కరోనా బీభత్సం మామూలుగా లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ విషవృక్షంలా వ్యాపిస్తోంది. కరోనా మరణాల సంఖ్య రోజు రోజుకీ ఎక్కువవుతోంది. దాంతో ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు ముమ్మరం చేశాయి. ఇప్పటికే క్రీడా మైదానాల్లో ప్రేక్షకుల్ని అనుమతించడం లేదు. ఐపీఎల్ లాంటి మెగా టోర్నీలే కరోనా బారీన పడ్డాయి. లెజెండ్స్ క్రికెట్ సిరీస్ అర్థాంతరంగా వాయిదా పడింది. భారత దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు సైతం టికెట్లు అమ్మడం లేదు. ఈ ప్రభావం ఇప్పుడు సినిమాకీ వ్యాపించింది. కేరళలో ఇప్పటికే థియేటర్లు మూత పడ్డాయి.
తెలుగు రాష్ట్రాలతోనూ కొన్ని చోట్ల థియేటర్లకు తాళాలు వేశారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ.. థియేటర్లన్నింటినీ తాత్కాలికంగా మూసి వేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. జనం ఒకే చోట గుమ్మిగూడడాన్ని ఆపాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. అందుకే క్రికెట్ మ్యాచ్‌లకు జనాన్ని అనుమతించడం లేదు. ఇప్పుడు థియేటర్లు, షాపింగు మాల్స్‌కీ ఇదే నిబంధన అన్వయించాలని చూస్తున్నారు.
త్వరలోనే ధియేటర్ల మూసి వేతకు సంబంధించి ఓ అధికారిక ప్రకటన రావొచ్చన్న సంకేతాలు వ్యక్తం అవుతున్నాయి. అదే జరిగితే చిత్రసీమకు అది ఊహించని దెబ్బే. ఎందుకంటే.. వేసవిలో అనేక సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. ఈ ఉగాదిన కూడా చాలా సినిమాలు వస్తున్నాయి. ఈ తరుణంలో థియేటర్లను మూసి వేస్తే నిర్మాతలు భారీ ఎత్తున నష్టపోవాల్సివస్తుంది.