నటీనటులు : విజయ్ దేవరకొండ, రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథెరిన్ ట్రెసా ఇజబెల్ లెయిట్ తదితరులు
దర్శకత్వం : క్రాంతి మాధవ్
నిర్మాతలు : క్రియేటీవ్ కమర్షియల్స్
సంగీతం : గోపి సుందర్
సినిమాటోగ్రఫర్ : జయ కృష్ణ గుమ్మడి
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు
రేటింగ్: 2.75/5
విజయ్ దేవరకొండ ఇప్పుడో స్టార్ అయిపోయాడు. తన ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. దాని వల్ల ఎంత ప్లస్సో... అంత మైనస్ అవుతోంది. ఇది వరకు తనకు నచ్చిన కథల్ని ఎంచుకునేవాడు. ఇప్పుడు అభిమానులకు నచ్చేలా అన్నీ ఉన్నాయా, లేదా? అని చూసుకోవాల్సివస్తోంది. దాంతో ఒత్తిడి పెరుగుతోంది. ఇష్టపడి చేసిన `డియర్ కామ్రేడ్` సినిమా ఫ్లాప్ అవ్వడంతో, అది మరింత ఎక్కువైంది. ఈసారి కూడా ఓ ప్రేమకథ ఎంచుకున్నాడు. అదే వరల్డ్ ఫేమస్ లవర్. దీన్ని ప్రేమ కథ అనేదానికంటే, ప్రేమకథలు అనాలేమో.? తనలోని నటుడ్ని వివిధ కోణాల్లో బయటపెట్టే ఆస్కారమున్న కథ ఇది. మరి ఇది ఫ్యాన్స్ కి నచ్చే విషయాలు ఇందులో ఉన్నాయా? ఆర్థికంగా ఏ మేరకు నిలబడుతుంది?
* కథ
గౌతమ్ (విజయ్ దేవరకొండ), యామిని (రాశీఖన్నా) ఇద్దరూ ప్రేమికులు. సహజీవనం చేస్తుంటారు. గౌతమ్ కి రచయిత కావాలని ఆశ. అందుకే ఉద్యోగాన్ని సైతం వదిలేసి.. రచనపై దృష్టి పెడతాడు. కానీ... ఉద్యోగాన్ని ఎప్పుడైతే వదిలేశాడో, అప్పటి నుంచీ తన లైఫ్ స్టైల్ చాలా బోరింగ్‌గా సాగుతుంటుంది. ఇష్టమైన వ్యాపకంపై కూడా మనసు పోదు. ఒక్క కథ కూడా రాయడు. గౌతమ్ జీవన శైలి చూసి యామిని చీదరించుకుంటుంది. నీతో ఉండలేను... అంటూ బ్రేకప్ చెప్పేసి వెళ్లిపోతుంది. యామిని విరహంలో... గౌతమ్‌లోని రచయిత బయటకు వస్తాడు. శీనయ్య, సువర్ణ... లాంటి పాత్రలతో కథలు రాయడం మొదలెడతాడు. ఈ క్రమంలో మనిషిగా, ప్రేమికుడిగా తనని తాను ఎలా మార్చుకోగలిగాడు? గౌతమ్ - యామిని ఇద్దరూ మళ్లీ కలుసుకున్నారా, లేదా? అనేది వరల్డ్ ఫేమస్ లవర్ చూసి తెలుసుకోవాలి.
* విశ్లేషణ
ఓ రచయిత... తనో ఊహా ప్రపంచంలోకి వెళ్లడం, అలా వెళ్లి కొత్త పాత్రల్ని సృష్టించుకోవడం, ఆ కథలో హీరో కనిపించడం నిజంగా కొత్త ఆలోచన. `నేను ఇలా పుట్టుంటే ఎలా ఉండేవాడినో` అని అనుకుని కథానాయకుడు తనతో పాటు ప్రేక్షకుల్ని ప్రయాణం చేయించడం నిజంగానే ఇప్పటి వరకూ తెలుగు సినిమాల్లోనే రాలేదు. ఈ ఆలోచనకు నిర్మాత, హీరో ఫ్లాట్ అయిపోయి ఉంటారు. దానికి తోడు శీనయ్య - సువర్ణ లాంటి పాత్రలు బాగా రాసుకోవడంతో.. ఇల్లెందు ఎపిసోడ్ బాగా రక్తి కట్టింది. బొగ్గు గనుల నేపథ్యంలో సాగిన ఈ ప్రేమకథ కొత్తగా ఉండకపోవొచ్చు గానీ, ఆ ఎమోషన్స్‌కీ, శీనయ్య క్యారెక్టరైజేషన్‌కీ, సువర్ణ ప్రేమలోని బాధకీ కనెక్ట్ అవుతారు. దాంతో తొలి సగం పెద్దగా కంప్లైంట్స్ ఉండవు. ద్వితీయార్థంలో కథ పారిస్‌కి షిఫ్ట్ అవుతుంది.
ఈ కథ మాత్రం బోరింగ్‌గా, మరింత రొటీన్‌గా సాగుతుంది. ఓ విదేశీ వనితతో, గౌతమ్ నడిపిన ప్రేమ కథ ఇది. ఇందులోనూ పెయిన్ చూపించాలని దర్శకుడు తాపత్రయపడ్డాడు. అందుకే కథానాయికకు కళ్లు లేకుండా చేశాడు. ఆ కళ్లని హీరో త్యాగం చేయడంతో కథలో పెయిన్ వస్తుందని భావించాడు దర్శకుడు. కానీ... బతికున్న మనిషి రెండు కళ్లనీ దానం చేయడం.. విడ్డూరంగా తోస్తుంది. అక్కడ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు దర్శకుడు. `కథలో మాత్రం ఇలా జరుగుతుంది.. నిజ జీవితంలో ఇలా జరగదు` అంటూ క్లైమాక్స్ లో కథానాయకుడు ఓ డైలాగ్ విసిరాడు. సినిమాల్లో మాత్రమే ఇలా జరుగుతాయి, బయట జరగవు.. అని చెప్పుకోవడానికి చాలా అంశాలు ఈ సినిమాలో కనిపిస్తాయి. పతాక సన్నివేశాల్ని మరింత సినిమాటిక్‌గా తీర్చిదిద్దాడు దర్శకుడు.
సినిమా అంతా ఎమోషనల్ డ్రైవ్‌గా సాగుతుంది. సీరియస్‌నెస్ ఎక్కువ. ఎక్కడా రిలీఫ్‌కి ఛాన్స్ ఉండదు. ప్రేమకథలన్నీ ఒకే రీతిన ఉండడం పెద్ద మైనస్. గౌతమ్ క్యారెక్టరైజేషన్‌లో అర్జున్ రెడ్డి ఛాయలు కనిపిస్తాయి. దాన్ని తగ్గించుకుంటే బాగుండేది. ఓ కథని కొత్తగా మొదలెట్టిన దర్శకుడు.. రొటీన్ స్క్రీన్ ప్లే రాసుకుని, రొటీన్‌గా ముగించడం ఇంకా పెద్ద మైనస్. కథలోని కొన్ని చోట్ల ప్రేక్షకులు ఎమోషన్‌కి కనెక్ట్ అవుతారు. విజయ్, రాశీఖన్నా, ఐశ్వర్యల నటన, కొన్ని సంభాషణలు ఈ సినిమాకి వెన్నుదన్నుగా నిలవాలి.
* నటీనటులు
విజయ్ దేవరకొండని మూడు రకాల షేడ్స్‌లో చూపించిన సినిమా ఇది. అన్నిచోట్లా.. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా శీనయ్య పాత్రకు మంచి మార్కులు పడతాయి. ఆ ఎపిసోడ్‌లో ఐశ్వర్య రాజేష్ కూడా తక్కువ తినలేదు. విజయ్‌కి ధీటుగా నటించింది.
రాశీఖన్నా ఎప్పుడూ ఏడుస్తూనే కనిపించింది. తన పాత్రకు సింపథీ ఇవ్వడానికి అలా డల్ గా మార్చేశాడేమో దర్శకుడు. కేథరిన్ పాత్రకు నిడివి ఎక్కువే. కానీ.. అంతగా ప్రభావితం చేయలేకపోయింది. ఇజాబెల్లాదీ అదే పరిస్థితి.
* సాంకేతిక వర్గం
క్రాంతి మాధవ్ కొత్త లైనే పట్టుకున్నాడు. దాన్ని డీల్ చేసిన విధానం అక్కడక్కడ నచ్చుతుంది. కొన్ని చోట్ల బోర్ కొట్టించాడు. ప్రేమకథల్లో నవ్యత లేకపోవడం పెద్ద లోటు. సంభాషణలు బాగున్నాయి.
ఫొటోగ్రఫీ, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. పాటలు ఇంకాస్త బాగుండాల్సింది. నిర్మాణ విలువల విషయంలో రాజీ పడలేదు. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉండాల్సింది.
* ప్లస్ పాయింట్స్
శీనయ్య - సువర్ణ కథ
విజయ్, ఐశ్వర్యల నటన
* మైనస్ పాయింట్స్
సెకండాఫ్
బోరింగ్ సీన్లు
* ఫైనల్ వర్డిక్ట్: కొంతమందికి మాత్రమే నచ్చే ప్రేమికుడు