రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై ఎట్టకేలకు ఓ స్పష్టత వచ్చింది. రజనీకాంత్ నుంచి పొలిటికల్ సైరన్ మోగింది. 2021 ఎన్నికలలో తమ పార్టీ బరిలో దిగుతుందని ఓ స్పష్టమైన ప్రకటన ఇచ్చారు. అయితే.. తాను పదవి కోసం రాజకీయాల్లోకి రావడం లేదని, మార్పు కోసమే వస్తున్నానని - సీ.ఎం పదవి రేసులో తాను లేనని, తన స్థానంలో అర్హత ఉన్న ఓ అభ్యర్థిని నిలబెడతానని రజనీ చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తాను కేవలం పార్టీ అధ్యక్ష పదవికే పరిమితం అవుతానని రజనీ చెప్పడం - రాజకీయాలకు కొత్త నిర్వచనంలా అనిపిస్తోంది.
అంటే.. 2021 తమిళ నాడు ఎన్నికలలో రజనీకాంత్ పార్టీ పోటీ చేస్తుంది. కానీ.. ఆ పార్టీ గెలిచినా - రజనీ సీఎం అవ్వడు. నిజానికి ప్రజలు కోరుకుంటోంది ఇలాంటి మార్పే. పదవుల్ని త్యజించి, కేవలం నాయకత్వం వహించడానికి ముందుకొచ్చే నేతలు కావాలి. రజనీ మాటలు... అలాంటి మార్పు కోరుకుంటున్నవాళ్లందరికీ నచ్చుతాయి. ప్రజలకు సేవ చేయాలంటే, మార్పుకి నాంది పలకాలంటే చేతిలో పదవి ఉండక్కర్లేద్దన్న సంకేతాల్ని పంపుతున్నాడు రజనీ. ఇది నిజంగా ఆహ్వానించదగిన పరిణామం.
కానీ... అదంత తేలికైన విషయం కాదు. రజనీ పార్టీకి ఓటేసేది.... కేవలం రజనీకాంత్ పై నమ్మకంతోనే. రజనీని ముఖ్యమంత్రిగా చూడాలన్నది ఆయన అభిమానుల కల. తమిళ నాట రాజకీయాల్లో ఓ మార్పు రావాలని, దానికి రజనీకాంత్ నాంది పలకాలని వాళ్లు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. తీరా రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చి, పార్టీ పెట్టి, గెలిచాక - మరొకరిని ముఖ్యమంత్రిగా చేస్తానంటే... అభిమానులు ఒప్పుకుంటారా? కేవలం రజనీ సిద్ధాంతాల్ని గెలిపించడానికి ఓట్లేస్తారా? పైగా రాజకీయాలు అంత తేలికైన విషయం కాదు. బరిలో దిగాక.. పరిస్థితులకు తలొగ్గాల్సిందే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించడమే నా లక్ష్యం - అది నెరవేరాక.. ఓ దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తా అని కేసీఆర్ చేసిన వాగ్దానం ఇప్పటికీ మర్చిపోలేం. అయితే... అది జరిగిందా? కేసీఆర్ లేని టీఆర్.ఎస్‌నీ, తెలంగాణ రాజకీయాల్ని ఊహించగలమా? రేపటి తమిళనాడు పరిస్థితీ అంతే. రజనీమాటలు కేవలం గెలిచేంత వరకేనా? గెలిచిన తరవాత కూడా ఇలానే మాట్లాడగలడా? అనేది ఇప్పుడే ఊహించలేం. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. కాకపోతే... రజనీ ఉద్దేశాలు, ఆలోచనలు, భావాలూ.. నిజంగా ఆచరణాత్మమైనవి. కాకపోతే... అమలే కష్టం.