త్రివిక్రమ్ తిరుగులేని దర్శకుడు, రచయిత. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలూ లేవు. తాజాగా అల వైకుంఠపురముతో మరో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా ఇండ్రస్ట్రీ హిట్‌ని అందించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు.
అయితే త్రివిక్రమ్ పై ముందు నుంచీ ఓ కంప్లైంట్ ఉంది. తన కథల్లో వర్జినాలిటీ ఉండదని, ఏదో ఓ పాయింట్‌ని, ఎక్కడో ఒక చోట నుంచి ఎత్తేసి తెలివిగా కథలు అల్లుతాడని చెబుతుంటారు. అతడు, అఆ, అజ్ఞాతవాసి సినిమాలకు ఈ విమర్శని ఎక్కువగా ఎదుర్కున్నాడు. ఇండ్రస్ట్రీ హిట్ - అల వైకుంఠపురములో కూడా కాపీ కథే అన్న అపవాదు ఎదుర్కొంది. ఇంటి గుట్టు సినిమానే త్రివిక్రమ్ మరో స్టైల్‌లో తీశాడని విమర్శించారు. అయితే ఇప్పుడూ అదే పని చేయబోతున్నాడు.
ఎన్టీఆర్ తో త్వరలో తీయబోతున్న సినిమాకి స్ఫూర్తి... మంత్రిగారి వియ్యంకుడు అనే సినిమా అట. చిరంజీవి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ కథని స్ఫూర్తిగా తీసుకుని.. ఎన్టీఆర్ కోసం స్క్రిప్టు రెడీ చేశాడని వార్తలొస్తున్నాయి. ఇదే నిజమైతే.. మరోసారి త్రివిక్రమ్ విమర్శలకు గురి కావాల్సివస్తుంది. అయితే ఎక్కడి నుంచి ఎలాంటి పాయింటు ఎత్తుకొచ్చినా, ఆ కథని హిట్ చేయడం కీలకం. అదే అవసరం. ఎన్టీఆర్ సినిమానీ సూపర్ హిట్ చేసేస్తే ఆ ఆనందంలో కాపీ కథో, అసలు కథో.. అన్నది మర్చిపోతారు. త్రివిక్రమ్‌కి కూడా కావల్సింది అదే కదా.