Pakka Commercial Review: పక్కా కమర్షియల్ మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

నటీనటులు: గోపీచంద్, రాశి ఖన్నా, సత్యరాజ్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, శ్రీనివాస్ రెడ్డి, అనసూయ భరద్వాజ్ తదితరులు
దర్శకత్వం: మారుతి
నిర్మాతలు: బన్నీ వాస్, ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణా రెడ్డి
సంగీత దర్శకుడు: జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీ: కర్మ్ చావ్లా
ఎడిటర్: ఎస్ బి ఉద్ధవ్


రేటింగ్ : 2.5/5


మారుతి కాన్సెప్ట్ లు బావుంటాయి. హీరోకి ఒక క్యారెక్టర్ రాసుకొని ఆ క్యారెక్టర్ తోనే కథని ముందుకు నడిపిస్తాడు. ఇలా వచ్చిన' భలే భలే మగాడివోయ్, మహానుబావుడు సినిమాలు కమర్షియల్ విజయం సాధించాయి. ఈసారికి ఏకంగా 'పక్కా కమర్షియల్'అనే పాయింట్ తీసుకొని అదే టైటిల్ తో సినిమా చేశాడు మారుతి. గోపిచంద్ లాంటి మాచో హీరోతో పాటు గీతా 2 బ్యానర్ వుండటం సహజంగానే ఆసక్తిని పెంచింది. మరి మారుతి ఎంచుకున్నా 'పక్కా కమర్షియల్' పాయింట్ ప్రేక్షకులని అలరించిందా ? అసలు ఏమిటా పక్కా కమర్షియల్ కథ ? 


కథ:


సూర్య నారాయణ (సత్యరాజ్) న్యాయమూర్తి. వివేక్ వర్ధన్ ( రావు రమేష్) పరమనీచుడు. ఉద్యోగం కోసం వెళ్ళిన అమ్మాయిని శారీరకంగా లొంగదీసుకోవాలని చూస్తాడు. ఆ అమ్మాయి కోర్టులో కేసు వేస్తుంది. తన ధనబలంతో మంచి లాయర్ ని పెట్టుకొని తను అమాయకుడినని కోర్టులో నిరూపించుకుంటాడు వివేక్. ఈ కేసులో జడ్జ్ సూర్య నారాయణ అమ్మాయిని మందలిస్తూ యాబై వేల రూపాయిలు జరిమానా విధిస్తూ తీర్పుని ఇస్తాడు. ఒక అమాయకురాలకి శిక్ష వేసినందుకు క్రుంగిపోతాడు సూర్య నారాయణ. ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి యాబైవేలు ఇచ్చి తాను ఏమీ చేయాలేని స్థితిలో వున్నాని క్షమాపణలు కోరుతాడు. కోర్టులో న్యాయం చేయలేని మీకు ఆ నల్లకోటు ఎందుకు తీసేయండని చెబుతుందామ్మాయి. ఆ రోజే తనకు జరిగిన అన్యాయానికి క్రుంగిపోయి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంటుంది. సూర్య నారాయణ ఇచ్చిన తీర్పు వల్లే ఆ అమ్మాయి చనిపోయిందనే అపవాదు అతని మీద పడుతుంది. ఒక ఆడపిల్లకు న్యాయం చేయాలేని ఈ నల్లకోటు ఎందుకని సూర్యనారాయణ జడ్ట్ పదవికి రాజీనామ చేస్తాడు. సూర్య నారాయణ కొడుకు లక్కీ (గోపిచంద్) పెద్దవాడై క్రిమినల్ లాయర్ అవుతాడు. లక్కీ పక్కా కమర్షియల్. ఫీజులకి బదులు ఖరీదైన బహుమతులుగా విల్లాలు, కార్లు క్లైయింట్లనుండి లాగేస్తుంటాడు. కానీ తండ్రికి మాత్రం లక్కీ నాన్ కమర్షియల్, రూపాయి కూడా తీసుకోకుండా కేసు వాదిస్తాడని తెలుసు. తండ్రి రాజీనామాకి కారణమైన వివేక్ వర్షన్ కేసు ఒకటి లక్కీ దగ్గరికి వస్తుంది. అప్పుడు లక్కీ ఏం చేశాడు ? పక్కా కమర్షియల్ గా వెళ్ళడా ? లేదా రివెంజ్ తీర్చుకున్నాడా ? అనేది మిగతా కథ. 


విశ్లేషణ :


మారుతి పక్కా కమర్షియల్ డైరెక్టర్. కామెడీ ఎంటర్ టైనర్ లో రూపొందించడంలో అతడి లెక్క బావుంటుంది. ఐతే పక్కా కమర్షియల్ అని టైటిల్ పెట్టి తీసిన ఈ సినిమా విషయంలో మాత్రం మారుతి లెక్క దారుణంగా తప్పింది. కోర్టుని ఒక జబర్దస్త్ స్కిట్ సెట్ లా మార్చి కామెడీ చేయలనుకున్న మారుతి నవ్వులపాలయ్యాడు. ఇంత కథ చెప్పి కథలో హీరోయిన్ పాత్ర గురించి రాయలేదంటే అర్ధం చేసుకోవచ్చు. ఇది ఎంత బలహీనమైన కథో. అతి పురాతనమైన కథ ఇది. తండ్రికి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకునే కొడుకు. ఈ లైన్ తో వేల సినిమాలు వచ్చుంటాయి. పోనీ దిన్ని రివెంజ్ జోనర్ అనుకుంటే ట్రీట్మెంట్ అయినా కొత్తగా వుండాలి. అసలు ఈ కథకి ట్రీట్మెంట్ లేదు. హీరో పాత్ర పక్కా కమర్షియల్ అని చెప్పడానికి ఒక సీన్ చాలు. తర్వాత కథని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ దర్శకుడు మారుతి ఇంటర్వెల్ వరకూ అదే పాయింట్ ని చెబుతూ ప్రతి సీన్ లో హీరోని పరిచయం చేస్తూనే ఉంటాడు. ఈ గోల చాలదన్నట్టు సీరియల్ హీరోయిన్ లాయర్ ఝాన్సీగా రాశిఖన్నాని పరిచయం చేసి ఫస్ట్ అంతా ఒక డైలీ సీరియల్ లా నడిపించాడు.

కామెడీ చేయడం అంటే ప్రేక్షకుడిని నవ్వించడం. సహజంగా నవ్వుపుట్టాలి. టికెట్ కొని థియేటర్ లో అడుగుపెట్టిన పుణ్యానికి ప్రతి సీన్ లో సినిమా మేకింగ్ గురించి చెబుతుంటారు. డైలాగ్ పాతగా వుంది, అలా చెబితే క్లోజ్ జప్ పడుతుంది, ఇక్కడ పాట వేసుకోవాలి. ఇక్కడ బిల్డప్ షాటు.. ఇలా రాశి ఖన్నా అండ్ గ్యాంగ్ చేసిన కంగాళీతో ఇదేం గొడవరా బాబు అని ప్రేక్షకుడు తలపట్టుకునేలా చేశారు. సినిమా చూస్తున్నామని ప్రేక్షకుడికి తెలుసు. ఎదో ఒక ఎక్స్ పిరియన్స్ పొందడానికి థియేటర్ కి వస్తారు. కానీ ప్రతి సీన్ లో నువ్వు సినిమా చూస్తూన్నావ్ అని ప్రేక్షకుడి గుర్తు చేసేలా రాసిన సీన్లు, డైలాగులు వెగటుపుట్టిస్తాయి. కథలో ఎలాంటి మలుపు లేకుండానే పక్కా కమర్షియల్ అంటూనే ఇంటర్వెల్ వేశారు. ఈ ఇంటర్వెల్ లో కాస్త ఉపసమనం అనుకునే పాత్ర ఏదైనా ఉందా అంటే అది రావు రమేష్ పాత్ర. సెకండ్ హాఫ్ లో ఆయన ఎదో చేస్తాడనే చిన్న నమ్మకం.

సెకండ్ హాఫ్ మొదలైన కాసేపటికె ఈ సినిమాలో ఏమీ లేదనే సంగతి తెలిసిపోతుంది. పాత్రల నిర్మాణం ఎంత నిర్లక్ష్యంగా వుందంటే.. సూర్య నారాయణ ఒక సినియర్ జడ్జ్. కానీ అలాంటి పాత్ర ఒక జూనియర్ లాయర్ దగ్గరికి వెళ్లి కేసు ఎలా వాదించాలి, నీవేమైన సహాయం చేయగలవా ? అని అడుగుతాడు. సీరియల్ యాక్టర్ జడ్జ్ కి సెక్షన్స్ గురించి చెబుతుంటుంది. జడ్జ్  కేసు వాదించడానికి వెళ్ళినపుడు అతడికి లిప్ స్టిక్ రాసి ఒక పాట పాడుకుంటుంది. న్యాయదేవత కళ్ళు ముసుకున్నట్లు ప్రేక్షకుడు అలా కళ్ళు ముసుకొని చూడటం తప్పితే చేయడానికి ఏమీ లేదు. రాజీనామా చేసి కిరాణ కొట్టుపెట్టుకున్న జడ్జ్ ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ నల్లకోటు వేసుకొని అత్తగారింటికి వచ్చినట్లు కోర్టు వచ్చి డైరెక్టగా లాయర్ గా ఒక కేసుని వాదించేవచ్చా ? ప్రోసిజర్ ఏమీ వుండదా ? కోర్టు అంటే ఇంత నవ్వులాట? ఇంత ఫోర్స్డ్ కామెడీనా ? ఇలాంటి సీన్లు చూస్తున్నపుడు టన్నుల కొద్ది లాఫింగ్ కేసు వదిలినా పెదవి విచ్చుకోదు.

మారుతి హీరో పాత్రని కొత్తగా  డిజైన్ చేస్తుంటాడు. కానీ ఈ పాత్రని చాలా పాతగా డిజైన్ చేశాడు. హీరోకి పక్కా కమర్శియల్ లక్షణం పెట్టినపుడు ఆ కమర్షియల్ యాంగిల్ లోనే నెగ్గుకురావాలి. అతి పూరాతనమైన సినిమాల్లో చూపించినట్లు ''మా నాన్నకి జరిగిన అన్యాయానికి ప్రతికారం తీర్చుకోవడానికే ఇలా చేశా''అని హీరో చివర్లో డైలాగ్ కొట్టినట్లు.. క్లైమాక్స్ ని రాసుకోవడం అంత్యంత నిరాశజనం. ఈ కథలో అసలు సన్నివేశ బలం లేదు. సన్నివేష బలం లేనప్పుడు ఎన్ని వేషాలు వేసిన వర్క్ అవుట్ కాదు. సీన్ కి సీన్ కి మధ్య ఎమోషనల్ కనెక్షన్ వుండదు. పోనీ లాయర్ హీరో గొప్ప తెలివితేటలతో గెలుస్తాడా ? అంటే లేదు. హనీట్రాప్ చేసి విలన్ ని బోనులో నిలబెడతాడు. ఈ మాత్రం దానికి ఈ పాత్రని గోపిచంద్ చేయడం ఎందుకు ?

దర్శకుడు మారుతి ఎంత నిర్లక్ష్యంగా ఈ కథని డీల్ చేశాడంటే.. సూర్యనారాయణ పాత్ర వివేక్ ముందు నిలబడి ఎప్పటికైనా న్యాయదేవత ముందు నిన్ను దోషిగా నిలబెట్టి ఉరిశిక్ష వేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. లక్కీ హనీ ట్రాప్ చేసి వివేక్ ని బోనులో నిలబెడతాడు. ఇక్కడైన సూర్య నారాయణ ఎమోషన్ కి న్యాయం చేస్తూ జడ్జ్ తో ఉరిశిక్ష తీర్పు చెబితే ఒక మునిగింపు వుండేది. కానీ వివేక్ పాత్రే పిచ్చిపిచ్చిగా మాట్లాడి తనకుతానే శిక్ష వేసుకుంటాడు. బహుసా జాతిరత్నాలు లో బ్రహ్మనందం చెప్పిన డైలాగ్ కి ప్రేరణ పొంది ఈ క్లైమాక్స్ ని డిజైన్ చేశాడేమో మారుతి.

నటీనటులు:

గోపిచంద్ స్టయిలీస్ లాయర్ గా బావున్నాడు. లక్కీ పాత్రని చాలా సింపుల్ గా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. నిజానికి ఈ కథకు గోపిచంద్ అనవసరం. రాశిఖన్నా అందంగా కనిపించింది. రెండు సీన్లు తర్వాత ఆమె పాత్రలో మొనాటనీ వచ్చేస్తుంది. సత్యరాజ్ డీసెంట్ గా చేశారు. రావు రమేష్ పాత్ర హుషారుగా వుంటుంది. ఇందులో కాస్త వినోదం పంచిన పాత్ర అదే. అజయ్ ఘోస్ పాత్ర కూడా బావుంది. సప్తగిరి, వైవా హర్ష పెద్దగా నవ్వించలేదు. మిగతా పాత్రలన్నీ ఓకే.

టెక్నికల్ గా:

పక్కా కమర్షియల్ అనే టైటిల్ పెట్టుకొని పక్కా కంటెంట్ సినిమాలు చేసే జాక్స్ బెజోయ్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్నాడు  మారుతి. నేపధ్య సంగీతం ఓకే కానీ అతని పాటలు బావున్నా రిజిస్టర్ కావు. కెమరా వర్క్ బావుంది. ఎడిటింగ్ లో లేపేసే సీన్లు చాలా వున్నాయి. జడ్జ్ కి మేకప్ వేసి కోర్టు తీసుకువెళ్ళడానికి ఒక పాట ఎందుకు అర్ధం కాదు. చేతిలో రిమోట్ వుంటే ఫార్వడ్ చేసేయాలనిపించే పాటది. ఎలాంటి ఆలోచన లేకుండా ఈ పాటని కట్ చేసేయాలి. నిర్మాణ విలువలు బావున్నాయి.

ప్లస్ పాయింట్స్

గోపీచంద్, రావు రమేష్
కొన్ని కామెడీ సీన్లు
నేపధ్య సంగీతం


మైనస్ పాయింట్స్

పాత కథ
ఎమోషన్స్ మిస్ కావడం
లాజిక్ లేని కోర్టు సీన్లు

ఫైనల్ వర్దిక్ట్.. పాత కమర్షియల్


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS