తారాగణం: సుమంత్, ఆకాంక్ష సింగ్, మిర్చి కిరణ్
నిర్మాణ సంస్థ: స్వాధర్మ ఎంటర్టైన్మెంట్
సంగీతం: శ్రవణ్
ఛాయాగ్రహణం: సతీష్
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్క
రచన-దర్శకత్వం: గౌతమ్
యావరేజ్ యూజర్ రేటింగ్: 2.75/5
సుమంత్ ప్రయాణం ముందు నుంచీ 'స్లో.. అండ్ స్టడీ'గా సాగుతూనే ఉంది. రెగ్యులర్‌గా సినిమాలు చేయడంపై పెద్దగా దృష్టి పెట్టడు. తన కంఫర్ట్ జోన్ చూసుకుని, దానికి తగిన కథల్ని మాత్రమే ఎంచుకుంటాడు. ఫార్ములా మాస్ మసాలా సినిమాల్ని ఏనాడో వదిలేసిన సుమంత్... ఫీల్ గుడ్, ఎంటర్‌టైనర్‌లపై దృష్టి పెట్టాడు. ఆ జోనర్‌లో తనకు విజయాలు కూడా వచ్చాయి. అదే నమ్మకంతో చేసిన మరో ప్రయత్నం 'మళ్ళీ రావా'. 'పెళ్ళీ చూపులు', 'మెంటల్ మదిలో'... ఇలా చిన్న సినిమాలు, సున్నితమైన కథా చిత్రాలు విజయవంతమవుతుండడంతో... 'మళ్ళీ రావా'పై ఆశలు పెరిగాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? 'నరుడా డోనరుడా' సినిమాతో చాలా గట్టి దెబ్బ తిన్న సుమంత్... ఈ సినిమాతో కోలుకున్నాడా, లేదా??
* కథ..
రాజోలులో తొమ్మిదో తరగతి చదువుతుంటాడు కార్తీక్ (సుమంత్). అదే స్కూలులో కొత్తగా జాయిన్ అవుతుంది అంజలి (ఆకాంక్ష సింగ్). అంజలి అమ్మానాన్నలు చీటికీ మాటికీ గొడవ పడుతుంటారు. ఆ దశలో కార్తిక్ చూపించిన కేరింగ్ చూసి తనని ఇష్టపడుతుంది. కార్తీక్ తొలి చూపులోనే అంజలిని ఇష్టపడతాడు. కానీ అనుకోనికారణాల వల్ల... ఆ వయసులోనే విడిపోతారు. మళ్లీ పదమూడేళ్లకు హైదరాబాద్లో కలుస్తారు. అప్పటికీ ఒకరిపై మరొకరికి ఇష్టం, ప్రేమ ఉంటాయి. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. ఆరోజున 'నాకీ పెళ్లి ఇష్టం లేదు' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అంజలి. సడన్‌గా అంజలి అలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటి? వీరిద్దరూ మళ్లీ ఎప్పుడు కలుసుకున్నారు? కలుస్తూ, విడిపోతూ, మళ్లీ కలుస్తూ సాగిన ఈ ప్రయాణం చివరికి ఏమైంది?? అనేదే కథ.
* నటీనటుల ప్రతిభ..
సుమంత్‌కి ఈ తరహా పాత్రలు కొత్తేం కాదు. కొట్టిన పిండే. మరోసారి తనకు అలవాటైన నటనే ప్రదర్శించాడు. తన నటనలో మెచ్యూరిటీ కనిపించింది.
ఆకాంక్ష సింగ్ మరీ అద్భుతంగా లేదు గానీ, ఫర్వాలేదనిపిస్తుంది. ఆకాంక్ష కంటే, స్కూల్‌డేస్‌లో కనిపించిన అమ్మాయే మరింత అందంగా కనిపించింది.
ఆఫీస్ స్టాఫ్ కనిపించినవాళ్లు, సుమంత్ ఫ్రెండ్‌గా నటించిన వాళ్లు అంతా కొత్త వాళ్లే. అయినా ఆ లోటేం తెలియకుండా తమ తమ పాత్రల మేర రాణించేశారు. చాలా రోజుల తరవాత అన్నపూర్ణకు మంచి పాత్ర దక్కింది.
* విశ్లేషణ..
ఓ ప్రేమ జంట కలుసుకోవడం, మళ్లీ విడిపోవడం, మళ్లీ కలుసుకోవడం - ఇదే మళ్లీ రావా కథ! మళ్లీ మళ్లీ కలుసుకోవడానీ, విడిపోవడానికి విధి ఎలా సహాయం చేసింది అనే విషయాన్ని చాలా పొయెటిక్‌గా చెప్పడానికి ప్రయత్నించాడు దర్శకుడు. కథ మామూలుగానే ఉన్నా.. కథనం విషయంలో కాస్త జాగ్రత్త తీసుకున్నాడు దర్శకుడు. మూడు దశల్లో సాగే కథ ఇది. ఆ మూడు దశలన్నీ పార్టు పార్టులుగా విడగొట్టి.. స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ చేశాడు. చిన్నప్పటి ఎపిసోడ్ నడుస్తున్నప్పుడు కథ... ప్రస్తుతానికి వచ్చేస్తుంది. ప్రస్తుతం చెబుతూ కథ సడన్‌గా ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తుంది.
సాధారణంగా ఇది అందరూ చేసే జిమ్మిక్కే అయినా... కథలో మరో దశ కూడా ఉండడంతో ఈ స్క్రీన్ ప్లే ఆసక్తిగా తయారైంది. కాకపోతే అక్కడే గందరగోళం కూడా ఉంది. సడన్‌గా వచ్చే ఈ జంపింగ్‌లు కథా గమనానికి కాస్త అడ్డు తగిలినట్టు అనిపిస్తాయి. ఇదే కథని స్ట్రయిట్ నేరేషన్‌గానూ చెప్పొచ్చు. అలా చెబితే... మరీ సీరియెల్ అయిపోతుందేమో అనే భయంతో దర్శకుడు ఈ స్క్రీన్ ప్లేని నమ్ముకున్నాడేమో అనిపిస్తుంది. చిన్నప్పటి ఎపిసోడ్లు బాగానే ఉన్నా.. మరీ తొమ్మిదో తరగతిలోనే ప్రేమేంటి?? అనే సందేహం వస్తుంది. మూడు దశల్లోనూ ఏం ఏం జరిగిందన్న విషయంలో ముందే ఓ క్లారిటీ వచ్చేస్తుంది. దాంతో అనుకోని సంఘటనలు, ట్విస్టులూ ఏం ఎదురుకావు. అలా... సినిమా మొత్తం ఒకే ఫేజ్‌లో సాగిపోతుంది. పాటలంటూ ప్రత్యేకంగా ఉండవు. కథలోనే వస్తుంటాయి. కమర్షియల్ ఎలిమెంట్స్‌కి చోటే లేదు. అక్కడక్కడ.. ఆఫీస్ లో జోకులు పేలాయి. అయితే ఈ కథని ముగించిన విధానం ఆకట్టుకుంటుంది. రొటీన్‌గా హీరో, హీరోయిన్లను కలపకుండా.. టైటిల్‌కి అక్కడ కూడా జస్టిఫికేషన్ చేసేలా శుభం కార్డు వేశాడు దర్శకుడు.
* సాంకేతిక వర్గం..
రచయితగా దర్శకుడు సక్సెస్ అయ్యాడు. దర్శకుడిగా కాస్త తడబడ్డాడు. ఏది ఎంతలో చెప్పాలో తెలీక.. చాలా చాలా చెప్పేసి, లెంగ్త్ ఎక్కువ చేసుకున్నాడు. పాటలు హాయిగా ఉన్నాయి. అనవసరంగా వచ్చి పడిపోయే డ్యూయెట్లేం ఈ సినిమాలో కనిపించవు. చిన్న సినిమా అయినా మేకింగ్ పరంగా నీట్ గా ఉంది. నేపథ్య సంగీతం కథని, మూడ్‌ని ఎలివేట్ చేశాయి.
* ప్లస్ పాయింట్స్
+ పాటలు
+ ఎమోషన్స్
* మైనస్ పాయింట్స్
- మల్టీప్లెక్స్‌కి మాత్రమే నచ్చే సినిమా
- లెంగ్త్
* ఫైనల్ వర్డిక్ట్: మళ్ళీ రావా - ఓ ఫీల్ గుడ్ మూవీ
రివ్యూ బై శ్రీ