నటీనటులు : రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె, తిరువీర్ తదితరులు
దర్శకత్వం : కరుణ కుమార్
నిర్మాతలు : ధ్యాన్ అట్లూరి
సంగీతం : రఘు కుంచె
సినిమాటోగ్రఫర్ : అరుళ్ విన్సెన్ట్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు
రేటింగ్: 3/5
సినిమా అనేది వినోద సాధనమే కాదు. సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతుల్ని, సామాజిక వేత్తల్ని ఆవిష్కరించే కళా వేదిక కూడా. దురదృష్టం కొద్దీ సినిమా అనేది కమర్షియల్ విలువల మధ్య నలిగిపోతోంది. నిజాల్ని చెప్పే ధైర్యం ఎవరికీ ఉండడం లేదు. ఈ జాడ్యం, భయం తెలుగు సినిమాకే పరిమితం కాలేదు. అన్ని భాషల్లోనూ ఉంది. కానీ... మిగిలిన భాషల్లో కనీసం అప్పుడప్పుడైనా ధైర్యం చేసి కొన్ని నిజాల్ని చెప్పగలుగుతున్నారు. మన దగ్గర అలాంటి వాతావరణం అస్సలు కనిపించదు. పరభాషలో అలాంటి సినిమాలొస్తే.. రీమేక్ చేసుకోవడానికి కోట్లు కోట్లు ధారబోస్తాం, డబ్బింగుల్లో ఆదరిస్తాం, మనం ఇలాంటి ప్రయత్నాలెందుకు చేయం? అని ప్రశ్నిస్తాం.. అంతే తప్ప, ఇక్కడ ఓ తెలుగోడు... మన గోడు చెబితే ఎవ్వరికీ తలకెక్కదు. కానీ... ఒకరు ధైర్యం చేసి అలాంటి సాహసం చేస్తే, మనదైన కథనీ, వ్యధనీ ఆవిష్కరించే ప్రయత్నం చేస్తే... అదే పలాస.
* కథ
పలాసలోని మోహన్‌రావు (రక్షిత్), రంగారావు (తిరువీర్) ఇద్దరూ అన్నదమ్ములు. కళని మాత్రమే నమ్ముకుని జీవనం సాగిస్తుంటారు. . పెద్దషావుకారు (జనార్ధన్), చిన్న షావుకారు గురుమూర్తి (రఘుకుంచె) వీళ్లూ అన్నదమ్ములే. కానీ ఇద్దరికీ అస్సలు పడదు. ఒకరిపై మరొకరు ఆధిపత్యం చూపించుకోవాలని తాపత్రయపడుతుంటారు. ఒకరు ఇంకొకరిని అణగదొక్కాలన్న కసితో విర్రవీరుతుంటారు. వీళ్ల ఆధిపత్య పోరుకి మోహన్‌రావు, రంగారావు నలిగిపోతుంటారు. ఈ పోరులో మోహనరావు, రంగారావు జీవితాల్లో ఏం జరిగింది? ఆ ఊరికి ఎస్సైగా వచ్చిన సెబాస్టియన్ (రామరాజు) పాత్రేమిటి? తను చూపించిన ప్రభావం ఎలాంటిది? అనే విషయాలు తెలియాలంటే పలాస చూడాలి.
* విశ్లేషణ
1978 నేపథ్యంలో సాగే కథ ఇది. అప్పటికీ ఇప్పటికీ సాంకేతిక మారింది గానీ, సామాజిక కోణం అస్సలు మారలేదు. కులాల మధ్య అంతరాలు అస్సలు మారలేదు. ఓ వర్గం పాలించడానికి, మరో వర్గం పాలించబడడానికి మాత్రమే ఉన్నాయన్నది అక్షర సత్యం. పెద్దల ఆధిపత్య పోరులో బడుగు వర్గాలు నలిగిపోతున్నాయన్నది కఠిన నిజం. ఇదే ఈ సినిమాలో కనిపిస్తుంది. ధనిక పేద, వర్గ పోరాటాలు, కులాల ఆధిపత్యాలు ప్రతీ తరంలోనూ ఉన్నవే. దానికి పలాస వాతావరణాన్ని, అక్కడి నాగరిక చిత్రాన్నీ వేదిక చేసుకోవడం ఈ కథకు వన్నె తీసుకొచ్చింది. పలాస జీవన విధానాన్ని, అక్కడి సంస్కృతిని పరిచయం చేస్తూ.. ఓ రాజకీయ, సామాజిక జీవిన చిత్రాన్ని చెప్పాలనుకోవడం విభిన్నమైన ప్రయత్నం.
అంబేద్కరిజం అంతర్లీనంగా టచ్ చేసిన సినిమా ఇది. నిజానికి ఇలాంటి కథల్ని ఎంచుకోవడం సాహసం. ఎందుకంటే లైన్ దాటి మాట్లాడితే... కుల ముద్ర పడిపోతుంది. మరీ కుచించుకుపోయి చెబితే.. చెప్పాలనుకున్న పాయింట్ ప్రేక్షకులకు చేరదు. ఆ బోర్డర్‌ని సరిగా అర్థం చేసుకుని ఈ కథని డీల్ చేశాడు దర్శకుడు. బెల్లం ముక్క - కత్తి థియరీతో చెప్పే డైలాగ్ - మన సామాజిక, రాజకీయ దోపిడీని ఎత్తి చూపిస్తుంది. అగ్ర వర్గాలు తమ అధికారం కోసం బడుగు బలహీన జాతుల్ని ఎలా వాడుకుంటున్నాయో.... ఆ ఒక్క డైలాగ్‌తో చెప్పేశారు. ఏకలవ్యుడి బొటన వేలు డైలాగూ అంతే. మన పురాణ కాలంలో ఉన్న వెనుకబాటు, అణగద్రొక్కబడిన ధోరణిని కళ్లకు కట్టింది. అయితే ఎక్కడా బీద అరుపులు, ఉపన్యాసాలూ ఉండవు. నిజాన్ని నిర్భయంగా, ముసుగు లేకుండా చెప్పడం తప్ప.
మోహనరావు, రంగారావుల అనుబంధం, వాళ్లకు రాజకీయంగా ఎదురైన సవాళ్లు, సమాజంపై విసుగెత్తి రౌడీయిజంలోకి అడుగు పెట్టడానికి దారి తీసిన పరిస్థితులు.. ఇవన్నీ ఆసక్తికరంగా సాగుతాయి. 1970ల నాటి రాజకీయ ఎత్తుగడలు.. ఇప్పటికీ థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. మధ్యమధ్యలో శ్రీకాకుళం యాసతో సాగే వినోదం, పల్లెపాటలూ.. సరదాల్ని పంచుతాయి. ద్వితీయార్థంలో అన్నీ ప్రశ్నలే. దానికి సమాధానం వెతికే ప్రయత్నమూ చేశాడు దర్శకుడు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని ``రా``గా చెప్పాలనుకున్నాడు. దాంతో సహజత్వం ఉట్టిపడుతుంది. అయితే.. మితిమీరిన హింస, యాక్షన్ ఇబ్బంది పెడతాయి. ద్వితీయార్థంలో సీరియెస్ నెస్ ఎక్కువ. పతాక సన్నివేశాలు కట్టిపడేస్తాయి. ఈకథని ఎంత హైలో మొదలెట్టాడో, అంతే హైలో ముగించాడు దర్శకుడు. మొత్తానికి ఓరకమైన వైబ్రేషన్‌తో జనాలు థియేటర్ల నుంచి బయటకు వస్తారు.
* నటీనటులు
దర్శకుడు ఈ కథని ఎంత పకడ్బందీగా రాసుకున్నాడో, నటీనటుల ఎంపిక విషయంలోనూ అంతే చురుకు చూపించాడు. తన పాత్రకు అనువైన అనుగుణమైన నటుల్నే ఎంచుకున్నాడు. రక్షిత్ నటన, తన మాటతీరు, సంభాషణలు పలికే విధానం ఆకట్టుకుంటాయి. తనకు తప్పకుండా ఓ బ్రేక్ లభిస్తుంది.
తిరువీర్ విజృంభించేశాడు. అందరికంటే తనకే ఎక్కువ మార్కులు పడతాయి. సంగీత దర్శకుడిగా, గాయకుడిగా పరిచయమైన కుంచె రఘులో ఇంత మంచి నటుడున్నాడా అనిపిస్తుంది. నాలుగు దశల్లో ఆయన నటన.. నాలుగు విధాలుగా సాగింది. రాజరాజు, జనార్థన్ మెప్పించారు.
* సాంకేతిర వర్గం
ఈ చిత్రానికి కర్త కర్మ క్రియ అన్నీ దర్శకుడు ప్రేమ్ కుమారే. తన ఆలోచనా విధానం, సమాజాన్ని చూసే కోణం ఈ చిత్రంలో అడుగడుగునా కనిపిస్తాయి. సంభాషణలు చురుక్కుమనిపించాయి. ఫొటోగ్రఫీ అప్పటి జీవితాన్ని కళ్లకు కట్టింది.
రఘు కుంచె సంగీత దర్శకుడిగానూ మార్కులు కొట్టేశాడు. ట్యూన్లు కొత్తగా అనిపించాయి. నేపథ్య సంగీతం ప్రాణం పోసింది. ఇలాంటి చిత్రాలు తెరకెక్కించడం ఓ సాహసం. కమర్షియల్‌గా ఏ స్థాయిలో ఉంటుందన్నది చెప్పలేం గానీ, తప్పకుండా ఓ కుదుపుని తీసుకొచ్చే చిత్రమిది. అవార్డుల వేటలో ఈ సినిమా ముందుండొచ్చు.
* ప్లస్ పాయింట్స్
కథా నేపథ్యం
పతాక సన్నివేశాలు
సంభాషణలు
సాంకేతిక వర్గం
* మైనస్ పాయింట్స్
మితిమీరిన యాక్షన్
ఫైనల్ వర్డిక్ట్: రాజకీయ జీవిన చిత్రం.