ఓ స్టార్ హీరో సినిమా థియేటర్లలో విడుదల అయ్యిందంటే.. వసూళ్లు ఎన్ని వచ్చాయి? అని ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తారో, టీవీల్లో ప్రసారమైనప్పుడు టీఆర్‌పీ ఎంత కొల్లగొట్టింది? అంటూ అంతే ఆరా తీస్తారు. పెద్ద హీరోల సినిమాలకు టీఆర్‌పీ బాగానే వస్తుంటుంది. అయితే ఈమధ్య ఓటీటీలు ఎక్కువైపోయాయి. సినిమా విడులైన రెండు మూడు వారాలకే ఓటీటీలో బొమ్మ పడిపోతుంది. ఆ తరవాతెప్పుడో.. టీవీల్లోకి వస్తుంది. అంటే.. అప్పటికే అటు థియేటర్లోనూ, ఇటు ఓటీటీలోనూ సినిమా చూసేస్తారు కాబట్టి... సహజంగానే టీవీల్లో వచ్చినప్పుడు టీఆర్‌పీలు తగ్గిపోతాయి. అయితే... ఈ విషయంలో పుష్ప అతీతమని నిరూపించుకొంది.
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం `పుష్ప` బాక్సాఫీసు దగ్గర భారీ విజయాన్ని అందుకొంది. ఆ తరవాత.. ఓటీటీలో వచ్చింది. ఇప్పుడు టీవీల్లోనూ ప్రదర్శితమవుతోంది. తొలిసారి టీవీలో వచ్చినప్పుడు 24 రేటింగ్ సాధించింది. అదో రికార్డు. ఆ తరవాత రెండోసారి ప్రదర్శితమైనప్పుడు 18 రేటింగ్ వచ్చింది. మూడోసారి 10 రేటింగ్ సంపాదించుకొంది. చాలా తక్కువ సమయంలోనే మూడు సార్లు ఈ సినిమాని టీవీలో వేశారు. మూడుసార్లూ అదిరిపోయే రేటింగులు రావడం.. పుష్ప క్రేజ్‌కి నిదర్శనం. బాహుబలి సినిమా ఎన్నిసార్లు ప్రదర్శించినా మంచి రేటింగ్ వస్తుంటుంది. ఆ జాబితాలో ఇప్పుడు పుష్ప కూడా చేరిపోయింది.
పుష్ప 2 వచ్చేంత వరకూ టీవీలో.. పుష్ప 1 హంగామా కొనసాగుతూనే ఉంటుంది.