తారాగణం: ప్రభుదేవా, సనంత్, ఇందూజ, దీపక్ పరమేష్, శశాంక్ పురుషోత్తం, అనీష్ పద్మనాభన్ తదితరులు.
నిర్మాణ సంస్థ: పెన్ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్
సంగీతం: సంతోష్ నారాయణన్
ఎడిటర్: వివేక్ హర్షన్
ఛాయాగ్రహణం: ఎస్. తిరునవుక్కరసు
నిర్మాతలు: కార్తికేయన్ సంతానం & జయంతిలాల్ గాదా
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్
రేటింగ్: 2.75/5
మాటలు లేకుండా ఓ సినిమా తీయడం అంటే మాటలు కాదు. చిన్న సన్నివేశాన్ని ఒక్క మాట కూడా లేకుండా పూర్తి చేయడం చాలా కష్టం. అలాంటిది ఏకంగా సినిమానే తీయడమంటే.. అద్భుతమే. 30 ఏళ్ల క్రితం ఇలాంటి అద్భుతాన్ని ఆవిష్కరించారు సింగీతం శ్రీనివాసరావు. పుష్షకవిమానంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు మళ్లీ అలాంటి ప్రయోగం జరిగింది. మెర్క్యూరీతో. పుష్షక విమానం ఓ వినోదాత్మక చిత్రమైతే... మెర్య్కూరీ ఓ థ్రిల్లర్. అంతే తేడా.
* కథ
అయిదుగురు స్నేహితులు. వాళ్లంతా మూగవాళ్లు. వినిపించదు కూడా. అనుకోకుండా ఓ యాక్సిడెంట్ చేస్తారు. ఆ ప్రమాదంలో ఓ వ్యక్తి (ప్రభుదేవా )చనిపోతాడు. ఆ శవాన్ని ఓ పాడుబడ్డ ఫ్యాక్టరీలో పాతిపెట్టి వచ్చేస్తారు. అయితే ఆ కంగారులో ఓ వస్తువు అక్కడే పారేసుకుంటారు. అది దొరికితే.. తామంతా పట్టుపడిపోతామన్న భయంతో ఆ వస్తువు కోసం మళ్లీ ఆ ఫ్యాక్టరీ దగ్గరకు వెళ్తారు. తీరా చూస్తే.. పాతిపెట్టిన శవం కూడా మాయమవుతుంది. అక్కడి నుంచి ఈ అయిదుగురులో ఒకొక్కరూ హత్యకు గురవుతారు. ఎందుకు, ఏమిటి, ఎలా? అనేదే కథ.
* నటీనటులు
తెరపై కనిపించిన వాళ్లంతా కొత్తవాళ్లే. వాళ్లందరి నటనా ఆకట్టుకుంది. అయితే ప్రభుదేవా మాత్రం ఆశ్చర్యపరుస్తాడు.
ఇలాంటి పాత్రలో ప్రభుదేవాని ఇది వరకు చూసి ఉండరు. వినికిడి శక్తిని ఉపయోగించుకుంటూ.. తన పగ తీర్చుకునే క్రమంలో ప్రభుదేవా నటన.. ఆకట్టుకుంటుంది. నివేథా థామస్ ఓ చిన్న పాత్రలో కనిపించింది.
* విశ్లేషణ
మాటలు లేకుండా ఓ సినిమా తీద్దామన్న ప్రయత్నాన్ని ముందు అభినందించాలి. ఎందుకంటే అదంతా సర్వసాధారణమైన విషయం కాదు. రెండుగంటల పాటు ఒక్క డైలాగ్ కూడా వినిపించకుండా, అసలు డైలాగ్ అవసరం లేకుండా జాగ్రత్త పడాలి. అలా చేయాలంటే కట్టుదిట్టమైన స్క్రిప్టు కావాలి. స్క్రీన్‌ప్లే బాగా రాసుకోవాలి. కార్తీక్ సుబ్బరాజ్ ఈ విషయంలో విజయవంతమయ్యాడనే అనుకోవాలి. ప్రధాన పాత్రధారులంతా మూగవాళ్లే కాబట్టి.. తన పని కాస్త సులభం అయ్యింది. సినిమా మొదలైన కాసేపటికే వీళ్లంతా మూగవాళ్లని అర్థమైపోతుంది.
ఒకట్రెండు సన్నివేశాల్లో వాళ్ల భాష. మూగ సైగలు అర్థం చేసుకోవడం కష్టం. కానీ క్రమంగా అలవాటైపోతుంది. బేసిగ్గా ఇదో హారర్. అయితే దెయ్యానికి ఏవో అతీత శక్తులున్నట్టు చూపించలేదు. దెయ్యం కూడా మామూలు మనిషిలానే పగ తీర్చుకుంటుంది. అయితే ఇక్కడ ఈ దెయ్యానికి కళ్లుండవు. చెవులు మాత్రం బాగా పనిచేస్తాయి. ఆ దెయ్యం నుంచి మాటలు రాని, వినిపించని వాళ్లు ఎలా తప్పుకున్నారన్నది ఆసక్తికరం. ఇందుకు సంబంధించిన సన్నివేశాల్ని దర్శకుడు ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దారు.
అయితే హారర్ ఎలిమెంట్స్ చాలా తక్కువ. దెయ్యానికి కళ్లు లేవు అని చెప్పడానికి దర్శకుడు కాస్త సమయం తీసుకున్నాడు. కళ్లు లేకుండా ఇద్దరిని ఎలా చంపింది? అనే డౌటు కూడా వస్తుంది. పతాక సన్నివేశాలు మాత్రం ఆకట్టుకుంటాయి. వాటిని హృదయానికి హత్తుకునేలా మలిచాడు. ఓ హారర్, థ్రిల్లర్ సినిమాకి ఇలాంటి ముగింపు ఊహించరు కూడా.
* సాంకేతిక వర్గం
సంతోష్ నారాయణ్ నేపథ్య సంగీతం ఈ చిత్రానికి మరో బలం. సైలెంట్ సినిమాల్లో ఆర్.ఆర్‌కి చాలా స్కోప్ ఉంటుంది. దాన్ని బాగా వాడుకున్నాడు. కెమెరా వర్క్ సింప్లీ సూపర్ అని చెప్పాలి. మంచు పొగల నేపథ్యంలో... నీడలాంటి ఓ షాట్.. కెమెరామెన్ పనితీరుకి నిదర్శనంగా నిలుస్తుంది. నిడివి పరంగా చాలా చిన్న సినిమా ఇది. ఇలాంటి సినిమాల్ని ఇంత తొందరగా ముగిస్తేనే మంచిది కూడా. కార్తీక్ సుబ్బరాజు చేసిన ప్రయత్నం బాగుంది. కాకపోతే.. మూకీ సినిమా అనగానే జనాలు ఏదో ఊహించి వెళ్తారు. హారర్ ఎలిమెంట్స్ చాలా తక్కువగాఉన్నాయి. కొన్ని లాజిక్కులు మిస్సయ్యాడు కూడా.
* ప్లస్ పాయింట్స్
ప్రభుదేవా నటన
నేపథ్య సంగీతం
క్లైమాక్స్
నిడివి
* మైనస్ పాయింట్స్
లాజిక్కులు మిస్సింగ్
థ్రిల్ తగ్గింది
* ఫైనల్ వర్డిక్ట్: మెర్క్యూరీ... ప్రయత్నం వరకూ ఓకే!!