. ప్రధమార్థంలో తడబడిన అనీష్.. ద్వితీయార్థానికి వచ్చేసరికి జాగ్రత్తపడ్డాడు. కథకుడిగా తన బలం సెకండాఫ్‌లోనే కనిపించింది.
* ప్లస్ పాయింట్స్
+ సెకండాఫ్
+ పాటలు
+ ప్రొడక్షన్ వాల్యూస్
* మైనస్ పాయింట్స్
- రొటీన్ కథ
- ఫస్ట్ ఆఫ్
* ఫైనల్‌వర్డిక్ట్: 'లవర్'... ఓసారి చూడొచ్చు.
రివ్యూ రాసింది శ్రీ